
త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందం: ట్రంప్
అన్ని అంశాలను చర్చించామని ప్రకటన
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మాదిరిగా కాకుండా, ఈసారి భిన్నమైన ఒప్పందం ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్టేనని తెలిపారు. ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.
ఇదిలా ఉంటే, ఈ నెల ప్రారంభంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్‌తో మిల్వాకీ, వాషింగ్టన్‌లలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం మొదటి దశ ముసాయిదాను ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. అయితే, అమెరికా సుంకాల విధానంలో మార్పులు రావడంతో ఒప్పందంపై మరిన్ని చర్చలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుంది, దాని నిబంధనలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

