హర్ముజ్ జలసంధి మాదే, మా మాటే ఫైనల్: ఇరాన్
x

హర్ముజ్ జలసంధి మాదే, మా మాటే ఫైనల్: ఇరాన్

ఇరాన్ త్వరగా శాంతి ఒప్పందానికి రాకపోతే ఆ దేశానికి "చాలా దారుణమైన రోజులు" ఎదురవుతాయని హెచ్చరించారు.


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ‘హర్మోజ్ జలసంధి’ (Strait of Hormuz) తమదేనని, అక్కడ తాము చెప్పిందే సాగాలని ఇరాన్ తేల్చిచెప్పింది. హర్మోజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై టోల్ టాక్స్ వసూలు చేయడంతో పాటు సరికొత్త ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. శత్రు దేశాలకు చెందిన సైనిక సంపత్తిని ఈ జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

మరోవైపు ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ త్వరగా శాంతి ఒప్పందానికి రాకపోతే ఆ దేశానికి "చాలా దారుణమైన రోజులు" (Very bad time) ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రపంచం ఇప్పుడు ఒక "కొత్త ఆర్డర్" ముంగిట నిలబడిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ వ్యాఖ్యానించారు.
లెబనాన్‌కు $2 బిలియన్ల నష్టం..
ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ గడువును మరో 45 రోజులు పొడిగించినట్లు చర్చల ప్రతినిధులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగడం లేదు. గడిచిన రెండు రోజుల్లోనే లెబనాన్‌లోని 100 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల లెబనాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఆమేర్ బిసత్ తెలిపారు. యుద్ధం వల్ల లెబనాన్ దాదాపు 2 బిలియన్ డాలర్ల (దేశ జీడీపీలో 7 శాతం) మేర నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉపాధి కోల్పోయారని, ఫ్యాక్టరీలు, వ్యవసాయం పూర్తిగా స్తంభించిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది కాల్పుల విరమణ కాదు, మమ్మల్ని చూసి నవ్వుకోవడం. ఇజ్రాయెల్ ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి" అని లెబనాన్ శరణార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాజాలో ఆగని రక్తపాతం:
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. శనివారం జరిగిన దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఖాన్ యూనిస్, అల్-బురేజ్ శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ భారీగా ఫిరంగి దాడులు జరిపింది. గాజా సిటీ తీరం వైపు ఇజ్రాయెల్ యుద్ధనౌకలు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం.
యూరోవిజన్ వేదికగా ఇజ్రాయెల్ రచ్చ:
వియన్నాలో జరిగిన ‘యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్’లో ఇజ్రాయెల్ ప్రదర్శనకారుడు నోమ్ బెట్టన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు నిరసనగా స్పెయిన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పందిస్తూ.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌పై జరిగిన దుష్ప్రచారానికి బెట్టన్ సాధించిన విజయం తగిన సమాధానమని విమర్శించారు.
ఇతర ముఖ్య పరిణామాలు:..
ఇరాన్‌పై దాడులు పునఃప్రారంభించడానికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై రష్యా ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ గత వ్యూహాత్మక తప్పుల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ఆయన విమర్శించారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావంతో కొమొరోస్ దీవుల్లో ఇంధన ధరలు (ముఖ్యంగా డీజిల్ 46 శాతం) భారీగా పెరిగాయి. దీనికి నిరసనగా జరిగిన ఆందోళనల్లో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.
హెజ్బొల్లా ప్రతిఘటన: దక్షిణ లెబనాన్‌లో ముందుకు దూసుకువస్తున్న ఇజ్రాయెల్ మిలిటరీ బుల్డోజర్లను హెజ్బొల్లా శ్రేణులు పేలుడు పదార్థాలతో అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్ సైనిక వాహనాలపై రాకెట్లతో విరుచుకుపడ్డాయి.
Read More
Next Story