24 గంటల్లోనే హర్మోజ్ జలసంధిని మూసేసిన ఇరాన్!
x

24 గంటల్లోనే హర్మోజ్ జలసంధిని మూసేసిన ఇరాన్!

ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టీకరణ


ఇరాన్ అన్నంత పని చేసింది. ట్రంప్ ఇదే మాదిరి బెదిరిస్తుంటే హర్మోజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. సరిగ్గా 24 గంటల తర్వాత - తెరుచుకున్న హర్మోజ్ జలసంధి- మళ్లీ మూతపడింది. హర్మోజ్ జలసంధిని తెరచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే.. మళ్లీ దానిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ (Iran) ప్రకటించింది. ఇందుకు అమెరికా ధోరణే కారణమని ఆరోపించింది. ఇరాన్‌ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్‌ సంయుక్త మిలిటరీ కమాండ్‌ పేర్కొంది.

అసలేం జరిగింది...

ఇరాన్ విదేశాంగ మంత్రి హర్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరుస్తున్నట్లు ప్రకటించినప్పటికీ స్పీకర్ గాలిబాఫ్ దానికి ఒక షరతు విధించారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం, ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే, హర్మోజ్ జలసంధి మళ్లీ మూసేస్తామన్నారు. అంటే, తమ ఓడరేవులను అమెరికా దిగ్బంధిస్తే, తాము ప్రపంచానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని, త్వరలోనే యుద్ధం ముగిసిపోతుందని వరుసగా పోస్ట్‌లు పెడుతున్నారు. దీన్ని ఇరాన్ ఖండించింది.
"హర్మోజ్ జలసంధి నుంచి ప్రయాణించేందుకు అనుమతులు సోషల్ మీడియా (X/Twitter) ద్వారా లభించవు" అని ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో అమెరికా తన ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న యురేనియంను (Enriched Uranium) అమెరికాకు బదిలీ చేసేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది.
ఇది పూర్తిగా అవాస్తవమని, తమ అణు నిల్వలను ఇతర దేశాలకు బదిలీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చర్చల్లో అసలు ఈ అంశమే ప్రస్తావనకు రాలేదని ఇరాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

దిగ్బంధంపై ప్రతిఘటన

అమెరికా నౌకాదళం ప్రస్తుతం ఇరాన్ వైపు వస్తున్న సుమారు 21 నౌకలను వెనక్కి పంపివేసింది. ఈ చర్యలను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించబోమని, ఒకవేళ అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే యుద్ధం మరింత తీవ్రం అవుతుందని ఇరాన్ హెచ్చరించింది. "మీరు మా ఓడరేవులను దిగ్బంధిస్తే, మేము ప్రపంచానికి చమురు సరఫరా చేసే మార్గాన్ని (హర్మోజ్) మూసివేస్తాం" అనేది ఇరాన్ చేసిన ప్రధాన హెచ్చరిక. ఇప్పుడు అన్నంత పనీ చేసింది.
‘హర్మోజ్ జలసంధిపై నియంత్రణ మునుపటి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం మా సాయుధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం.. జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుంటాం’’ అని ఇరాన్‌ సంయుక్త మిలిటరీ కమాండ్‌ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హర్మోజ్ దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ఈ స్పందన వచ్చింది.
Read More
Next Story