అమ్మయ్యా, హర్మోజ్ తెరుచుకుంది, ఆయిల్ గండం గడిచింది!
x

అమ్మయ్యా, హర్మోజ్ తెరుచుకుంది, ఆయిల్ గండం గడిచింది!

షరతులతో హర్మోజ్ జలసంధిని తెరిచిన ఇరాన్


ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధి (Strait of Hormuz) పునఃప్రారంభం కావడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంది. లెబనాన్‌లో ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణకు అనుగుణంగా, వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ మార్గాన్ని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అధికారికంగా ప్రకటించారు.
హర్మోజ్ తెరిచిన ఇరాన్..
లెబనాన్‌లో 10 రోజుల పాటు కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మోజ్ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణలతో సంతృప్తి చెందబోమని, ప్రాంతీయంగా యుద్ధానికి సమగ్ర ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.
ట్రంప్ పట్టుదల: నౌకా దిగ్బంధనం కొనసాగుతుంది
ఇరాన్ హర్మోజ్ జలసంధిని తెరిచినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోలేదు.
శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధనం (Naval Blockade) కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా నౌకాదళం నిఘాను మరింత కఠినతరం చేస్తోంది.
లెబనాన్‌లో సంబరాలు..
మరోవైపు, లెబనాన్‌లో 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించడంతో అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ అధికారుల మధ్య చర్చలు జరపడానికి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ విరామాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని మధ్యప్రాచ్య దేశాలు ఆశిస్తున్నాయి.
ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం..
హర్మోజ్ జలసంధి తెరవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా మెరుగుపడి, ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండటంతో అగ్రరాజ్యం మరియు ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన కూడా నెలకొంది.
Read More
Next Story