
శ్రీలంక: ఈస్టర్ పేలుళ్ల పై కోర్టు సంచలన తీర్పు
ఒక్కొ ఉగ్రవాదికి 200 ఏళ్ల జైలు శిక్ష
శ్రీలంకలో 2019 ఈస్టర్ పండగ సందర్భంగా జరిగిన పేలుళ్లలో ప్రమేయం ఉన్న 24 మందిలో 15 మందిని శ్రీలంక కోర్టు దోషులుగా నిర్దారించింది. వారికి ఒక్కొక్కరికి 200 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. ఐసిస్‌తో సంబంధాలున్న స్థానిక ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్‌కు చెందిన తొమ్మిది మంది ఆత్మాహుతి బాంబర్లు, 2019 ఏప్రిల్ 21న మూడు క్యాథలిక్ చర్చిలు, మూడు విలాసవంతమైన హోటళ్లను ధ్వంసం చేస్తూ వరుస పేలుళ్లకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో 11 మంది భారతీయులతో సహా దాదాపు 270 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. కొలంబో శాశ్వత హైకోర్టు ట్రయల్-ఎట్-బార్ ఈ పదిహేను మంది నిందితులకు ఒక్కొక్కరికి 220 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వారి స్థిరచరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు నవరత్నే మారసింఘే, రామనాథన్ కన్నన్, సుజీవ నిస్సంకలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల హైకోర్టు ట్రయల్-ఎట్-బార్ మంగళవారం తన తీర్పును ప్రకటించింది. ఇందులో 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా, మరో తొమ్మిది మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. దాదాపు ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం, ప్రధాన నిందితుడైన మొహమ్మదు ఇబ్రహీం మొహమ్మదు నౌఫర్ అలియాస్ నౌఫర్ మౌలవి కూడా కోర్టు దోషిగా నిర్ధారించిన వారిలో ఉన్నారు.
ప్రారంభంలో, బాంబు దాడులలో వారి పాత్రకు గాను 25 మంది నిందితులపై అభియోగాలు నమోదు అయ్యాయి. అనుమానితులలో ఒకరు మరణించడంతో, అక్టోబర్ 2021లో 24 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వారిపై మొత్తం 23,270 అభియోగాలు దాఖలు చేయగా, ప్రాసిక్యూషన్ తరఫున 2,309 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.
హత్యా, హత్యాయత్నం, ఉగ్రవాదానికి పాల్పడటానికి కుట్ర, నేరానికి సహాయం చేయడం, ప్రోత్సహించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కలిగి ఉండటం, నిర్వహించడం వంటి నేరాలకు గాను నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం (PTA) కింద అభియోగాలు మోపబడ్డాయి. నేషనల్ తౌహిత్ జమాత్ నాయకుడైన తీవ్రవాది జహ్రాన్ హషీమ్‌తో నౌఫర్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు జరిగింది.
షాంగ్రి లా హోటల్‌లో జరిగిన పేలుడుకు పాల్పడిన ఆత్మాహుతి బాంబర్లలో హషీమ్ ఒకడు. జూలైలో, దాడులను నివారించగలిగే ముందస్తు నిఘా సమాచారంపై చర్యలు తీసుకోనందుకు, విధి నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం కింద దోషులుగా తేలిన తర్వాత, అప్పటి పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర, రక్షణ మంత్రిత్వ శాఖలోని అప్పటి ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలకు మరణశిక్ష విధించారు.
ముందస్తు నిఘా సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ దాడులను నివారించడంలో విఫలమైనందుకు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, అప్పటి ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేలపై నిందలు పడటంతో ఈ దాడి ఒక రాజకీయ కుదుపునకు దారితీసింది.
దాడుల తర్వాత సిరిసేన నియమించిన అధ్యక్ష విచారణ కమిటీ, విచిత్రంగా దాడులను నివారించడంలో విఫలమైనందుకు అప్పటి అధ్యక్షుడినే దోషిగా నిర్ధారించింది. అయితే, కమిటీ నివేదికల తర్వాత దాఖలైన కేసులో సిరిసేన ఆ అభియోగాన్ని తాను అంగీకరించడం లేదని తెలిపారు.
2023లో వెలువడిన ప్రాథమిక హక్కుల పిటిషన్ల తీర్పులలో, పేలుడు బాధితుల కుటుంబ సభ్యులకు కోట్లాది రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిరిసేనను, ఉన్నత రక్షణ శాఖను ఆదేశించారు.
Next Story

