ట్రంప్, షటప్! అయితే ఓకే!  ఇరాన్ వీడియో వైరల్
x
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

'ట్రంప్, షటప్! అయితే ఓకే!' ఇరాన్ వీడియో వైరల్

మన బ్రహ్మానందాన్ని మించిపోయిన తీరులో ట్రంప్


ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు పెద్దఎత్తున వైరల్ అయింది. అంతర్జాతీయ రాజకీయాల్లో మాటల యుద్ధం ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ (Ceasefire) గడువు పొడిగింపును ఎద్దేవా చేస్తూ ఇరాన్ మద్దతుదారులు సృష్టించిన ఓ AI-Generated వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఏముంది ఆ వీడియోలో?

ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గురించి మొబైల్ చూస్తూ మాట్లాడుతుంటారు. ఇరాన్ తో చర్చలు బాగా జరిగాయని మొబైల్ చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఆయన ఎదురుగా ఇరాన్ ప్రతినిధులు ఎవరూ ఉండరు, ఇది చూసిన వాళ్లకు నవ్వు వస్తుంది.
ఇక రెండో డైలాగ్ లో ఇరాన్ గనుక రెండో విడత చర్చలకు రాకపోతే ఇరాన్ పీచమణుస్తానని, బాంబులు వేస్తామని గట్టిగా అరుపులు కేకలతో చెబుతుంటాడు. కానీ ఆయన ముందు ఎవరు ఉండరు, ఇరాన్ వైపు సీట్లు ఖాళీగా కనిపిస్తుంటాయి..
అప్పుడు స్క్రీన్ పై 2000 వేల ఏళ్ల తర్వాత అని ఇంగ్లీషులో వస్తుంది..
అప్పుడు ట్రంప్... ఇరానియన్లు ఎక్కడా అని అరుస్తుంటాడు. ఆయన ముందు ఎవరూ ఉండరు.. ఇంతలో సూటూ బూటు వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి- సర్, ఇది ఇరాన్ నుంచి వచ్చిన మెసేజ్- అని ఓ పేపర్ ను ట్రంప్ చేతికి ఇస్తాడు. ట్రంప్ దాన్ని తెరిచి చూసుకుంటాడు. అందులో - 'Trump, shut up' (ట్రంప్, నోరు మూసుకో) అని పెద్దక్షరాలలో రాసి ఉంటుంది.
దాని చూసిన ట్రంప్ మన హాస్యనటుడు బ్రహ్మానందం స్టైల్లో.. సరే అయితే, పాకిస్తాన్ రిక్వెస్ట్ పై నేను కాల్పుల విరమణను పొడిగిస్తున్నాను- అని చెప్పుకుంటూ లోపలికి వెళ్లిపోతుండగా తెర వెనుక నుంచి పెద్దఎత్తున నవ్వులు వినిపిస్తాయి.
దీని నేపథ్యం ఏమిటంటే.. పాకిస్తాన్ కాళ్లావెళ్లాపడి బతిమిలాడడం వల్లే కాల్పుల విరమణ పొడిగించానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాన్ తో యుద్ధం చేస్తూ పాకిస్తాన్ వినతి మేరకు కాల్పుల విరమణ ఏమిటన్నది నెటిజన్ల ఎద్దేవా.
ఇరాన్ మద్దతుదారులు చెప్పాలనుకున్నది ఒక్కటే—అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, గడువులు విధించినా ఇరాన్ వాటిని లెక్కచేయదు. ట్రంప్‌ను ఒక బలహీనమైన వ్యక్తిగా, ఇరాన్‌ను ధైర్యంగా ఎదురుదాడి చేసే దేశంగా చూపించడమే ఈ AI సంభాషణ ప్రధాన ఉద్దేశ్యం. 'Trump, shut up' (ట్రంప్, నోరు మూసుకో) అనే నినాదంతో ఆయనను అడ్డుకున్నట్లు చూపించారు.
అత్యున్నత స్థాయి కృత్రిమ మేధను ఉపయోగించి ట్రంప్ హావభావాలను, గొంతును అచ్చుగుద్దినట్లుగా సృష్టించారు. అమెరికా శాంతి చర్చల పేరుతో కేవలం సమయాన్ని వృధా చేస్తోందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఇరాన్ ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నిస్తోంది.
రాజకీయ నేపథ్యం
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా చొరవతో జరుగుతున్న కాల్పుల విరమణ చర్చలపై ఇరాన్ మొదటి నుంచీ అపనమ్మకంతో ఉంది. అమెరికా కేవలం ఇజ్రాయెల్‌కు సహకరించడానికే ఈ 'గడువు పొడిగింపు' మంత్రాన్ని వాడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది.
యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, డిజిటల్ మాధ్యమాల్లో కూడా జరుగుతోందని ఈ AI వీడియో నిరూపిస్తోంది. ప్రత్యర్థి దేశాధినేతను కించపరిచేలా వీడియోలు రూపొందించడం ద్వారా ప్రజల్లోకి తమ భావజాలాన్ని తీసుకెళ్లడం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.
అమెరికా అధికారులు ఈ వీడియోపై స్పందిస్తూ, ఇది ఇరాన్ ప్రచారంలో భాగంగా చేసిన 'డిజిటల్ డిసెప్షన్' (డిజిటల్ మోసం) అని కొట్టిపారేశారు. అయితే, ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మందికి చేరిపోవడంతో, అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో AI ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story