
భారతీయ నౌకను ముంచేసిందెవరు?
పశువుల లోడుతో వెళుతున్న ఇండియన్ నౌకపై క్షిపణి దాడి..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న పోరుకు తోడు, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇరాన్ జలాల సమీపంలో ఒక నౌకను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. భారతీయ కార్గో నౌక మునిగిపోయింది. ఈ నౌక ఎలా మునిగిందనే దానిపై భిన్న కథనాలు వినపడుతున్నాయి. దీంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి.
హార్ముజ్ వద్ద ఏం జరిగింది?
యూఏఈలోని ఫుజైరా తీరానికి సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక వాణిజ్య నౌకను గుర్తుతెలియని వ్యక్తులు స్వాధీనం చేసుకున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. ఆ నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లించినట్లు సమాచారం.
మరోవైపు, సోమాలియా నుంచి యూఏఈకి వెళ్తున్న 'హాజీ అలీ' అనే భారతీయ కార్గో నౌకపై ఒమన్ తీరంలో దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో మంటలు చెలరేగి అది సముద్రంలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ, అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. సాధారణ (సివిల్) నౌకలపై ఇలాంటి దాడులు జరగడం "ఆమోదయోగ్యం కాదు" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
నౌక ఎలా మునిగింది?
ఈ నౌకపై డ్రోన్ లేదా మిస్సైల్ (క్షిపణి) ద్వారా దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. మే 13, బుధవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ఒమన్ ఉత్తర తీరంలోని 'లిమా' (Limah) సమీపంలో ఈ ఘటన జరిగింది.
గుర్తుతెలియని పేలుడు పదార్థం నౌకను బలంగా తాకడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీనివల్ల నౌక నియంత్రణ కోల్పోయి, క్రమంగా సముద్రంలో మునిగిపోయింది.
ఈ నౌక సోమాలియా నుంచి పశువుల లోడుతో యూఏఈలోని షార్జాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లా 'సలాయ' పోర్టుకు చెందిన నౌక.
ఎవరు ముంచేశారు?
ఈ దాడికి పాల్పడింది ఎవరు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
ఒమన్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ దాడిని తీవ్రంగా ఖండించింది కానీ, ఏ దేశం లేదా గ్రూపు పేరును నేరుగా ప్రస్తావించలేదు.
గతంలో కూడా కొన్ని భారతీయ నౌకలపై దాడులు జరిగినప్పుడు భారత్ ఇరాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
సిబ్బంది పరిస్థితి ఎలా ఉందంటే..
నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి లైఫ్ బోట్ల ద్వారా తప్పించుకున్నారు. వారిని ఒమన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించి, ప్రస్తుతం ఒమన్‌లోని దిబ్బా (Dibba) పోర్టుకు తరలించారు. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని భారత ప్రభుత్వం ధృవీకరించింది.
రాజకీయ వేదికలపై రచ్చ
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ ఈ సెగ తగిలింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా, ఇజ్రాయెల్‌ల తీరును "అక్రమ దురాక్రమణ"గా అభివర్ణించారు. గల్ఫ్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల విషయంలో ఇరాన్, యూఏఈ మధ్య వాడీవేడీ చర్చలు జరగడంతో రష్యా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియాలోని అస్థిరత ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు ముప్పుగా మారిందని హెచ్చరించారు. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు.
రంగంలోకి అగ్రరాజ్యాలు
హార్ముజ్ జలసంధిని మూసివేసే ప్రసక్తే లేదని, అది అంతర్జాతీయ వాణిజ్యానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బీజింగ్‌లో జరిగిన చర్చల సందర్భంగా ఏకాభిప్రాయానికి వచ్చారు.
Next Story

