ఇదీ పనికి రాని ముచ్చటే, అమెరికాతో ముఖాముఖికి ఇరాన్ నో
x
ఇరాన్ తో చర్చలకు వచ్చిన ట్రంప్ అల్లుడు జరేద్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ ఉల్ఫ్

ఇదీ పనికి రాని ముచ్చటే, అమెరికాతో ముఖాముఖికి ఇరాన్ నో

ఇరాన్ మెలిక.. పాక్ వేదికగా జరుగుతున్న చర్చలపై నీలినీడలు!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే నోరు పారేసుకుంటున్నందున ఈ చర్చల పట్ల ఇరాన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇవి పేరుకే శాంతి చర్చలు తప్ప అమెరికా తన వైఖరి మార్చుకోవడం లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అందుకే ఈసారి అమెరికా ప్రతినిధిబృందంతో ముఖాముఖి చర్చలకు నో చెప్పింది. దీంతో పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న మలివిడత చర్చలపై సందిగ్ధత నెలకొంది. చర్చలకు ఇరుపక్షాలు సిద్ధమైనప్పటికీ.. తాము అమెరికా ప్రతినిధులతో నేరుగా ముఖాముఖి మాట్లాడే ప్రసక్తే లేదని ఇరాన్ తెగేసి చెప్పడం చర్చల ఫలితంపై అంచనాలను తగ్గించేస్తోంది.
ప్రత్యక్ష చర్చల్లేవ్.. ఇరాన్ స్పష్టం
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం చర్చల కోసం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, ఈ భేటీలో తాము అమెరికా ప్రతినిధులతో ముఖాముఖి కూర్చోబోమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ స్పష్టం చేశారు. తాము చెప్పాలనుకున్నది పాకిస్థాన్ అధికారుల ద్వారా అమెరికాకు చేరవేస్తామని తెలిపారు. అగ్రరాజ్యానికి తాము చెప్పాలనుకున్న విషయాలను పాక్ అధికారులకే వివరిస్తామని తేల్చి చెప్పారు.
ట్రంప్ షరతులు అంగీకరిస్తేనే...
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత డిమాండ్లనే మరోసారి పునరుద్ఘాటించారు. తాజా చర్చల్లో ఇరాన్ తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రతిపాదనలు చేస్తేనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏ ఒప్పందమైనా జరుగుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా, టెహ్రాన్ తమ వద్ద నిల్వ ఉంచిన శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవాలని, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
ఫలితం లేని చర్చలేనా?
అమెరికా తన షరతులపై పట్టుబడుతుండగా, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకే నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ద్వారా ఏమైనా సానుకూల ఫలితాలు వస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాక్ అధికారుల ద్వారా జరిగే పరోక్ష చర్చలు పశ్చిమాసియాలో శాంతికి బాటలు వేస్తాయా? లేక కేవలం కాలయాపనగా మిగిలిపోతాయా? అనేది వేచి చూడాలి. అమెరికా తరఫున డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.
Read More
Next Story