
నెతన్యాహూ, నీ దొంగ వ్యవహారం మాకు ముందే తెలుసు!
“ఇజ్రాయెల్‌తో కుమ్మక్కు క్షమించరాని నేరం… అందుకు బాధ్యుల్ని తప్పక నిలదీస్తాం”: ఇరాన్
ఇరాన్- అమెరికా దేశాల యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ మరోసారి రహస్య దౌత్యానికి తెరలేపారు. ఇప్పుడీ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. “చరిత్రాత్మక పర్యటన” అంటూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనను, UAE విదేశాంగ శాఖ ఖండించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
అసలు నెతన్యాహూ ఎమిరేట్స్‌కు ఎందుకు వెళ్లాడు?
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ రహస్య పర్యటన బయటపడటం సాధారణ విషయం కాదు.
ఇరాన్ అణు ప్రోగ్రామ్, ప్రాంతీయ యుద్ధ వ్యూహాలు, అరబ్ దేశాల మద్దతు, గూఢచారి సహకారం- ఇవన్నీ ఈ సమావేశాల వెనుక ఉన్న అసలు అజెండాలుగా కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ “సెక్రటరీ విజిట్” అని చెప్పినా, UAE మాత్రం “అలాంటి అధికారిక పర్యటన జరగలేదు” అని స్పష్టం చేసింది. అంటే ఈ సమావేశం బహిరంగంగా అంగీకరించలేని స్థాయిలో సున్నితమైనదా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
“మాకు ముందే తెలుసు” — ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. “నెతన్యాహూ ఇప్పుడు బయటపెట్టింది, మా భద్రతా వ్యవస్థలకు ముందే తెలిసిన విషయం మాత్రమే” అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
అంతేకాదు, “ఇజ్రాయెల్‌తో కుమ్మక్కు క్షమించరాని నేరం… అందుకు బాధ్యుల్ని తప్పక నిలదీస్తాం” అని హెచ్చరించడం ద్వారా, UAE సహా గల్ఫ్ దేశాలపై కూడా పరోక్ష ఒత్తిడి తీసుకొచ్చింది.
ఇది కేవలం దౌత్యపరమైన వ్యాఖ్య కాదు. మధ్యప్రాచ్యంలో ఎవరు ఎవరితో చేతులు కలుపుతున్నారు? అనే కొత్త జియోపాలిటికల్ యుద్ధానికి సంకేతం.
అమెరికా పాత్ర ఏంటి?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) “ఇరాన్‌తో చర్చల్లో పురోగతి ఉంది” అని చెబుతుండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా పర్యటనకు బయలుదేరడం కూడా వ్యూహాత్మక పరిణామంగా కనిపిస్తోంది.
ఒకవైపు యుద్ధం… మరోవైపు చర్చలు… ఇంకోవైపు రహస్య సమావేశాలు… ఇది మొత్తం చూస్తే, మధ్యప్రాచ్యంలో పెద్ద ఒప్పందాలు తెర వెనుక జరుగుతున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
లెబనాన్‌పై దాడులు… శాంతి చర్చల డ్రామా
ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది మరణిస్తున్న వేళ, అమెరికా మధ్యవర్తిత్వంలో “శాంతి చర్చలు” కొనసాగుతున్నాయి.
లెబనాన్ విదేశాంగ మంత్రి యూస్సఫ్ రగ్గీ (Youssef Raggi) శాశ్వత కాల్పుల విరమణ కోరుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం ముందుగా హెజ్బుల్లా (Hezbollah) నిరాయుధీకరణ కావాలని డిమాండ్ చేస్తోంది.
అసలు కథ ఏంటి?
నెతన్యాహూ ఎమిరేట్స్ పర్యటన చుట్టూ ఏర్పడిన గోప్యత ఒక్కటే చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది:
ఇరాన్‌పై అరబ్ మద్దతు కూడగట్టడానికా?
గూఢచారి సమాచార భాగస్వామ్యానికా?
యుద్ధం విస్తరించే ముందు రక్షణ ఒప్పందాలకా?
లేక అమెరికా ఆధ్వర్యంలో కొత్త ప్రాంతీయ బ్లాక్ ఏర్పాటుకా?
ఇరాన్ మాత్రం స్పష్టంగా చెప్పేస్తోంది.. “మేము చూస్తున్నాం… ఎవరు ఎవరితో ఉన్నారో మాకు తెలుసు.”
మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఇప్పుడు అసలు యుద్ధం కేవలం క్షిపణులతో కాదు… రహస్య ఒప్పందాలు, మూడో కంటికి తెలియకుండా సమావేశాలు, దౌత్య మాయాజాలాలతో నడుస్తోంది.
Next Story

