
ఇస్లామాబాద్ వచ్చిన ఇరాన్ ప్రతినిధివర్గం ఇదే..
సంధికి వచ్చిన ఇరాన్ ప్రతినిధుల్ని అమెరికా ఎందుకు చంపాలనుకుందీ?
గాల్లోనే విమానానికి ముప్పు హెచ్చరిక.. మషద్‌కు దారి మళ్లించిన అధికారులు, ఆవేళ మహాభారతంలో శ్రీకృష్ణడు.. ఇవాళ ఇరాన్ అంటూ పోలికలు..
'మహాభారతం'లో రాయబారం కోసం వెళ్లిన శ్రీకృష్ణుడిని బంధించాలని దుర్యోధనుడు కుట్ర పన్నితే, అది ధర్మ విరుద్ధమని విదురుడు గట్టిగా హెచ్చరిస్తాడు. రాయబారిగా వచ్చిన వ్యక్తిని బంధించడం లేదా చంపడం అనేది క్షత్రియ ధర్మం కాదని, అది సర్వనాశనానికి దారితీస్తుందని విదురుడు, భీష్ముడు మందలించారన్నది పురాణ కథ.
ప్రస్తుత ఇరాన్-అమెరికా ఉదంతంలో అదే జరిగింది. ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్‌కు వచ్చింది సంధి చర్చల కోసం. యుద్ధాన్ని ఆపడానికి లేదా ఒక పరిష్కారం కనుగొనడానికి వచ్చిన ప్రతినిధులను లక్ష్యంగా చేసుకోవడం దౌత్య నీతికి విరుద్ధం. నాడు దుర్యోధనుడు కృష్ణుడిని బంధిస్తే పాండవులు బలహీనపడతారని ఎలాగైతే భావించాడో, నేడు ఇరాన్ మేధావులను (మరాండీ వంటి వారిని) హతమార్చాలని చూడటం ద్వారా ఆ దేశాన్ని దెబ్బతీయాలని కొందరు భావించారు.
నాడు విదురుడు హితవు పలికితే, నేడు ఇరాన్ బృందానికి అందిన ఆ 'క్రెడిబుల్ ఇంటెలిజెన్స్' (ముందస్తు సమాచారం) వారిని కాపాడింది. ఆ సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరో ఒకరు (నిజాయితీ గల నిఘా వర్గాలు లేదా ఇతర శక్తులు) విదురుడి పాత్రను పోషించి, ఒక పెద్ద దౌత్యపరమైన అనర్థాన్ని ఆపగలిగారు.
అసలేం జరిగిందంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ ఉన్నత స్థాయి దౌత్య బృందానికి పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్‌లో అమెరికా ప్రతినిధులతో చర్చలు ముగించుకుని తిరిగి వస్తుండగా, వారి విమానాన్ని కూల్చివేసేందుకు పక్కా ప్లాన్ జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విమానం దారి మళ్లింపు
ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యుడు, సీనియర్ అధికారి మహమ్మద్ మరాండీ ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా (Al Mayadeen Network) వేదికగా వెల్లడించారు.
ఇస్లామాబాద్ నుంచి టెహ్రాన్ వెళ్తున్న విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ నిఘా వర్గాల (Direct Intelligence) నుంచి హెచ్చరికలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని గాల్లోనే దారి మళ్లించి, ఈశాన్య ఇరాన్‌లోని మషద్ (Mashhad) నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రతినిధి బృందం నేరుగా విమానంలో వెళ్లకుండా, భద్రతా కారణాల దృష్ట్యా రైలు, రోడ్డు మార్గాల ద్వారా అతి కష్టం మీద సురక్షితంగా టెహ్రాన్ చేరుకుంది.
కుట్ర వెనుక ఉన్నదెవరు?
ఈ విమానంపై దాడి చేసేందుకు అమెరికాలోని కొన్ని తీవ్రవాద ధోరణి కలిగిన శక్తులు ప్లాన్ చేసినట్లు ఇరాన్ బలంగా అనుమానిస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
చర్చలకు ముందు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే వారి ప్రతినిధులను హతమార్చాలని (Assassination) బహిరంగంగానే పిలుపునిచ్చారు. 'వాషింగ్టన్ పోస్ట్' వంటి ప్రముఖ పత్రికలు సైతం చర్చల విఫలమైతే ఇరాన్ అధికారులను లక్ష్యంగా చేసుకోవాలనే తరహాలో విశ్లేషణలు ప్రచురించడం వివాదాస్పదమైంది.
సరిగ్గా ఇదే సమయంలో మషద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరగడం, ఒక మహాన్ ఎయిర్ విమానం దెబ్బతినడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
విఫలమైన చర్చలు - పెరిగిన ఉద్రిక్తత
పాకిస్థాన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఈ చర్చల నుంచి అమెరికా హఠాత్తుగా నిష్క్రమించడం, వెంటనే ట్రంప్ సర్కారు 'నౌకాదళ దిగ్బంధం' ప్రకటించడం వంటి పరిణామాలు ఈ విమానం ఘటనతో ముడిపడి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ హెచ్చరిక: "మృత్యు సుడిగుండం"
తమ దేశ ప్రతినిధుల ప్రాణాలకు ముప్పు తలపెట్టే ప్రయత్నాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తీవ్రంగా ఖండించింది. "హర్ముజ్ జలసంధి మా పూర్తి నియంత్రణలో ఉంది. శత్రువు చేసే ఏ చిన్న తప్పునైనా సహించబోం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతాన్ని అమెరికా నౌకాదళానికి'మృత్యు సుడిగుండం'గా మారుస్తాం." అని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధం నుంచి నేరుగా దాడులు, ప్రతిదాడుల వైపు మళ్లుతున్నాయి. ఈ విమానం ఘటన అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
Next Story

