
‘‘రష్యా నుంచి వెంటనే దిగుమతులు ఆపేయడం సాధ్యం కాకపోవచ్చు’’
ముడి చమురు దిగుమతులపై యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాటలు
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఒక్కసారిగా నిలిపివేయడం సాధ్యం కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన అమలును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల పాటు వాయిదా వేయడం ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఆంక్షలు, సుంకాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికాకు సమయం లభిస్తుందని రూబియో వివరించారు.
ఆంక్షల ప్రభావంపై అంచనా
ఉజ్బెకిస్తాన్, భారత్ పర్యటనలకు బయలుదేరే ముందు రూబియో విలేకరులతో మాట్లాడారు. రష్యాపై ఆంక్షలు విధించడం మాత్రమే కాకుండా, వాటి ప్రభావం ప్రపంచ మార్కెట్లపై, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే ఆంక్షలు, సుంకాల అమలుపై నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ 60 రోజుల సమయం తీసుకున్నారని వివరించారు.
రష్యా, ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించిన లిండ్సే గ్రాహం చట్టం కింద తీసుకోవాల్సిన చర్యలను ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చట్టం ప్రకారం రష్యా చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే భారత్, చైనా సహా ఐదు ప్రధాన దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. రష్యాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.
ఇంధన మార్కెట్లపై ఒత్తిడి
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అనేక అంతర్జాతీయ పరిణామాలు ఆటంకంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం, సౌదీ అరేబియాపై హూతీల దాడులు, రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం చమురు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంక్షలను అమలు చేస్తే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో పరిశీలించాల్సి ఉందని రూబియో తెలిపారు. బిల్లు రూపొందించిన సమయంలోనూ కొన్ని మినహాయింపులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
భారత్‌కు తక్షణ మార్పు కష్టం
భారత్ తన ఇంధన వనరులను ఇప్పటికే వైవిధ్యపరిచినప్పటికీ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వెంటనే పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదని రూబియో వివరించారు. సరఫరాదారులను ఒక్కరోజులో మార్చడం సాధ్యం కాదని, ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ చమురు ధరలపైనా ప్రభావం చూపుతాయని చెప్పారు. భారత్ వంటి అమెరికా మిత్రదేశాలపై ఈ చర్యల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు దేశీయ ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు సంబంధించి అమెరికా తీసుకున్న నిర్ణయాల తర్వాత, ఆంక్షల అమలును తాత్కాలికంగా నిలిపివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంధన సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించే దిశగా అమెరికా తదుపరి నిర్ణయాలు ఉండనున్నాయి.

