
ఈసారి యుద్ధం వస్తే అమెరికా ధ్వంసమే: ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: అమెరికా భీకర దాడుల వ్యూహం!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రాత్రంతా సాగిన దౌత్య చర్చలు
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఆయన జరిపిన చర్చలు అర్ధరాత్రి దాకే కొనసాగాయి. పశ్చిమ ఆసియాలో మరింత ఉద్రిక్తతలు పెరగకుండా, యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు దౌత్యపరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా ఆలోచించినట్లు విదేశాంగ మంత్రి అరాగ్చీ తన టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు సాగడం చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
తగ్గబోం.. యుద్ధం వస్తే అణచివేస్తాం: ఇరాన్
దౌత్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు. ఇరాన్ టాప్ నెగోషియేటర్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ పాక్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడుతూ.. తమ దేశ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈసారి అమెరికా కయ్యానికి కాలుదువ్వితే ఆ దేశ అంతుచూస్తామనే తరహాలో హెచ్చరించారు.
"కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఇరాన్ సాయుధ దళాలు తమ సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకున్నాయి. ఒకవేళ అమెరికా గనుక మూర్ఖత్వంతో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తే, వారు ఎదుర్కొనే పరిణామాలు అత్యంత దారుణంగా, తీవ్రంగా ఉంటాయి." అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ హెచ్చరించారు.
భీకర దాడులకు అమెరికా సన్నాహాలు.. రంగంలోకి ట్రంప్
టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ అర్ధరాత్రి దౌత్య చర్చలు గనుక విఫలమైతే, ఇరాన్‌పై భారీ ఎత్తున సైనిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోనప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం మిలిటరీ ప్లానింగ్‌ను ముమ్మరం చేసింది.
పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారడంతో అమెరికా రక్షణ సిబ్బంది తమ వారాంతపు (వీకెండ్) సెలవులను కూడా రద్దు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రభుత్వానికి సంబంధించిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వైట్‌హౌస్‌లోనే ఉండిపోయారు. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావాల్సిన పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు
మరోవైపు వ్యూహాత్మకంగా కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) పై ఇరాన్ తన పట్టును ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో ఆయిల్ ట్యాంకర్లు, కంటైనర్ షిప్‌లతో కలిపి కనీసం 25 వాణిజ్య నౌకలు తమ అనుమతితోనే ఈ జలసంధిని దాటాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ ప్రకటించింది. ఐఆర్జీసీ భద్రతా నిఘా నడుమ, వారి సమన్వయంతోనే ఈ నౌకల రాకపోకలు సాగాయని ఇరాన్ పేర్కొంది.
మొత్తంగా చూస్తే ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నా.. ఏ క్షణంలోనైనా యుద్ధం మళ్లీ రాజుకునేలా ఇరు దేశాలు కత్తులు నూరుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story

