
యుద్ధం ముగిస్తేనే అణు ముచ్చట!
అమెరికాకి తెగేసి చెప్పిన ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. "హాయ్ ఇరాన్.. మీ తీరు మాకు నచ్చలేదు" అనే రీతిలో అమెరికా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన సరికొత్త రాయబారం బెడిసికొట్టింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పాకిస్థాన్ వేదికగా పంపిన ఈ ప్రతిపాదనలు అమెరికాకు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఇంధన సరఫరా పునరుద్ధరణ, ద్రవ్యోల్బణం తగ్గింపు వంటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
వివాదానికి ప్రధాన కారణం ఏంటి?
ఇరాన్ ప్రతిపాదించిన ప్లాన్ ప్రకారం.. ముందు యుద్ధం ఆగాలి. ఇరాన్ వాణిజ్యంపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని (Blockade) ఎత్తివేయాలి. ఆ తర్వాతే అణు చర్చలు జరగాలి. యుద్ధం పూర్తిగా ముగిసి, సముద్ర మార్గాల వివాదం పరిష్కారమైన తర్వాతే అణు కార్యక్రమాల గురించి చర్చిస్తామని ఇరాన్ మెలిక పెట్టింది.
అమెరికా అభ్యంతరం...
అమెరికా మాత్రం "ముందు అణు సమస్య తేలాల్సిందే" అని పట్టుబడుతోంది. అణు చర్చలను చివరలో పెడతామనడం ఇరాన్ కాలయాపన తంత్రమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. "మేము మా రెడ్ లైన్స్ (గీసిన గీతలు) విషయంలో స్పష్టంగా ఉన్నాం" అని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ హెచ్చరించారు.
అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన ఫిబ్రవరి 28 నుంచి పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో రోజుకు 140 నౌకలు తిరిగే చోట, ఇప్పుడు కేవలం 7 నౌకలు మాత్రమే తిరుగుతున్నాయి. అది కూడా చమురు సరఫరా లేని నౌకలే కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
అమెరికా దిగ్బంధనం: ఇరాన్ చమురుతో వెళ్తున్న కనీసం ఆరు ట్యాంకర్లను అమెరికా బలవంతంగా వెనక్కి పంపింది. దీన్ని ఇరాన్ "అంతర్జాతీయ సముద్రపు దొంగతనం"గా అభివర్ణించింది.
రష్యా మద్దతు: అమెరికా ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరిస్తే, అటు ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా వెళ్లి వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి మద్దతు కూడగట్టడం గమనార్హం.
ట్రంప్‌పై పెరుగుతున్న దేశీ ఒత్తిడి
మరోవైపు అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ పడిపోతోంది. యుద్ధం వల్ల పెరుగుతున్న ధరలు, ప్రాణనష్టంపై అమెరికా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యుద్ధ లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని, అందుకే చర్చల కోసం ట్రంప్ పాకులాడుతున్నారని ఇరాన్ ఎద్దేవా చేస్తోంది.
2015 నాటి అణు ఒప్పందం నుంచి ట్రంప్ గతంలోనే వైదొలగడం ఈ సమస్యలన్నింటికీ మూలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ పెట్టిన 'ముందు యుద్ధం ఆపండి-తర్వాతే అణు చర్చలు' అనే షరతును అమెరికా అంగీకరించకపోవడంతో, పశ్చిమాసియాలో శాంతి అనేది ఇప్పట్లో కల్లగానే కనిపిస్తోంది.
Next Story

