
శ్రీలంక తీరంలో మునిగిన ఇరాన్ నౌక, 87 మంది మృతి
ఆయుధాల కొరతపై అమెరికా ఆందోళన
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. గత శనివారం నుంచి జరుగుతున్న దాడుల్లో మరణాల సంఖ్య 787కు పెరిగింది.
అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ వీడ్కోలు వేడుకలు వాయిదా పడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది.
వాయిదాకు కారణాలు
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, బుధవారం రాత్రి 10 గంటల నుండి టెహ్రాన్‌లోని 'ఇమామ్ ఖొమేనీ మొసల్లా' ప్రార్థనా మందిరంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వేడుకలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే ఈ వాయిదా నిర్ణయం వెలువడింది. దీనికి గల ప్రధాన కారణాలు:
ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతుండటంతో, భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడే వేడుకలపై భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, అంత్యక్రియల కార్యక్రమాన్ని పునఃసమీక్షించాలని ఇరాన్ నాయకత్వం భావిస్తోంది.
అంత్యక్రియల వివరాలు
ఖమేనీ భౌతిక కాయాన్ని ఇరాన్ లోని రెండో అతిపెద్ద నగరం, ఆయన జన్మస్థలమైన మషద్ (Mashhad) లో ఖననం చేయనున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న పవిత్రమైన ఇమామ్ రెజా మందిరం సమీపంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. వేడుకల యొక్క కొత్త తేదీలు మరియు పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఇరాన్ ఇస్లామిక్ ప్రోపగేషన్ కౌన్సిల్ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితి
ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
మరోవైపు, ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ పేరు ఖరారైంది.
యుద్ధానికి సంబంధించి ముఖ్యాంశాలు
ఆర్థిక, చమురు రంగంపై ప్రభావం
Live Updates
- 4 March 2026 8:44 PM IST
87 మంది మృతదేహాలు వెలికితీత
అమెరికా జలాంతర్గామి దాడిలో మునిగిపోయిన ఇరాన్ యుద్ధనౌకకు చెందిన 87 మంది నావికుల మృతదేహాలను శ్రీలంక నౌకాదళం వెలికితీసింది.
"మేము ఇప్పటివరకు 87 మృతదేహాలను సేకరించాం, మిగిలిన ఆచూకీ లేని వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి," అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక నౌకాదళ అధికారి ఏఎఫ్పీ (AFP) వార్తా సంస్థతో తెలిపారు.
పోలీసు, నౌకాదళ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంకా 61 మంది నావికుల ఆచూకీ లభ్యం కాలేదు. సుమారు 32 మందిని రక్షించామని, ప్రస్తుతం వారు గాలే (Galle) నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.
- 4 March 2026 6:29 PM IST
శ్రీలంక తీరంలో మునిగి ఇరాన్ యుద్ధ నౌక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గాలె తీరానికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన ఇరాన్ యుద్ధ నౌక ‘ఐఆర్‌ఐఎస్ దేనా’ నుంచి 32 మందిని శ్రీలంక నౌకాదళం రక్షించి ఆసుపత్రికి తరలించింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నౌకలో మొత్తం 180 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనకు కారణాలు స్పష్టంకాలేదు. అయితే జలాంతర్గామి దాడి జరిగి ఉండొచ్చని, 100 మందికిపైగా గల్లంతయ్యారని, పలువురు గాయపడ్డారని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నౌక అమెరికా ఆంక్షల జాబితాలో ఉండటం గమనార్హం.
- 4 March 2026 6:25 PM IST
టర్కీపై ఇరాన్ మిస్సైల్, కూల్చివేసిన టర్కీ..
సిరియా, ఇరాక్ గగనతలాలను దాటి టర్కీ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో మోహరించిన నాటో వైమానిక, క్షిపణి నిరోధక వ్యవస్థలు ధ్వంసం చేశాయని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ ఘటనతో ఇరాన్‌కు వాయవ్య దిశలో ఉన్న పొరుగు దేశమైన టర్కీ కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల్లో భాగమైంది. ఇప్పటికే ఈ ఉద్రిక్తతలు పలు దేశాలకు విస్తరించాయి.
ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తగా వ్యవహరించాలని టర్కీ హెచ్చరించింది. ఈ విషయంలో నాటూ, ఇతర మిత్ర దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
- 4 March 2026 5:03 PM IST
ఇతర ప్రాంతాలకు పాకిన ఘర్షణలు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ముందెన్నడూ లేని విధంగా సైనిక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడులు అనేక దేశాలకు, కీలక వ్యూహాత్మక ప్రాంతాలకు విస్తరించాయి.
ఇరాన్ రక్షణ వ్యూహం - ఐదో రోజు పోరు
మూడు దేశాల మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ప్రకటించారు. యుద్ధ ముగింపును తామే నిర్ణయిస్తామని, ఇందుకోసం "డిసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్" విధానాన్ని వాడుతున్నామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఆత్మరక్షణ తమ హక్కు అని ఇరాన్ స్పష్టం చేసింది.
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 - గల్ఫ్ ప్రాంతంలో దాడులు
ఇరాన్ సైన్యం (IRGC) గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్, బహ్రెయిన్, యూఏఈలలోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నీ తమ లక్ష్యాలేనని ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడులు - టెహ్రాన్ పరిస్థితి
టెహ్రాన్‌లోని ఇరాన్ కమాండ్ కేంద్రాలు, భద్రతా వ్యవస్థలు, పారామిలటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల జెరూసలేం, టెల్ అవీవ్ నగరాల్లో సైరన్లు మోగాయి. లెబనాన్‌లోని బీరుట్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
అమెరికా సైనిక చర్యల ఉధృతి
అమెరికా తన సైనిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. ఇరాన్ లక్ష్యాలైన వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్లు, 17 యుద్ధనౌకలపై సుమారు 2,000 దాడులు నిర్వహించింది.
- 4 March 2026 2:58 PM IST
హర్మూజ్ జలసంధిలో నౌకలకు అమెరికా రక్షణ
పశ్చిమ ఆశియా ఉద్రిక్తత నేపథ్యంలో చమురు రవాణాకు ఉపయోగించే హర్మూజ్ జలసంధిని మూసివేశారు. దీంతో అక్కడ చిక్కుకుపోయిన చమురు రవాణా నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన నౌకలు వందల సంఖ్యలో చిక్కుకుపోయాయి.
- 4 March 2026 2:55 PM IST
ఇరాన్ రహస్య అణు ప్రాజెక్టు ధ్వంసం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణుప్రాజెక్ట్ (Iran nuclear project)ను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ రైజింగ్...
గత జూన్‌లో తాము ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (Operation Rising Lion) పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్‌పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు.

