ఇరాన్ మంత్రి అర్జెంటుగా రష్యా ఎందుకెళ్లినట్టు?
x

ఇరాన్ మంత్రి అర్జెంటుగా రష్యా ఎందుకెళ్లినట్టు?

పుతిన్ తో భేటీకి మాస్కో చేరిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్, అమెరికాతో ఆగిన శాంతి చర్చలు


ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్-అమెరికా యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా సాగుతున్న శాంతి ప్రయత్నాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దౌత్య మార్గాలన్నీ మూసుకుపోతున్న తరుణంలో ఇరాన్ కొత్త వ్యూహాలకు తెరలేపింది.
అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంతో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అత్యవసరంగా రష్యా వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఆయన భేటీ కానున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి, యుద్ధాన్ని ముగించేందుకు రష్యా మద్దతు కూడగట్టడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

‘రావాలంటే మీరే రండి’

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. పాకిస్తాన్‌లో జరగాల్సిన చర్చలను రద్దు చేసిన మరుసటి రోజే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇరాన్ నాయకత్వానికి నిజంగా చర్చలు జరపాలనే ఉద్దేశం ఉంటే.. వారే నేరుగా మా వద్దకు రావాలి లేదా మాకు ఫోన్ చేయాలి" అని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చల విషయంలో అమెరికా వెనక్కి తగ్గదని ఆయన సంకేతాలిచ్చారు.

లెబనాన్‌లో ఆగని బాంబుల వర్షం

అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ‘సీజ్ ఫైర్’ (యుద్ధ విరామం) లెబనాన్‌లో కేవలం కాగితాలకే పరిమితమైంది. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధ విరామ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, దీనికి నిరసనగా తాము కూడా దాడులు కొనసాగిస్తామని హిజ్బుల్లా ప్రకటించింది.

హార్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభన

ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులు మళ్ళీ ఇక్కడ పునరావృతం కావడానికి వీల్లేదని ఇరాన్ ఎంపీ అలీ నిక్జాద్ తేల్చి చెప్పారు. ఈ వ్యూహాత్మక జలదారిపై ఇరాన్ పట్టు బిగించడం అమెరికాకు సవాలుగా మారింది.
శాంతి చర్చలు ఆగిపోవడం, ఇరాన్ రష్యా వైపు చూడటం.. అగ్రరాజ్యం అమెరికా మొండి వైఖరి వెరసి పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. పుతిన్ ప్రమేయం ఈ యుద్ధాన్ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.
Read More
Next Story