ప్రపంచానికి ఊరట.. ఇరు దేశాల నోటా శాంతి మాట!
x

ప్రపంచానికి ఊరట.. ఇరు దేశాల నోటా శాంతి మాట!

ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన ఇరాన్-అమెరికా దేశాలు ఎట్టకేలకు శాంతి ఒప్పందానికి వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాయి..


ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన ఇరాన్-అమెరికా దేశాలు ఎట్టకేలకు శాంతిబాట పట్టాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇదో సానుకూల మలుపు. ఇరు దేశాలూ యుద్ధ మార్గాన్ని వీడి శాంతి వైపు అడుగులు వేస్తుండటం నిజంగా ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పక్కా ప్రణాళికతో తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ISNA' ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇరు దేశాలు ఇప్పటికే ఈ ఒప్పంద ముసాయిదా పత్రాలను పరస్పరం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ అధికారులు చురుకైన "మధ్యవర్తిత్వ పాత్ర" పోషిస్తున్నారని టెహ్రాన్ నుంచి అందుతున్న అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఒప్పందం తొందర్లోనే జరుగుతుందని ఇరాన్ అధికారి ధీమా వ్యక్తం చేయగా, తుది ఒప్పందంపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని మరో అధికారి పేర్కొన్నారు.

ట్రంప్ హెచ్చరిక.. మార్కో రూబియో ఆశావాదం

మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం మాట్లాడుతూ... ఇరాన్‌తో ఒప్పందానికి కొన్ని "మంచి సంకేతాలు" కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ హెచ్చరికను కూడా కొనసాగించారు. ఇరాన్ గనుక తన వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యూరేనియం నిల్వలను పూర్తిగా వదులుకోకపోతే, అమెరికా నుంచి "అత్యంత కఠినమైన, తీవ్రమైన" చర్యలు ఉంటాయని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు.
సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థన మేరకు చర్చలకు మరికొంత సమయం ఇస్తూ ట్రంప్ ప్రస్తుతానికి దాడులను వాయిదా వేసినప్పటికీ, శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ త్వరగా తేల్చకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి.

హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు..

శాంతి చర్చలు నడుస్తున్నప్పటికీ, అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై వివాదం ఇంకా కొనసాగుతోంది. అమెరికా సైన్యం ఇటీవల అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ అనుబంధ చమురు ట్యాంకర్లైన M/T Skywave, ఇరాన్ పోర్టుకు వెళ్తున్న M/T Celestial Sea అనే ఓడలను అడ్డుకుని దారి మళ్లించింది. అమెరికా విధిస్తున్న ఈ నౌకాదళ ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా నిరసిస్తోంది. తమతో ఒప్పందాలు లేని దేశాల ఓడలపై తాము సుంకాలు వసూలు చేస్తామని ఇరాన్ అంటుండగా, దానికి వీల్లేదని ట్రంప్ సర్కార్ కౌంటర్ ఇస్తోంది.
అంతర్జాతీయ ఆగ్రహం.. యాక్టివిస్టుల బహిష్కరణ!
మిడిల్ ఈస్ట్‌లో మరో ప్రధాన పరిణామంగా... గాజా ప్రాంతానికి మానవతా సహాయాన్ని తీసుకెళ్తుండగా ఇజ్రాయెల్ సైన్యం అపహరించిన అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలను ఇజ్రాయెల్ గురువారం పూర్తిగా దేశం నుండి బహిష్కరించింది. ఈ యాక్టివిస్టులను ఇజ్రాయెల్ సైన్యం, రక్షణ మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ (Itamar Ben-Gvir) అత్యంత క్రూరంగా హింసించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చేతులు కట్టేసి, మోకాళ్లపై నిలబెట్టిన యాక్టివిస్టులను బెన్-గ్విర్ హేళన చేస్తున్న వీడియో బయటకు రావడంతో కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి పలు దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేశాయి. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, నెతన్యాహు మందలింపుల నేపథ్యంలో ఇజ్రాయెల్ చివరకు వారందరినీ ప్రత్యేక విమానాల్లో టర్కీ మీదుగా వారి స్వదేశాలకు పంపించివేసింది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కలకలం

ఒకవైపు అమెరికా-ఇరాన్ చర్చలు నడుస్తున్నా, ఇజ్రాయెల్ మాత్రం దక్షిణ లెబనాన్‌పై తన ప్రాణాంతక బాంబుల వర్షాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో పలువురు సిబ్బంది సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముసాయిదా చర్చలు విజయవంతమైతే తప్ప ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి ప్రశాంతత నెలకొనేలా కనిపించడం లేదు.
Read More
Next Story