అమెరికాకు సవాల్ విసిరిన ఇరాన్!
x

అమెరికాకు సవాల్ విసిరిన ఇరాన్!

యుద్ధమంటే అమెరికాకు భయమేమో కాని ఇరాన్ కాదని సవాల్ చేసిన ఇరాన్ సైనిక సలహాదారు


పశ్చిమాసియాలో నెత్తుటి ధారలు ఇంకా ఆరలేదు. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమై నేటికి సరిగ్గా 48 రోజులు. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో గల్ఫ్ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ముఖ్యంగా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ విసిరిన తాజా సవాల్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
హర్ముజ్‌పై ఇరాన్ ‘డెడ్లీ’ వార్నింగ్
అమెరికా విధిస్తున్న నౌకా దళ దిగ్బంధనాన్ని ధిక్కరిస్తూ, ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సేన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా హక్కులు దక్కే వరకు హర్ముజ్ జలసంధిపై పట్టును వదులుకోం. అమెరికా ఆంక్షలు ఆర్థిక ఉగ్రవాదం లాంటివి" అని ఆయన విమర్శించారు. "అమెరికాకు యుద్ధం అంటే భయం ఉండొచ్చు, కానీ ఇరాన్ దశాబ్దాలుగా యుద్ధ వాతావరణంలోనే ఉంది. మేము ఎంత కాలమైనా పోరాడగలం" అని రెజాయ్ హెచ్చరించారు.
48 రోజుల విధ్వంసం..
ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం మూడో రోజూ దిగ్బంధించి ఉంచింది. ఇది ఇరాన్ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. "హర్మోజ్ ద్వారా ఏ నౌక కదిలినా ఉపేక్షించబోం. మాపై దాడికి దిగితే నరకం చూపిస్తాం" అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించారు.

యుద్ధం 50 రోజులకు చేరువవుతున్న తరుణంలో, ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటిపోయాయి. దీని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది.

మధ్యవర్తిగా పాకిస్థాన్!

ఈ 48 రోజుల ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా టెహ్రాన్ వెళ్లి చర్చలు జరుపుతున్నారు. రెండో రౌండ్ శాంతి చర్చలు ఇస్లామాబాద్‌లోనే జరిగే అవకాశాలు ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు సంకేతాలిచ్చాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చైనా, రష్యాల మద్దతు కోరుతూ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా తీరును 'ఏకపక్షం'గా అభివర్ణిస్తూ, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు.
యుద్ధం మొదలై ఏడు వారాలు దాటినా, శాంతి కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇటు అమెరికా ఆంక్షలు, అటు ఇరాన్ సవాళ్ల మధ్య పశ్చిమాసియా భవిష్యత్తు ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో కదులుతున్న నౌకల వేగంపైన, పాకిస్థాన్ జరిపే చర్చల పైన ఆధారపడి ఉంది.
Read More
Next Story