ట్రంప్ తెంపరితనం ఆపకుంటే మళ్లీ హర్మోజ్ మూత: ఇరాన్
x

ట్రంప్ 'తెంపరితనం' ఆపకుంటే మళ్లీ హర్మోజ్ మూత: ఇరాన్

ఇరాన్-అమెరికా యుద్ధం: 50వ రోజుకు చేరిన ఉత్కంఠ.. ఒకవైపు కాల్పుల విరమణ, మరోవైపు సముద్ర దిగ్బంధం!


ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న పోరు ఏప్రిల్ 18నాటికి 50వ రోజుకు చేరుకుంది. దౌత్యపరమైన వ్యూహాలు, సైనిక చర్యలు, ప్రపంచ ఇంధన మార్కెట్లలోని మార్పులతో ఈ సంక్షోభం అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హర్మోజ్ జలసంధిని (Strait of Hormuz) వాణిజ్య నౌకల కోసం తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. హర్మోజ్ పై అమెరికా నౌకల దిగ్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్ అమెరికాకు అత్యంత కఠినమైన హెచ్చరికలు చేశారు. అది ఎలా ఉందంటే..
హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసేస్తాం..
ఇరాన్ విదేశాంగ మంత్రి హర్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరుస్తున్నట్లు ప్రకటించినప్పటికీ స్పీకర్ గాలిబాఫ్ దానికి ఒక షరతు విధించారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం, ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే, హర్మోజ్ జలసంధి మళ్లీ మూసేస్తామన్నారు. అంటే, తమ ఓడరేవులను అమెరికా దిగ్బంధిస్తే, తాము ప్రపంచానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ద్వారా పర్మిట్లు ఉండవు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని, త్వరలోనే అంతా సద్దుమణిగిపోతుందని వరుసగా పోస్ట్‌లు పెడుతున్నారు. దీన్ని ఇరాన్ ఖండించింది.
"హర్మోజ్ జలసంధి నుంచి ప్రయాణించేందుకు అనుమతులు సోషల్ మీడియా (X/Twitter) ద్వారా లభించవు" అని ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో అమెరికా తన ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న యురేనియంను (Enriched Uranium) అమెరికాకు బదిలీ చేసేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది.
ఇది పూర్తిగా అవాస్తవమని, తమ అణు నిల్వలను ఇతర దేశాలకు బదిలీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చర్చల్లో అసలు ఈ అంశమే ప్రస్తావనకు రాలేదని ఇరాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
దిగ్బంధంపై ప్రతిఘటన
అమెరికా నౌకాదళం ప్రస్తుతం ఇరాన్ వైపు వస్తున్న సుమారు 21 నౌకలను వెనక్కి పంపివేసింది. ఈ చర్యలను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించబోమని, ఒకవేళ అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే యుద్ధం మరింత తీవ్రం అవుతుందని ఇరాన్ హెచ్చరించింది. "మీరు మా ఓడరేవులను దిగ్బంధిస్తే, మేము ప్రపంచానికి చమురు సరఫరా చేసే మార్గాన్ని (హర్మోజ్) మూసివేస్తాం" అనేది ఇరాన్ చేసిన ప్రధాన హెచ్చరిక.
హర్మోజ్ జలసంధిలో నౌకల భద్రత కోసం ఫ్రాన్స్, బ్రిటన్ ఒక ప్రత్యేక మిషన్‌ను సిద్ధం చేస్తున్నాయి.
హర్మోజ్ ను తెరుస్తున్నట్టు ఇరాన్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ధర $120 నుండి ఒక్కసారిగా $90.38 కు పడిపోయింది.
మరో కీలక పరిణామంలో, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ దీనిని దేశ భద్రత కోసం తీసుకున్న 'కొత్త నిర్ణయం'గా అభివర్ణించారు.
Read More
Next Story