
హర్మోజ్ జలసంధిపై పట్టుబిగిస్తున్న అమెరికా
ఇరాన్ కి అమెరికా ఉచ్చు: హర్మోజ్ దిగ్బంధం!
నేరుగా యుద్ధక్షేత్రంలోకి దిగకుండానే, ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేలా 'హోర్ముజ్ జలసంధి' చుట్టూ నౌకాదళ ఉచ్చును బిగిస్తోంది
పశ్చిమాసియా యుద్ధం 47వ రోజుకు చేరుకున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా తన వ్యూహాన్ని మార్చింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి దిగకుండానే, ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేలా 'హోర్ముజ్ జలసంధి' చుట్టూ నౌకాదళ ఉచ్చును బిగిస్తోంది. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్‌కు రోజుకు సుమారు 43.5 కోట్ల డాలర్ల (రూ. 4,081 కోట్లు) మేర నష్టం వాటిల్లుతుందని ఆర్థిక విశ్లేషకుల అంచనా.
అమెరికా వ్యూహం ఏమిటి?
ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఆంక్షలను ఏమారుస్తూ, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేసి 'ఘోస్ట్ షిప్'ల ద్వారా ఇరాన్ చమురును ఎగుమతి చేసేది. ఇప్పుడు అమెరికా నౌకాదళం ఇరాన్ ప్రధాన రేవుల చుట్టూ మోహరించడం వల్ల ఈ తెరచాటు వ్యాపారానికి ముగింపు పలకనుంది. శత్రు భూభాగంపైకి సైన్యాన్ని దించి రిస్క్ తీసుకోవడం కన్నా, చమురు ఎగుమతులు జరిగే ఖర్గ్ దీవి వంటి కీలక ప్రాంతాలను దిగ్బంధించడం ద్వారా ప్రత్యర్థిని లొంగదీసుకోవచ్చని అమెరికా భావిస్తోంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ గండి
ఇరాన్ తన ఆదాయంలో సింహభాగాన్ని హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే చమురు ఎగుమతులు, టోల్ వసూళ్ల ద్వారానే పొందుతోంది. చమురుతో పాటు ఎరువులు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్స్ ఎగుమతి నిలిచిపోవడంతో టెహ్రాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడనుంది. చైనా, టర్కీ నుంచి వచ్చే పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో ఇరాన్‌లో నిత్యావసరాల కొరత పెరిగే ప్రమాదం ఉంది.
'డ్రాగన్'పై డబుల్ ఇంపాక్ట్
ఈ దిగ్బంధం కేవలం ఇరాన్ కోసమే కాదు, చైనాను దారికి తెచ్చుకోవడానికి కూడా అమెరికా వాడుకుంటోంది. చైనా తన ముడి చమురు అవసరాల్లో 50 శాతం, గ్యాస్ అవసరాల్లో 30 శాతాన్ని హోర్ముజ్ జలసంధి నుంచే పొందుతోంది. ఇక్కడ దిగ్బంధం వల్ల చైనా ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారి, అగ్రరాజ్యం ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
సముద్ర మార్గం మూసుకుపోతే ఇరాన్‌కు ఉన్న ఏకైక ఆశ 'సిల్క్ రోడ్ రైల్వే'. మధ్య ఆసియా దేశాల గుండా చైనాకు వెళ్లే ఈ రైలు మార్గం ద్వారా సరకు రవాణా చేయాలని టెహ్రాన్ భావిస్తోంది. అయితే, రైళ్ల ద్వారా భారీ ఎత్తున చమురును రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అది సముద్ర మార్గానికి ప్రత్యామ్నాయం కాలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరి ఇరాన్ ఏం చేస్తుందీ?
ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకు 16 యుద్ధనౌకలు ఉన్నప్పటికీ, పర్షియన్ గల్ఫ్ లోపల ఒక్క వార్‌షిప్ కూడా లేదు. నిత్యం వేలాది నౌకలు తిరిగే ఈ జలసంధిలో పూర్తిస్థాయి దిగ్బంధం అమలు చేయడం అమెరికాకు అంత సులభం కాదు. అమెరికా చేసిన పని వల్ల రోజువారీ నష్టం రూ. 4,081 కోట్లు ఉండవచ్చునని అంచనా.
ఆధునిక ప్రపంచంలో ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశం ఆర్థిక మూలాలను కత్తిరిస్తే చాలు. అమెరికా ఇప్పుడు ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న వ్యూహం సరిగ్గా ఇదే. క్షిపణులు విసిరితే ప్రాణనష్టం జరుగుతుంది, కానీ ఆర్థిక దిగ్బంధం విధిస్తే ఆ దేశం అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది.
Next Story

