చైనాలో ట్రంప్ కి జ్ఞానోదయం, అమెరికా నోట 20 ఏళ్ల అణునిషేధం
x

చైనాలో ట్రంప్ కి జ్ఞానోదయం, అమెరికా నోట 20 ఏళ్ల అణునిషేధం

ఇరాన్ వ్యూహంలో అమెరికా యూ-టర్న్ వెనుక అసలు కథ!


ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న వివాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు, హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి.
'నిజమైన నొప్పి' ఇప్పుడు తెలిసొచ్చిందా?
న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా, ఇజ్రాయెల్‌ల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ యుద్ధాన్ని, నష్టాన్ని ముందే నివారించాల్సింది. కానీ అమెరికా ఇజ్రాయెల్ అక్రమ దురాక్రమణకు మద్దతు ఇస్తోంది. యుద్ధ ఖర్చులు నానాటికీ పెరుగుతున్నాయి, ఇది అమెరికన్లకు 'నిజమైన తల నొప్పి'గా మారాయి అని ఆయన హెచ్చరించారు.
అమెరికా చర్చలపై తమకు నమ్మకం లేదని, వాషింగ్టన్ ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని అరాగ్చీ పేర్కొన్నారు.
చైనాతో ఏకాభిప్రాయం
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటన ముగించుకున్న తర్వాత ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలను 20 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధమైతే, తాము ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇదివరకు ఇరాన్ అణు కార్యక్రమాలను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేసిన ట్రంప్, ఇప్పుడు 20 ఏళ్ల కాలపరిమితికి ఓకే అనడం ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, "ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదని, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) మార్గం ఎల్లప్పుడూ తెరిచే ఉండాలని" ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు.
కాల్పుల విరమణ పొడిగింపు: వాషింగ్టన్ వేదికగా జరిగిన చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణను మరో 45 రోజుల పాటు (జూన్ మొదటి వారం వరకు) పొడిగించేందుకు అంగీకారం కుదిరింది.
చైనా పర్యటన తర్వాత ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’?
"ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తాం... అణు కార్యక్రమాలను శాశ్వతంగా మూసివేయాల్సిందే..." ఇవి కొద్దిరోజుల క్రితం వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట వచ్చిన హెచ్చరికలు. కానీ, మూడు రోజుల చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కిన తర్వాత ట్రంప్ స్వరం పూర్తిగా మారిపోయింది. "ఇరాన్ తన అణు కార్యక్రమాలను 20 ఏళ్ల పాటు నిలిపివేస్తే చాలు... మేం పరిశీలిస్తాం" అంటూ ఆయన ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు.
అగ్రరాజ్య అధినేతలో హఠాత్తుగా ఈ ‘జ్ఞానోదయం’ ఎందుకు వచ్చింది? చైనా పర్యటనలో ట్రంప్‌కు ఎదురైన వాస్తవాలు ఏమిటి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమీకరణాలు ఏమిటీ?
చైనా వేసిన ‘రియాలిటీ చెక్’
ట్రంప్ బీజింగ్‌లో అడుగుపెట్టే వరకు ఇరాన్‌ను కేవలం సైనిక కోణంలోనే చూశారు. కానీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల తర్వాత ఆయనకు అసలు వాస్తవాలు బోధపడ్డాయి.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్నది చైనాయే. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా చైనా ఇరాన్ నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది.
ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని అమెరికా చూస్తే, అది చైనా ఇంధన భద్రతపై నేరుగా దెబ్బకొట్టడమే అవుతుంది. ఈ విషయంలో చైనా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని జిన్‌పింగ్ స్పష్టం చేయడంతో, ఇరాన్‌ను ఒంటరిని చేయడం అంత సులువు కాదని ట్రంప్‌కు అర్థమైంది.
'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' భయం...
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో 20 శాతానికి పైగా ప్రవహించే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) జలమార్గం ఇరాన్ గుప్పిట్లోనే ఉంది.
అమెరికా యుద్ధానికి దిగితే, ఇరాన్ తన ఆఖరి అస్త్రంగా ఈ మార్గాన్ని మూసివేస్తుంది లేదా అక్కడ మైన్లు విసురుతుంది.
ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి (Global Recession) దారితీస్తుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికాకు ఇది భరించలేని నష్టం. ఈ పరోక్ష ముప్పును ముందే ఊహించి ట్రంప్ నష్ట నివారణ చర్యలకు దిగారు.
సైనిక అలసట, అంతర్గత ఒత్తిడి
అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభం, తైవాన్ తీరంలో చైనా కదలికలు, గాజా-లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ యుద్ధాలకు పరోక్షంగా బిలియన్ల కొద్దీ డాలర్లు, ఆయుధాలు సరఫరా చేస్తోంది.
ఒకే సమయంలో ఇన్ని రకాల సంక్షోభాలను ఎదుర్కోవడం వల్ల అమెరికా సైనిక, ఆర్థిక వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం అంటే వేలాది మంది అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమే. అమెరికా పౌరులు సైతం మరో సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ హెచ్చరించినట్లు.. యుద్ధం ముదిరితే అది అమెరికన్లకు "నిజమైన నొప్పి"ని కలిగిస్తుందని ట్రంప్ గ్రహించారు.
రష్యా-చైనా-ఇరాన్ కూటమి ముప్పు
ఇరాన్‌పై అమెరికా ప్రత్యక్షంగా దాడికి దిగితే, రష్యా, చైనాలు తెరవెనుక నుండి ఇరాన్‌కు అత్యాధునిక క్షిపణులు, నిధులు అందిస్తాయి. ఇది అమెరికా వర్సెస్ రష్యా-చైనా కూటమిగా మారి, మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికే ప్రమాదం ఉంది. బ్రిక్స్ (BRICS) వేదికగా అమెరికా తీర్మానాలను చైనా, రష్యాలు వీటో చేస్తామని సంకేతాలివ్వడం కూడా ట్రంప్‌ వైఖరి మారడానికి కారణమైంది.
'జ్ఞానోదయమా' లేక 'వ్యూహాత్మక మైండ్ గేమా'?
దీన్ని ట్రంప్‌కు వచ్చిన కేవలం జ్ఞానోదయంగానో లేదా ఆయన వెనక్కి తగ్గడంగానో చూడలేం. ఇది పక్కా "వ్యూహాత్మక నష్ట నివారణ చర్య"గా భావిస్తున్నారు.
యుద్ధం ద్వారా ఇరాన్‌ను ముగించాలనుకుంటే అమెరికా కూడా ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. అదే చైనా సహకారంతో "20 ఏళ్ల పాటు అణు కార్యక్రమాల నిలిపివేత" అనే ఒప్పందానికి ఇరాన్‌ను ఒప్పించగలిగితే.. యుద్ధం లేని శాంతిని తెచ్చిన "గ్రేట్ డీల్ మేకర్"గా ట్రంప్ చరిత్రలో నిలిచిపోవచ్చు. అందుకే, ట్రంప్ తన 'యుద్ధ గర్జన'ను పక్కనబెట్టి, 'దౌత్య వ్యూహాన్ని' తెరపైకి తెచ్చారు.
Read More
Next Story