
ఇరాన్ పై పిడుగులు కురిపిస్తానంటున్న ట్రంప్ ఊహాత్మక చిత్రం (ఏఐ క్రియేషన్)
ఇరాన్ ను ట్రంపు ఉంచుతాడా, ముంచుతాడా!
ట్రంప్ నిర్ణయంపై యావత్ ప్రపంచం ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన తాజా డెడ్ లైన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలకు ఈ గడువు ముగుస్తుంది. హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌లోని ఇంధన వనరులు, పవర్ ప్లాంట్లు, వంతెనలపై భారీ దాడులు తప్పవని, ఒక్క రాత్రిలో లేపేస్తామని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయితే ట్రంప్ అంతటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు వాళ్లు చెబుతున్న కారణం ఏమిటంటే...
48 గంటల నుంచి 408 గంటల వరకు: ట్రంప్ తన హెచ్చరికల్లో ఎంత కఠినంగా ఉన్నారో, గడువు పొడిగింపుల్లో అంత ఉదారంగా కనిపిస్తున్నారు. మార్చి 22న మొదట కేవలం 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్, ఆ తర్వాత దానిని మూడుసార్లు పొడిగించారు.
మార్చి 22: మొదటి 48 గంటల అల్టిమేటం.
మార్చి 23: చర్చలు ఫలిస్తున్నాయని చెబుతూ 5 రోజుల పొడిగింపు.
మార్చి 26: గడువును ఏప్రిల్ 6 వరకు పెంచుతూ నిర్ణయం.
ఏప్రిల్ 6: చివరి నిమిషంలో మరో 24 గంటలు పెంచి, ఏప్రిల్ 7 (అమెరికన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి) ఆఖరి గడువుగా నిర్ణయించారు.
మొత్తంగా చూస్తే, మొదట ప్రకటించిన 48 గంటల గడువు కాస్తా ఇప్పటికి 408 గంటలకు చేరుకుంది.
మంగళవారం పవర్ ప్లాంట్ డే.. బ్రిడ్జ్ డే..
తాజాగా తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందించిన ట్రంప్, "మంగళవారం రాత్రి 8 గంటలు!" అంటూ ఓ నిగూఢార్థ సందేశాన్ని పోస్ట్ చేశారు. అంతటితో ఆగక, "ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. రెండూ కలిపి జరగబోతున్నాయి" అంటూ బాంబు దాడుల సంకేతాలిచ్చారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుంచి మొదలుపెట్టి అన్నింటినీ నేలమట్టం చేస్తానని ఆయన హెచ్చరించారు.
చర్చలు వర్సెస్ యుద్ధం
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తులుగా చర్చలు జరుపుతున్నాయి. అమెరికా వాదన ప్రకారం "ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. కానీ ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం అక్కడ అన్నింటినీ పేల్చివేస్తాను" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలను ఇరాన్ పదేపదే తిరస్కరిస్తోంది. దానికి బదులుగా తన సొంత 10 అంశాల ప్రతిపాదనను ఇరాన్ ముందుకు తెచ్చింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే తాము కూడా యుద్ధానికి సిద్ధమని ఇరాన్ సంకేతాలిస్తోంది.
అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, ట్రంప్ తన వ్యూహంలో భాగంగానే ఈ గడువులను పొడిగిస్తున్నారు. చర్చల్లో పురోగతి కనిపిస్తే ట్రంప్ మరోసారి గడువు పెంచే అవకాశం లేకపోలేదు అని అభిప్రాయపడుతున్నారు.
మరికొన్ని గంటల్లో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇది శాంతికి దారితీస్తుందా లేక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనేది వేచి చూడాలి.
Next Story

