
పీటీఐ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధింపు
ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి షాక్ ఇచ్చిన రాష్ట్రపతి జర్దారీ
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఉగ్రవాద దాడులు పెరగడం, శాంతిభద్రతలు అదుపు తప్పడం, ప్రావిన్షియల్ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రావిన్స్ పాలనపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పెరగనుంది.
అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆదివారం, అక్టోబర్ 11న రాజ్యాంగంలోని 232(1), 234(1) అధికరణాల ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటన జారీ చేశారు. దీనికి ముందు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ అమల్లోకి రావడంతో ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, అడ్వకేట్ జనరల్ పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రావిన్షియల్ అసెంబ్లీ అధికారాలు కూడా పార్లమెంట్ లేదా దాని ఆదేశాల మేరకు నిర్వహించే అవకాశం ఉంది.
ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, భద్రతా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రావిన్షియల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. గత పదేళ్లలో భద్రతను మెరుగుపరిచేందుకు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రావిన్స్‌కు కనీసం 800 బిలియన్ పాకిస్థానీ రూపాయలు కేటాయించినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని షరీఫ్ ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఈ పరిణామాలు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనల మధ్య చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని, ఆయనకు తగిన వైద్య చికిత్స అందించాలని కోరుతూ ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది నిరసన పాదయాత్ర చేపట్టారు. అక్టోబర్ 4న లక్కీ మార్వత్‌లో ప్రారంభమైన ఈ యాత్ర పలు జిల్లాల మీదుగా కొనసాగుతోంది. తొలుత ఇస్లామాబాద్‌కు చేరుకుని ధర్నా నిర్వహించాలని పీటీఐ భావించింది. అయితే, నిరసనకారులను రాజధానిలోకి అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్ర మార్గంలోని రహదారులను కూడా కంటైనర్లతో మూసివేశారు.
సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావని, శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని అఫ్రిది ప్రకటించారు. మరోవైపు, పీటీఐతో చర్చలు జరిపేందుకు జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ద్వారా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయి. అయితే, అవి ఫలించలేదు. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చిన తర్వాతే నిరసన విరమిస్తామని పీటీఐ స్పష్టం చేయగా, ముందుగా ఆందోళనలను ముగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. 2023 నుంచి జైల్లో ఉన్న ఆయనపై అవినీతి, హింసను ప్రేరేపించారనే ఆరోపణలు సహా వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, ఆయన వ్యక్తిగత వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. నిరసనలకు ముందు అరెస్టయిన ఇమ్రాన్ సోదరీమణులు, పార్టీ మద్దతుదారులను విడుదల చేయాలని, ఆయన భార్య బుష్రా బీబీకి సరైన వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా కోరుతోంది.
ఒకవైపు ఉగ్రవాదాన్ని అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం తమ లక్ష్యమని పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పీటీఐ తన ఆందోళనలను కొనసాగిస్తోంది. ఎమర్జెన్సీతో ఖైబర్ పఖ్తున్ఖ్వా పాలనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వానికి, పీటీఐకి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఏ దిశగా సాగుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

