బంగ్లా- సౌదీ మధ్య దౌత్య వివాదం
x

బంగ్లా- సౌదీ మధ్య దౌత్య వివాదం

ఇద్దరి బంగ్లా జాతీయులకు మరణ శిక్ష విధించిన రియాద్, ఎందుకు విధించారో చెప్పాలని డిమాండ్ చేసిన ఢాకా


సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేయడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చకు దారితీసింది. అక్టోబర్ 14న శిక్ష అమలైనప్పటికీ, తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని సౌదీ అరేబియా రాయబారిని కోరడంతో పాటు, అధికారిక సమాచారం అందించాలని దౌత్యపరమైన లేఖను కూడా పంపింది.

మరణశిక్షకు గురైనవారిని నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్‌గా గుర్తించారు. మక్కాలోని ఓ మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వారికి శిక్ష విధించినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. అయితే, వారిపై వచ్చిన ఆరోపణలు, విచారణలో వెలుగుచూసిన అంశాలు, మరణశిక్షకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు బయటకు రాలేదు.

నజ్రుల్‌ను అరెస్టు చేసిన ఎనిమిది నెలల తర్వాతే ఆయన కుటుంబానికి సమాచారం అందిందని బంధువులు తెలిపారు. అక్టోబర్ 11న ఆయనతో చివరిసారిగా మాట్లాడిన కుటుంబ సభ్యులకు, అక్టోబర్ 14న మరణశిక్ష అమలైనట్లు ఫోన్ ద్వారా తెలిసింది. శిక్ష అమలుకు ముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేయాలని నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ కోరారు. నజ్రుల్, సితి అక్తర్ దంపతులనే వాదనను కూడా ఆయన ఖండించారు.

ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌కు సౌదీ జైళ్లలో ఉన్న బంగ్లాదేశ్ పౌరుల జాబితా అందింది. అందులో ఈ ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి. వారి నేరాలుగా వ్యభిచారం, ఐసీటీకి సంబంధించిన ఆరోపణలు నమోదైనప్పటికీ, మరణశిక్ష విధించినట్లు ఆ జాబితాలో పేర్కొనలేదని ది డైలీ స్టార్ కథనం తెలిపింది.

అక్టోబర్ 17న బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబాయెద్ ఇస్లాం ఈ వ్యవహారంపై స్పందించారు. మరణశిక్షల విషయం తమకు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని వెల్లడించారు. అనంతరం సౌదీ రాయబారి అబ్దుల్లా జాఫర్ హెచ్. బిన్ అబియాను వివరణ కోరారు.

అక్టోబర్ 18న బంగ్లాదేశ్ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ కూడా ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పౌరులు అరెస్టయినప్పుడు, వారిపై తీసుకుంటున్న చర్యల గురించి బంగ్లాదేశ్‌కు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. సమాచార మార్పిడిలో లోపం ఎందుకు ఏర్పడిందో సౌదీ ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

ప్రస్తుతం ఈ కేసులో విచారణకు సంబంధించిన వివరాలు, మరణశిక్ష విధించిన ప్రక్రియ, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశాలపై సౌదీ అరేబియా అధికారిక వివరణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోంది


Read More
Next Story