
రెండో రోజు క్షీణించిన క్రూడాయిల్ ధరలు
దాడులకు విరామం ఇచ్చిన అమెరికా- ఇరాన్
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా–ఇరాన్ మధ్య వరుసగా రెండో రోజు దాడులకు విరామం కొనసాగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. గత వారం రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఆదివారం ట్రేడింగ్‌లో మరింత క్షీణించాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు కొంత ఊరట పొందాయి.
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సెప్టెంబర్ డెలివరీకి సంబంధించిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 4.9 శాతం పడిపోయి 92.02 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రోజూ 3.9 శాతం తగ్గిన చమురు ధరలు, మరోసారి క్షీణించడం గమనార్హం. గత వారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 102 డాలర్ల వరకు చేరుకోగా, మే నెల తర్వాత నమోదైన అత్యధిక స్థాయిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే దాదాపు 30 డాలర్ల మేర పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత, ఇరాన్ తన నియంత్రణలో ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు రవాణాకు పెద్ద అంతరాయం ఏర్పడింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
ఈ పరిస్థితుల్లో చమురును అధికంగా వినియోగించే దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎర్ర సముద్రం మార్గంగా ప్రయాణిస్తున్న సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజవాయువు ఎగుమతులు మరింత క్లిష్టంగా మారాయి.
అమెరికాలో ఇంధన ధరలు
అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (AAA) గణాంకాల ప్రకారం, ఆదివారం నాటికి అమెరికాలో సాధారణ గ్యాసోలిన్ గ్యాలన్ సగటు ధర 4.11 డాలర్లుగా నమోదైంది. నెల రోజుల క్రితం ఇది 3.90 డాలర్లు ఉండగా, ఏడాది క్రితం 3.15 డాలర్లుగా మాత్రమే ఉంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణంపై ప్రభావం
చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రవాణా వ్యయాలు పెరగడం వల్ల వస్తువులు, సేవల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశమూ ఉంది.
ఇప్పటికే ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న సమయంలో చమురు ధరలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. CME గ్రూప్ డేటా ప్రకారం, రాబోయే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం 36 శాతం వరకు ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వడ్డీ రేట్లు పెరిగితే...
వడ్డీ రేట్ల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ, రుణాల వ్యయం పెరగడం వల్ల వినియోగదారులు, వ్యాపార సంస్థలపై అదనపు భారం పడుతుంది.
గృహ రుణాల వడ్డీలు ఇప్పటికే ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడంతో గృహ నిర్మాణ రంగం మందగిస్తోంది. అదే సమయంలో అధిక రుణ వ్యయాల కారణంగా అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్మాణం కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Next Story

