కాల్పుల విరమణకు తూట్లు.. “ఆత్మరక్షణ” పేరిట అమెరికా బాంబులు
x

కాల్పుల విరమణకు తూట్లు.. “ఆత్మరక్షణ” పేరిట అమెరికా బాంబులు

ఖండించిన ఇరాన్, యుద్ధం సిద్ధమంటూ ప్రకటన


ఇరాన్-అమెరికా యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించిన అమెరికా ఇప్పుడు తానే తూట్లు పొడిచింది. ఆత్మరక్షణ పేరిట ఇరాన్ పై కాల్పులు జరిపింది. దీంతో మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కాల్పుల విరమణ కొనసాగుతోందని ప్రకటిస్తూనే, మరోవైపు “ఆత్మరక్షణ” పేరుతో అమెరికా జరిపిన తాజా దాడులు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, అమెరికా నేవీకి చెందిన మూడు డిస్ట్రాయర్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాడుల్లో అమెరికా నౌకలకు నష్టం జరగకపోయినా, వెంటనే ఆత్మరక్షణ పేరుతో అమెరికా ప్రతిదాడులు చేపట్టింది.
అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన కీలక నౌకాశ్రయాలు బందర్ అబ్బాస్, కెష్మ్ (Bandar Abbas, Qeshm) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలు హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటం గమనార్హం.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి నౌకలకూ మార్గం ఉండదని ఇరాన్ ప్రకటించడంతో, అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. షిప్పింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ లాయిడ్స్ లిస్ట్ ప్రకారం ప్రస్తుతం హర్ముజ్ మార్గం దాదాపు మూసివేత పరిస్థితికి చేరుకుంది.
ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. “యుద్ధం త్వరలో ముగుస్తుంది.. పరిస్థితి అద్భుతంగా సాగుతోంది” అని పేర్కొన్న ఆయన, ఇరాన్ అమెరికా ప్రతిపాదనను తిరస్కరిస్తే “ఇంకా ఉన్నత స్థాయి దాడులు” ఆదేశించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతుందని చెబుతూనే అమెరికా దాడులు చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోందని టెహ్రాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇక యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైనా కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు యుద్ధం ముందు బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం 100 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. గత వారం ఇవి 126 డాలర్ల వరకు చేరుకోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది.
ఇదిలా ఉండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా క్షిపణి ముప్పు నేపథ్యంలో తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారిక హెచ్చరికలు జారీ చేసింది.
యుద్ధం ముగిసిందా? మళ్లీ మొదలైందా?
ప్రస్తుతం చూస్తే ప్రత్యక్ష యుద్ధం కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నా, “ఆత్మరక్షణ” పేరిట అమెరికా దాడులు, హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ ప్రయత్నాలు, ప్రాంతీయ మిలిటరీ హెచ్చరికలు పరిస్థితిని మరింత ప్రమాదకర దిశగా నెడుతున్నాయి.
Read More
Next Story