రియాద్ ఎయిర్ పోర్ట్ పై దాడి, 12 మంది మృతి
x

రియాద్ ఎయిర్ పోర్ట్ పై దాడి, 12 మంది మృతి

300 మందికి గాయాలు, హూతీలే దాడి చేశారని సౌదీ ఆరోపణ


పశ్చిమాసియాలో హూతీ - సౌదీ అరేబియా జరుగుతున్న పోరు క్రమంగా తీవ్రమవుతోంది. తాజాగా సౌదీ రాజధాని అయిన రియాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరగగా 12 మంది సాధారణ ప్రయాణీకులు మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు, యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి పాల్పడినట్లు సౌదీ ఆరోపించింది.

రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్స్ 3, 4 ఉన్న ప్రాంగణాన్ని క్షిపణి తాకింది. ఈ దాడిలో మరణించిన వారిలో నలుగురు సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, పాలస్తీనా, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. గాయపడిన వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ అరబ్ దేశంలో జరిగిన అత్యంత ప్రాణాంతక దాడిగా ఈ ఘటన నిలిచింది. విమానాశ్రయంపై దాడిని పూర్తిస్థాయి యుద్ధ నేరంగా అభివర్ణించిన సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు, దీనికి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించాయి. అయితే, ఈ దాడిపై హూతీ తిరుగుబాటుదారుల నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు.

సనాపై దాడి చేశారు..

యెమెన్ రాజధాని సనాలోని విమానాశ్రయంపై సౌదీ అరేబియా దాడి చేసిందని హూతీలు ఆరోపించారు. అందుకు ప్రతికారంగానే ఈ దాడులు చేసినట్లు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గత వారం రోజులుగా సౌదీ విమానాశ్రయాలపై దాడులు పెరిగాయి. అంతకుముందు కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ముగ్గురు సౌదీ పౌరులు, ఒక పైలెట్ మరణించినట్లు హూతీలు ప్రకటించారు.
సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హూతీలపై పెద్ద ఎత్తున సైనిక చర్య ప్రారంభించిన వారం రోజుల్లోనే ఈ దాడులు తీవ్రరూపం దాల్చాయి. విమానాశ్రయాలతో పాటు సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలనూ లక్ష్యంగా చేసుకున్నట్లు కథనం పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
హూతీలపై సౌదీ చేపడుతున్న దాడుల్లో అమెరికా కూడా పాల్గొనాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం తెలిపారు. మరోవైపు, విమానాశ్రయంలో కార్యకలాపాలను సౌదీ అధికారులు నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రవేశ మార్గాలను మూసివేశారు. కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్‌రాడార్24 వెల్లడించింది.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా కూడా తమ పౌరులు ఆ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరించాయి.ఈ పరిణామాలతో సౌదీ అరేబియా తన మిత్రదేశాల నుంచి మరింత సైనిక సాయం కోరే అవకాశాలు పెరిగాయి. అయితే, అమెరికా ఈ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొంటుందా, సౌదీ అరేబియా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది రానున్న పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.



Read More
Next Story