
చైనా, భారత్ పై వందశాతం సుంకాలు?
లిండ్సే గ్రాహం బిల్లును ఆమోదించిన కాంగ్రెస్, ట్రంప్ సంతకం పెడితే చట్టంగా మారే అవకాశం
రష్యా, ఇరాన్ లో సంబంధాలు నెరిపే దేశాలపై కఠిన ఆంక్షలు విధించే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదించింది. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా సహ మిగిలిన దేశాలపై ఇక నుంచి కఠిన ఆంక్షలు విధించే అవకాశం అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు ద్వారా లభిస్తుంది.
అయితే ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని భారత్ పేర్కొంది. గత నెలలో అమెరికా సెనేట్ ఆమోదించిన 'లిండ్సే ఓ గ్రాహం రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల చట్టం 2026'ను, బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ 262-159 ఓట్ల తేడాతో ఆమోదించింది.
ఇప్పుడు ఇది చట్టంగా మారడానికి ట్రంప్ సంతకం కోసం వెళ్తుంది. ఈ చట్టానికి అనుకూలంగా 203 మంది రిపబ్లికన్లతో పాటు, 58 మంది డెమోక్రాట్లు, ఒక స్వతంత్ర సభ్యుడు ఓటు వేశారు. ఏడుగురు రిపబ్లికన్లు, 152 మంది డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకించారు. ట్రంప్‌కు సుంకాలు విధించే అధికారాలు కల్పించడంపైనే డెమోక్రాట్ల వ్యతిరేకత ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది.
రక్షణ చర్యలకు భారత్ సంకేతాలు..
ఈ అంశంపై గత కొన్ని నెలలుగా అమెరికాలోని వివిధ ప్రతినిధులతో ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు, ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో భారత పక్షం స్పష్టంగా వివరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్ తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నిశ్చయించుకుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. ఈ పరిణామాల ప్రభావాలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం భారత వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తుందని కూడా పేర్కొంది.
రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న సుంకాలు. ఈ బిల్లుకు, దీనికి మద్దతు కూడగట్టడానికి ఏడాదికి పైగా కృషి చేసి జూలైలో మరణించిన సౌత్ కరోలినా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు. "ఈ అధ్యక్షుడికి మరిన్ని సుంకాల అధికారాలు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము," అని డెమోక్రాట్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ నీల్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అన్నారు.
ఈ బిల్లు రష్యా నాయకత్వం, ఇంధన రంగంపై మాత్రమే కాకుండా, చమురు సరఫరాలపై ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కోకు వీలు కల్పించే 'షాడో ఫ్లీట్' నౌకలపై కూడా ఆంక్షలు విధించాలని కోరుతోంది.
రష్యా చమురు, గ్యాస్‌పై చైనా, భారత్ సహ ఇతర దేశాలు ఆధారపడటాన్ని తగ్గించడానికి వారిపై కఠినమైన సుంకాలు విధించేందుకు, అలాగే ఇరాన్‌పై అదనపు ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు అధికారం ఇవ్వాలని కూడా ఇది కోరుతోంది.
"చైనా, భారతదేశం, మీరు మీ చమురు, గ్యాస్‌ను వేరే చోట కొనుగోలు చేయడం మంచిది," అని బిల్లు ఆమోదం పొందిన అనంతరం డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ విలేకరులతో అన్నారు.
"రష్యా షాడో ఫ్లీట్‌ను ఉపయోగించి ఆ చమురు, గ్యాస్‌ను అమ్ముతోంది. అంటే, దానిని మార్కెట్ ధరల కంటే తక్కువకు కొనుగోలు చేసి, ఎక్కువగా చైనా, భారతదేశం వంటి దేశాలకు తరలిస్తోంది," అని డెమోక్రటిక్ సెనేటర్ జీన్ షాహీన్ అన్నారు. "రష్యా చమురు, గ్యాస్‌ను అత్యధికంగా వినియోగించే దేశం చైనా. మనం కేవలం పుతిన్‌కే కాకుండా, చైనాకు, రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక గట్టి సందేశం పంపాలి. దానికి వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పాలి," అని షాహీన్ అన్నారు.
భారీ లాబీయింగ్...
లాబీయింగ్ తర్వాత హౌస్ ఓటింగ్ జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా అధికారిక పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ బిల్లు ఆమోదం పొందింది. గత నెలలో సెనేట్ ఈ బిల్లును 86-11 ఓట్ల తేడాతో భారీ మెజారిటీతో ఆమోదించింది, కానీ హౌస్‌లో వేగం తగ్గింది.
నవంబర్ 3 ఎన్నికలకు ముందు ఓటింగ్ కోసం హౌస్ సమావేశమయ్యే చివరి రోజున ఈ బిల్లు హౌస్‌లో ఆమోదం పొందింది. ఉక్రెయిన్ అనుకూల బృందాలు తమ వాదనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. కీవ్‌కు మద్దతు కొనసాగించాలని అమెరికా చట్టసభ సభ్యులతో లాబీయింగ్ చేసేందుకు, అమెరికన్ కోయలిషన్ ఫర్ ఉక్రెయిన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో ఉక్రెయిన్ యాక్షన్ సమ్మిట్ కొనసాగుతోంది.
Next Story

