మలేరియా రహిత జిల్లాల ‘ప్రకటన’కు కోట్లు ఖర్చు ఎందుకు?
x
ఈ క్యారికేచర్ ఏఐ సృష్టించినది.

మలేరియా రహిత జిల్లాల ‘ప్రకటన’కు కోట్లు ఖర్చు ఎందుకు?

మలేరియా కేసులు తగ్గుతున్నాయని చెబుతూనే కోట్లు ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కేసులు తగ్గినప్పుడు కోట్ల ఖర్చు ఎందుకనే చర్చ ఏపీలో మొదలైంది.


ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జారీ చేసిన ప్రకటనలో బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. కేసులు తగ్గుతున్నాయని, 2030 నాటికి గణనీయంగా తగ్గించే ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ ఒకవైపు మలేరియా ‘రహిత’ జిల్లాల ప్రకటనలు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దోమల నివారణకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించడం. ఈ వైరుధ్యం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఏజెన్సీలో తగ్గని మలేరియా

2024-25లో 7,871 మలేరియా కేసులు నమోదైతే, 2025-26లో 7,199కి తగ్గాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 16 వారాల్లోనే 899 కేసులు వచ్చాయని, గతేడాది ఇదే కాలంలో 1,783 ఉండేవని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి వెయ్యి మందికి 0.15 కేసుల రేటు ఉందని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.46, పార్వతీపురం మన్యం జిల్లాలో 1.95 చొప్పున ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ తగ్గుదల నిజమైన ‘నిర్మూలన’కి సరిపోతుందా లేదా కేవలం సీజనల్ వ్యత్యాసమా అన్న ప్రశ్నలు మిగిలిపోతున్నాయి.

13 జిల్లాల్లో ఐఆర్ఎస్ కార్యక్రమం

రాబోయే వర్షాల దృష్ట్యా ‘ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే’ (IRS) కార్యక్రమాన్ని మే 15 నుంచి ఆగస్టు 30 వరకు 13 జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మర్కాపురం, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు ల్లో దశలవారీగా చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లోనూ ఇప్పటికే స్ప్రే ప్రారంభమైంది. గోడలు, పైకప్పులపై క్రిమిసంహారక మందులు (అల్ఫా సైపర్‌మెత్రిన్, మలాథియాన్) పిచికారీ చేయడానికి మాత్రమే రూ.4.80 కోట్లు, మొత్తం కార్యక్రమానికి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 1.95 లక్షల కుటుంబాలు, విద్యార్థుల వసతి గృహాలకు 2.55 లక్షల దోమ తెరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే పంపిణీ దశలో ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు రెండు కేసులు నమోదైన గ్రామాల్లోనే స్ప్రే చేపట్టనున్నారు.

వైరుధ్యం ఎక్కడ ఉంది?

మూడేళ్లుగా స్థానిక కేసులు లేవని, బయట నుంచి వచ్చిన వారి ద్వారా మాత్రమే కొన్ని కేసులు వచ్చాయని చెప్పి బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను ‘మలేరియా రహిత’గా ప్రకటించాలని కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కానీ అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీగా స్ప్రే, దోమ తెరలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎందుకు? మలేరియా ఎలిమినేషన్ క్రైటీరియా ప్రకారం కేంద్ర బృందం పర్యటించి నిశిత పరిశీలన చేస్తుందని మంత్రి చెప్పినా, ప్రజల మనసులో ఒక ప్రశ్న మిగులుతోంది. కోట్లు ఖర్చు చేస్తూ మలేరియా ‘రహిత’ జిల్లాలు ప్రకటించడం ఎంతవరకు సమంజసం?

వాస్తవం దూరంగానే ఉంది

గిరిజన జిల్లాల్లో ఇంకా ప్రతి వెయ్యికి 3.46 కేసుల వరకు నమోదవుతున్న తీరు చూస్తే, రాష్ట్ర సగటు 0.15 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి లక్ష్యం సాధించాలంటే కేవలం ప్రకటనలు, సీజనల్ స్ప్రేలు సరిపోవు. నిరంతర పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం ముఖ్యం. ప్రస్తుత ప్రకటనలు ప్రజలను ఆశావాదులను చేస్తున్నా, వాస్తవికత ఇంకా దూరంగానే ఉంది.

ప్రపంచ మలేరియా దినోత్సవం నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటనలు పాలకుల నిబద్ధతను ప్రతిబింబిస్తాయా లేదా ఎన్నికల సన్నాహాల్లో భాగమా అన్న చర్చ ఇక్కడి నుంచి మొదలవుతోంది. మలేరియా నిర్మూలన నిజమైతేనే ప్రజల ఆరోగ్యం సురక్షితం. కేవలం సంఖ్యలు తగ్గడం సరిపోదు. స్థిరమైన ఫలితాలు కావాలి.

Read More
Next Story