
ఆంధ్రప్రదేశ్ పర్యాటక ‘ప్రయాణం’ లో ఏమి జరిగిందంటే...
డిసెంబరు, జనవరి మాసాల్లో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటక శాఖ సరికొత్త అందాలు కెమెరాల్లో బంధించింది. కళాకారులతో పర్యటించి ప్రపంచానికి చూపింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అందాలు ఉన్నాయి. ఎంటర్టైన్ మెంట్ ఉంది. రండి చూసి ఆనందించండి అంటూ రెడు దఫాలుగా గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయాణం సక్సెస్ అయిందని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ‘‘ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని’’ ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయం స్పష్టం చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు కొత్త ఊపును అందించినట్లు చెప్పారు. ఈ కొత్త వ్యూహం ద్వారా గ్రామీణ సంస్కృతి, స్థానిక అందాలు, సాంప్రదాయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయనున్నారు.
అరకు వ్యాలీ అందాలు
రెండు దశల్లో మంచి ఫలితాలు
మొదటి దశ (డిసెంబర్ 13-20, 2025): ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి 11 మంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ‘‘విశాఖపట్నం, అరకు వ్యాలీ, లంబసింగి’’ ప్రాంతాల్లో వారం రోజుల పాటు పర్యటించారు.
అరకు ఆకుపచ్చని లోయలు, లంబసింగి శీతల వాతావరణం, కాఫీ తోటలు, దట్టమైన అడవులను అద్భుతంగా క్యాప్చర్ చేసిన ‘80-100 అత్యున్నత నాణ్యత కలిగిన వీడియోలు’, డ్రోన్ షాట్లు, సినిమాటిక్ ట్రావెల్ ఫిల్మ్స్ ద్వారా సుమారు ‘40 లక్షలకు పైగా వ్యూస్’ సాధించారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ప్రతి ఒక్కరికీ 3 నుంచి 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు పొందాయి.
రాష్ట్రంలో పర్యటించిన కళాకారులు
రెండవ దశ (జనవరి 13-17, 2026): ‘‘కోనసీమ సంక్రాంతి సంబరాలు’’ను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అయోధ్య, కోల్‌కతా, ముంబై, ఒడిశా నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్లు పర్యటించారు. ‘భోగి మంటలు’, ప్రభల తీర్థం (ప్రభల తీర్థం), స్థానిక ఆచార-వ్యవహారాలు, పండుగ వైభవాన్ని స్వయంగా అనుభవించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆత్రేయపురం, అంతర్వేది, రాజమండ్రి వంటి ప్రాంతాల్లోని గోదావరి డెల్టా అందాలు, పంటలు, సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కేవలం ‘30 రీల్స్’ ద్వారానే ‘5 మిలియన్ల వ్యూస్’ వచ్చాయి.
కోనసీమలో కొబ్బరి తోటల అందాలు
ఆర్థిక ప్రయోజనాలు, స్థానికులకు ఉపాధి
గత నెల రోజుల్లోనే ‘‘1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు’’ వచ్చాయి. వీటిని రాష్ట్రంలోని రిజిస్టర్డ్ టూర్ ఆపరేటర్లకు అందించడం ద్వారా ‘‘స్థానిక హోమ్‌స్టేలు’’, గిరిజన గైడ్లు, కళాకారులకు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇది సాధారణ ప్రకటనల కంటే చాలా ఖర్చుతో కూడుకున్న, నాణ్యమైన కంటెంట్ బ్యాంక్‌ను కూడా సృష్టించింది.
భవిష్యత్ ప్రణాళికలు
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్ట్ విలేజ్‌లు’ (కళా గ్రామాలు) అభివృద్ధి చేయడం, హోమ్‌స్టే నెట్‌వర్క్ ను విస్తరించడం వంటి పనులు ‘వాలంటీర్ యాత్ర’తో కలిసి చేపట్టనున్నారు.
ఇప్పటి వరకు ‘విశాఖ సర్క్యూట్’ లో 80కి పైగా, ‘కోనసీమ సర్క్యూట్’ లో 30కి పైగా వీడియోలు/రీల్స్ తయారు చేశారు. మొత్తం ‘9 మిలియన్లకు పైగా’ ప్రజలు వీక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అపురూపమైన ప్రాంతాలను ఈ తరహాలోనే ప్రమోట్ చేయనున్నారు.

