
‘జన నాయగన్’ మూవీ లీక్ కేసు: ముగ్గురి అరెస్టు
స్టూడియో నుంచే డేటా చోరీ. పైరసీపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక.
‘జన నాయగన్’ సినిమా డేటా చోరీ, ఆన్‌లైన్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌తో పాటు ముగ్గురు ప్రధాన నిందితులను తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులు ఏప్రిల్ 15న జరిగినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
పోలీసుల ప్రకారం.. ఈ కేసులో విస్తృత సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాల పరిశీలన అనంతరం నిందితులను గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 11న పైరసీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేసినందుకు మరో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతను ఒక ఎడిటింగ్ స్టూడియోలోకి అనధికారికంగా ప్రవేశించి సినిమా రీల్స్ డేటాను దొంగిలించినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ఆ డేటాను సినిమా ఫార్మాట్‌గా మార్చి తన సహ నిందితులతో పంచుకున్నాడు. ఈ కంటెంట్ అనంతరం ఆన్‌లైన్‌లో విస్తృతంగా లీక్ అయ్యింది.
నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, అరెస్టు అయిన వారి వ్యక్తిగత వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, లేదా ఇతరులకు పంపించడం వంటి చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. డిజిటల్ పైరసీలో పాల్గొంటే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, ఎవరైనా పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింకులు గమనించినట్లయితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) లేదా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఇదిలా ఉండగా, నటుడు-రాజకీయవేత్త విజయ్ నటించిన ఈ చిత్రం మొదట 2026 జనవరిలో విడుదల కావాల్సి ఉంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క్లియరెన్స్ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.

