మదనపల్లెలో అలనాటి నటి ‘రమాప్రభ’ బర్త్‌డే వేడుకలు..
అధ్యాపకురాలు సుందరవల్లి రచనతో పుస్తక రూపంలో జీవిత కథ ఆవిష్కరణ!
తెలుగు వెండితెర పైన మూడు తరాలను అలరించిన హాస్యనటి రమాప్రభ మదనపల్లె పట్టణంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. రమాప్రభ అలనాటి మేటి హాస్యనటి. 81 సంవత్సరాల రమాప్రభ జన్మదిన వేడుకలను మదనపల్లె పట్టణం బసినికొండలోని ఆమె నివాసం వద్ద అభిమానులు నిరాడంబరంగా నిర్వహించారు. అధ్యాపకురాలు మోహన వల్లి రచించిన రమాప్రభ.. ఇదేనండి నా కథ అనే పుస్తకాన్ని రమాప్రభకు అంకితం ఇచ్చారు. ఇందులో సినీ నటి రమాప్రభ నాటక రంగం, చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటిగా పండించిన పాత్రలను ప్రధానంగా ప్రస్తావించినట్లు రచయిత మోహన వల్లి చెప్పారు.
" రమాప్రభ సినీ ప్రస్థానం, జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరిచాను " అని రచయిత్రి మోహన వల్లి తెలిపారు.
మదనపల్లి రచయితల సంఘం ( మా రస ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు మదనపల్లె పట్టణ ప్రముఖులు, సినిమా నటి రమాప్రభ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మదనపల్లె పట్టణంలోని బసినికొండ వద్ద ఉన్న రమాప్రభ సొంత ఇంటి వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. అభిమానులు తీసుకువచ్చిన కేక్ కట్ చేసిన రమాప్రభ తన ఆనందాన్ని సాహితీ వేత్తలు, అభిమానులతో కలిసి పంచుకున్నారు.
రమాప్రభ మదనపల్లి లో ఎందుకు ఉన్నారు
మదనపల్లి పట్టణం అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అనేక సంఘటనలకు నిలయం. ఈ పట్టణంలోనే సినిమా నటి రమాప్రభ సొంత ఊరు. 1960 సంవత్సరంలో రమాప్రభ సినిమా రంగానికి పరిచయమయ్యారు. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలతో కలిపి దాదాపు 14 00 సినిమాలకు పైగానే నటించి రికార్డు సృష్టించారు.
ఆమె కమెడియన్గా ప్రముఖ నటుడు రాజబాబు కాంబినేషన్లో తెలుగు తెరపై ఎంతో ప్రాచుర్యం పొందారు. వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా హాస్య సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించేవి. హాస్య పాత్రలకే పరిమితం కాకుండా రమాప్రభ కథానాయకగా అక్కగా వదినగా తల్లిగా నానమ్మగా అమ్మమ్మగా అనేక భావోద్వేగా పూరిత పాత్రల్లో నటించి మెప్పించారు.
మూడు తరాలను మెప్పించిన నటి
రమాప్రభ హాస్య చిత్రాల్లో నటించిన మూడు తరాల సినీ అభిమానులను అలరించారు. ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి దేవదాసు పల్లెటూరి చిన్నోడు ఇల్లు ఇల్లాలు గుండమ్మ కథ వంటి కుటుంబ కథ చిత్రాల్లో అనేక పాత్రలు క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కూడా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కూడా రమాప్రభ విభిన్న పాత్రలు పోషించి నేటి తరాన్ని కూడా అలరించిన ఖ్యాతి దక్కించుకున్నారు అనడంలో సందేహం లేదు.
వెండితెరపై ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న సినీనటి రమాప్రభ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత చిత్రాన్ని ఆవిష్కరించే రీతిలో అధ్యాపకురాలు మోహన వల్లి రచించిన "రమాప్రభ.. ఇదేనండి నా కథ" పుస్తకాన్ని రమాప్రభకు అంకితం ఇచ్చారు.
Next Story

