ఫిల్మ్ మేకింగ్ లో AI! స్పీల్‌బర్గ్ స్టేట్‌మెంట్ వైరల్
x

ఫిల్మ్ మేకింగ్ లో AI! స్పీల్‌బర్గ్ స్టేట్‌మెంట్ వైరల్

ఆయన ఏమన్నారు?!


కళ్లు చెదిరే గ్రాఫిక్స్, ఊహకందని టెక్నాలజీ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి రైటర్ల వరకు అందరి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటోంది. ఈ టెక్నాలజీ సునామీకి ఇండస్ట్రీ భవిష్యత్తు ఏమైపోతుందో అని అంతా టెన్షన్ పడుతున్న వేళ, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ గ్రహీత స్టీవెన్ స్పీల్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు సినిమా మేకింగ్‌లో ఏఐ వాడకంపై ఆయన గీసిన ఆ లక్ష్మణ రేఖ ఏంటి? రైటర్స్ టేబుల్ వద్ద ఏఐ కూర్చోవడంపై ఆయనెందుకు అంతలా అగ్గిమీద గుగ్గిలమయ్యారు?

ప్రపంచ సినీ పరిశ్రమలో ఏఐ దూసుకెళ్తోంది. స్క్రిప్టులు రాస్తోంది, విజువల్స్ క్రియేట్ చేస్తోంది, హీరోల వాయిస్స్ కూడా క్లోన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసేలా ఒక హెచ్చరిక వచ్చింది. అది కూడా సాధారణ దర్శకుడి నుంచి కాదు.. ‘జురాసిక్ పార్క్’, ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘ET’ లాంటి క్లాసిక్స్ తీసిన లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ నుంచి!సినిమా భవిష్యత్తుపై పెరుగుతున్న భయాల మధ్య స్పీల్‌బర్గ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పెద్ద చర్చగా మారాయి. ఇటీవల మిచెల్ ఒబామా, క్రెగ్ రాబిన్సన్ నిర్వహించిన ‘IMO’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్పీల్‌బర్గ్.. సినిమా మేకింగ్‌లో AI పాత్రపై గట్టిగానే స్పందించారు.

కంప్యూటర్‌కు గుండె ఉందా? ఆత్మ ఉందా?

ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న ఈ లెజెండరీ దర్శకుడు ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఏఐపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రచయితల టేబుల్ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉంచి, ఆ స్థానాన్ని ఏఐతో భర్తీ చేయడాన్ని తాను ప్రాణం ఉన్నంతవరకు అంగీకరించనని తెగేసి చెప్పారు. కంప్యూటర్లకు సొంతంగా ఆలోచించే శక్తి గానీ, అనుభవించే స్పృహ గానీ ఉంటుందనే నమ్మకం తనకు లేదన్నారు. మానవ ఆత్మకు, వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. మనుషుల కంటే ఒక మిషన్ ఎక్కువగా అనుభూతి చెందుతుందని భావించడం.. తాను పెరిగిన వాతావరణానికి, తన దర్శకత్వ వృత్తికి పూర్తిగా విరుద్ధమని ఓపెన్ అయ్యారు.

“మనుషుల ఆత్మకు, అంతర్గత సృజనాత్మకతకు ఎలాంటి అల్గారిథమ్ ప్రత్యామ్నాయం కాదు” అని ఆయన అన్నారు. ఒక కంప్యూటర్ మనుషుల కంటే ఎక్కువగా ఫీల్ అవుతుందని నమ్మడం.. నేను పెరిగిన విలువలకు పూర్తిగా విరుద్ధం” అంటూ తీవ్రంగా స్పందించారు. AI ఎంత తెలివిగా పనిచేసినా.. బాధ, ప్రేమ, కోపం, నిశ్శబ్దం, పశ్చాత్తాపం లాంటి మానవ అనుభూతులను నిజంగా అర్థం చేసుకోలేదని స్పీల్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.

డైరెక్షన్ సీట్లో రోబోనా? నో వే!

సినిమా నిర్మాణంలో ఏఐ పాత్ర ఏ మేరకు ఉండాలనే దానిపై స్పీల్‌బర్గ్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. కేవలం సమాచార సేకరణ, సాంకేతిక సహాయం కోసమే ఏఐని ఒక టూల్‌గా వాడుకోవాలని హితవు పలికారు. ఉదాహరణకు సినిమా షూటింగ్ కోసం కొత్త లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే ఓకే కానీ, కథనంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు.

తన సినిమాలో ఏ నటీనటులను ఎంపిక చేయాలి? పాత్రల మధ్య డైలాగులు ఎలా రాయాలి? కెమెరాను ఏ యాంగిల్‌లో పెట్టాలి? సెట్ ఎలా ఉండాలి? అనే క్రియేటివ్ విషయాలను ఒక సాఫ్ట్‌వేర్ తనకు సూచించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సృజనాత్మక రంగాన్ని శాసించే అల్గారిథమ్స్ ఇంకా పుట్టలేదని, కళలో మానవీయ కోణమే ప్రాణమని నొక్కి చెప్పారు. సినిమా అనేది కేవలం కొన్ని కంప్యూటర్ కమాండ్స్ కలయిక కాదని, అది మానవ మేధస్సు, హృదయం నుండి వచ్చే ఒక అద్భుత సృష్టి అని వివరించారు.

ఆ రంగాల్లో వాడితే ముద్దాడుతాం.. కానీ!

ఇండస్ట్రీలో ఏఐ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్పీల్‌బర్గ్, ఇతర రంగాలలో దాని ఉపయోగాలను మాత్రం మనస్ఫూర్తిగా ప్రశంసించారు. వైద్య రంగంలో ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలకు సరైన చికిత్సలు కనుగొనడంలో, విద్యా రంగంలో విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించడంలో ఏఐ సాంకేతికత ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని మానవ కళాత్మకతను చంపడానికి కాకుండా, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందని ఈ హాలీవుడ్ లెజెండ్ తేల్చి చెప్పారు.

రాబోయే రోజుల్లో AI సినిమాలను తయారు చేస్తుందా?, లేక మనుషులే ఇంకా కథలు చెబుతారా? అనే ప్రశ్నకు స్పీల్‌బర్గ్ వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీశాయి.

ఏదేమైనా టెక్నాలజీ గుడ్డిగా నమ్ముకుని సినిమాలు తీసే వాళ్లకు స్పీల్‌బర్గ్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ఏఐ విప్లవంపై మన టాలీవుడ్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి!

Read More
Next Story