తిరుపతి 'నైలిట్'పై రాజకీయ నీలినీడలు..
తిరుపతి క్యాంపస్ వివాదం:లేఖల నుంచి తరలింపు ఆరోపణల వరకు... ఏమి జరిగిందో వీడియో కథనం
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) ప్రాంగణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) క్యాంపస్ తాత్కాలిక భవనాల్లో ప్రారంభించారు. దీనిని అమరావతి రాజధాని మంగళగిరికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అంశంపై రాజకీయంగా రగడ ప్రారంభమైంది.
తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ శ్రీసిటీలతో పాటు అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (EMCలు) అందుబాటులో ఉన్నాయని, ఈ పారిశ్రామిక వాతావరణానికి అనుగుణంగా NIELIT ఇక్కడే ఉంటే స్థానిక సీమ విద్యార్థులకు రూ.లక్షల విలువైన హైటెక్ కోర్సులు తక్కువ రుసుంతో లభించడమే కాకుండా, స్థానిక పరిశ్రమల్లోనే నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంత విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగు పరచడం, టెక్నాలజీలో పదను పెట్టే లక్ష్యంగా నైలెట్ క్యాంపస్ తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. దీనికోసం వైసీపీ ప్రభుత్వంలోనే బీజం పడింది. వైసీపీ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి నైలైట్ క్యాంపస్ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు ఇలా ఉన్నాయి.
తిరుపతిలోని విద్యాసంస్థలు, యూనివర్సిటీల నుంచి విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులకు సరైన నైపుణ్య కోసం NIELIT ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అప్పటి సీఎం వైఎస్. జగన్ తో 2022 మార్చి రెండో తేదీ లేఖ రాయించారు.
2022 డిసెంబర్ 23న NIELIT డైరెక్టర్ జనరల్ కు లేఖలో కృతజ్ణతలు. ఎందుకంటే NIELIT ప్రతినిధులను పంపించి క్యాంపస్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని పంపించారు.
2023 ఏప్రిల్ ఒకటో తేదీ: తిరుపతిలో NIELIT సంస్థను ప్రారంభిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.
2023 మే 17వ తేదీ ఈ అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామని నైలైట్ డైరెక్టర్ నుంచి సమాధానం వచ్చింది.
కేంద్ర మంత్రి సానుకూల స్పందన
2026 మే 15: తిరుపతిలో NIELIT శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలసి విజ్ఞప్తి చేశానని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గుర్తు చేశారు. దీంతో
2026 జూన్ 22: NIELIT శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపు వివరాలతో పాటు DPRను పంపాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ MeitYలోని NIELIT నిపుణులతో రూపొందించిన DPRలోనే “Setting up of permanent campus of NIELIT at Tirupati, which is deemed to be university” అని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, తిరుపతిలో సుమారు 15 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక చేసినట్లు కూడా DPRలో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి...
కేంద్రం నుంచి సానుకూలం స్పందన సాధించడంతో పాటు క్యాంపస్ ఏర్పాటు చేయించిన తీరును తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణకు ఆర్థిక వనరులు లేని నిరుపేద విద్యార్థులకు ఈ క్యాంపస్ వరమని ఎంపీ గురుమూర్తి ప్రస్తావించారు.
"శాశ్వత భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులు కూడా పూర్తయ్యే సమయంలో NIELITను తిరుపతి నుంచి అమరావతికి ఎందుకు తరలిస్తున్నారు." అని ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఆ ఆలోచన చేయడం రాయలసీమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేయడమే అంటూ, దీనిపై స్పష్ట ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
"తిరుపతిలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి అధునాతన కోర్సుల్లో 1,200 మందికి పైగా విద్యార్థులు నైపుణ్య శిక్షణ తీసుకున్నారు" అని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ గుర్తు చేశారు. ఇలాంటి కీలక సంస్థను వేరే ప్రాంతానికి మళ్లించడం సీమ యువత భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతిలో కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదనీ, రాయలసీమకు దక్కిన ప్రాజెక్టులను లాక్కోవడం ప్రాంతీయ సమానత్వానికి తీవ్ర విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా తిరుపతిలోనే NIELIT శాశ్వత క్యాంపస్‌కు భూమి కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Next Story

