
స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి ‘చందాలు’ సొసైటీ..
లక్షల కోట్లు అప్పులు... అయినా దాతలపై ఆధార పడటం.
ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ‘ఏపీ స్కూల్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సొసైటీ’ని ఏర్పాటు చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.8 ప్రకారం, ఈ సొసైటీ అధ్యక్షుడిగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి స్థానాల్లో ఐఏఎస్ అధికారులు ఉంటారు. ముఖ్య సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల కమిషనర్లు తప్పనిసరి. ఎన్‌ఆర్‌ఐలు, దాతలు, సీఎస్‌ఆర్ ఫండ్స్, అల్యూమ్ని అసోసియేషన్లు, సాధారణ ప్రజల నుంచి ‘చందాలు’ సేకరించి సౌకర్యాలు అందించే లక్ష్యంతో డోనర్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేశారు. 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు కోసం కూడా అనుమతి ఇచ్చారు.
ఇది ‘మన బడి – మన భవిష్యతు’ కార్యక్రమం కింద జరుగుతోంది. కానీ ఇక్కడే ప్రశ్నలు మొదలవుతాయి. ఇన్ని ఏళ్లుగా ప్రభుత్వ నిధులతో స్కూళ్లు బాగుపడలేదా? ఇప్పుడు ఇదేమిటి? ప్రధానంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే రాబడి సరిపోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రం వేల కోట్ల అప్పులు చేస్తోంది. ఆ అప్పులు ఎవరి కోసం? ఎందుకోసం? ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా?
నాడు-నేడు పథకం...
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ‘మన బడి – నాడు నేడు’ కింద రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 15,715 స్కూళ్లను మొదటి దశలోనే మార్చేసింది. టాయిలెట్లు, తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ల్యాబులు, గ్రీన్ బోర్డులు, రిటైనింగ్ వాల్స్, అన్నీ ప్రభుత్వ నిధులతోనే. రెండవ, మూడవ దశలు కూడా కొనసాగి మొత్తం 45,000 స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లు అప్‌గ్రేడ్ అయ్యాయి. ఫలితం? ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు నాలుగు లక్షలు పెరిగాయి. ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. అప్పులు చేసినా, ఆ అప్పులు కనీసం స్కూళ్ల అభివృద్ధికి ఖర్చు అయ్యాయి.
ఇప్పుడు?
2026-27 బడ్జెట్‌లో స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.32,300 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయినా దాతల చందాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు? రాష్ట్ర అప్పుల భారం భారీగా ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామని, వడ్డీలో ఆదా అవుతోందని చెబుతున్నారు. కానీ రెవెన్యూ లోటు కోసం కూడా అప్పులు తీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు (సంవత్సరానికి రూ.33,000 కోట్లు పైగా) రాబడిని మింగేస్తున్నాయని సీఎం చెప్పినా, అప్పులు మాత్రం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కు కాకుండా రెవెన్యూ ఖర్చులకు కూడా వాడుతున్నారా? స్కూళ్ల అభివృద్ధి ఎంతవరకు ప్రాధాన్యత?
ఈ సొసైటీలో ఐఏఎస్ అధికారుల ఆధిపత్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషనర్లను తప్పనిసరి చేయడం. రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నాయి. దాతల నుంచి వచ్చిన నిధులు ఎలా ఖర్చు అవుతాయి? ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందా? గతంలో కూడా ఎన్‌ఆర్‌ఐలు, సీఎస్‌ఆర్ ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేశారు. కానీ అది సప్లిమెంటరీగానే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతను దాతల మీద మోపడం లాగా కనిపిస్తోంది.
ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. వారి పిల్లల చదువు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అప్పులు తెచ్చి జీతాలు, పెన్షన్లు చెల్లించి, స్కూళ్ల మెరుగుదలను దాతల చేతుల్లోకి వదిలేయడం సరైన విధానమా? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే ‘మన బడి’ కాక ‘దాతల బడి’ అని ప్రజలు అనుకుంటే ఆశ్చర్యం లేదు.

