x

అనంతపురం: 'మా ప్రతిభే మమ్మలిని టీచర్లను చేసింది'

వైసీపీ అసత్య ప్రచారాలు మానకుంటే నిరసనలు ఉధృతం చేస్తామంటున్న మెగా డీఎస్సీ అభ్యర్థులు.


Click the Play button to hear this message in audio format

"మేము చదువుకున్నాం. ప్రతిభతో సత్తాం చాటాం. అందుకే మాకు టీచర్ పోస్టులు వచ్చాయి" అని మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీలో డబ్బులు ఇచ్చిన వారికే పోస్టులు ఇచ్చారనే ప్రచారం మానుకోవాలని వైసీపీ నేతలకు మెగా డీఎస్సీలో టీచర్లుగా నియమితులైన హితవు పలికారు.

అనంతపురం జిల్లా మడకశిరలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కటౌట్లకు పాలభిషేకం చేశారు.

"వైసీపీ తన ప్రతిభను అవమానిస్తోంది. మీరు అధికారంలో ఉండగా డీఎస్సీ నిర్వహించి ఉంటే పరీక్షలు రాసే వాళ్లం. వయోపరిమితి దాటే స్థితిలో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాం" అలాంటి మమ్మలను అవమానిస్తారా అని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నినదించారు. మడకశిరలో ఏకంగా వాల్మీకి సర్కిల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.

డీఎస్సీ కథ ఇదీ...

టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత 2024 జూన్ 12వ తేదీ మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2025 ఏప్రిల్ 20వ తేదీ షెడ్యూల్ విడుదల చేయడంతో 3,35401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి జూన్ ఆరు నుంచి జూలై ఆరో తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 13వ తేదీ సవరించిన టెట్ స్కోర్ తో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ ముందుగా ముహూర్తం సమయానికి వాతావరణం అనుకూలించని స్థితిలో25 తేదీ అర్హత సాధించిన టీచర్లను నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో ఫస్ట్ ర్యాంకర్ పేరు తొలగించిన వ్యవహారం వివాదంగా మారి, రాజకీయ ఆరోపణలకు ఆస్కారం కల్పించింది. ఢిల్లీ జన్ జీ ఉద్యమం తరువాత ఏపీలో కూడా వైసీపీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ దశలవారి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో..
"పోస్టులు ఇవ్వడానికి నగదు చేతులు మారింది. అవినీతి పెచ్చుమీరింది" అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డీఎస్సీ వివాదం కావడంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మండి పడుతున్నారు.

రాజకీయ మలుపు తిప్పిన ర్యాంక్

ఫస్ట్ ర్యాంకర్ పేరును తొలగించడంతో మొదలైన వివాదం మొదలై రాజకీయంగా మలుపు తిరిగింది. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మండి పడుతున్నారు. డీఎస్సీ ఫలితాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పీ. నవీన్ సోషల్ స్టడీస్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించని మొదటి జాబితాలో ప్రకటించడం, వారం తరువాత వెలువడిన జాబితాలో ఆ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది.

ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించాం..

వైసీపీ నిరసనలు, ఆరోపణలపై ఉద్యోగాలు సాధించిన టీచర్లు మండిపడ్డారు. మడకశిరలో నిర్వహించిన ర్యాలీ అనంతరం వారు మాట్లాడారు.
"మెగా డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించి, కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లడం సరికాదు" అని మెగా డీఎస్సీ అభ్యర్థులు వైసిపి నాయకులపై మండిపడ్డారు. మెగా డీఎస్సీలో ఎంపికైన మాపై దగా డిఎస్సీగా అసత్య ప్రచారాలు చేస్తున్న వైసిపి విధానం మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే మెగా డీఎస్సీ అభ్యర్థులుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
2025 మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఉద్యోగాలు సాధించుకున్నామని అని అన్నారు. మా కష్టాన్ని తక్కువ చేసి చూడకండి అని అన్నారు.
"కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల పట్ల రాజకీయం చేయడం సరైంది కాదు" అని అన్నారు. వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని, వారి మాటలు తమను అవమానించడమే కాదు. మానసిక వేదనకు గురి చేస్తున్నాయని కలత చెందారు.
Read More
Next Story