
మద్యంపై పన్ను విధానంలో తేడాలెందుకు?
కర్ణాటకలో బీర్, మద్యం డిస్టిలరీల మధ్య ఆధిపత్య పోరు
కర్ణాటకలో కొత్త మద్యం పన్నుల విధానం ఇప్పుడు బ్రూవర్లకు, డిస్టిలర్లకు మధ్య వివాదానికి కారణమైంది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బీర్ అమ్మకాలు దాదాపు 50 శాతం పెరిగాయి. కానీ ప్రభుత్వానికి వచ్చిన అదనపు ఎక్సైజ్ ఆదాయంలో 82 శాతం వాటా ఇండియన్ మేడ్ లిక్కర్ నుంచే సమకూరింది. అమ్మకాలు ఒకవైపు.. ప్రభుత్వ ఆదాయం మరోవైపు.. ఇలా భిన్నమైన గణాంకాలు వెలువడటంతో కొత్త పన్నుల విధానం ఎవరికి మేలు చేస్తోందనే చర్చ మొదలైంది.
కర్ణాటక ప్రభుత్వం 2026 మే 11న ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ (AIB) పేరుతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో అమల్లో ఉన్న పన్నుల విధానానికి బదులుగా, మద్యంలో ఉండే ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు విధించే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మార్పు మద్యం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన అమ్మకాల గణాంకాలు బీర్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని చూపించాయి. గత ఏడాది ఇదే కాలంలో 84.63 లక్షల కేసులుగా ఉన్న బీర్ అమ్మకాలు ఈసారి 126.68 లక్షల కేసులకు చేరుకున్నాయి. అంటే 49.69 శాతం పెరిగాయి. మరోవైపు ఇండియన్ మేడ్ లిక్కర్ అమ్మకాలు మాత్రం 1.52 శాతం మాత్రమే పెరిగి 171.69 లక్షల కేసులకు చేరుకున్నాయి.
అయితే అమ్మకాల పెరుగుదల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో మాత్రం కనిపించలేదు. ఇండియన్ మేడ్ లిక్కర్ ద్వారా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం 13.36 శాతం పెరిగి రూ.9,033.21 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.1,064.52 కోట్ల ఆదాయం సమకూరింది. బీర్ ద్వారా వచ్చిన ఆదాయం 18.52 శాతం పెరిగి రూ.1,463.07 కోట్లకు చేరింది. దీనివల్ల అదనంగా రూ.228.57 కోట్లు వచ్చాయి.
ఈ రెండు విభాగాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.1,291.94 కోట్ల అదనపు ఆదాయం లభించింది. ఇందులో ఇండియన్ మేడ్ లిక్కర్ వాటా 82 శాతం కాగా, బీర్ వాటా కేవలం 18 శాతం మాత్రమే. దీంతో బీర్ అమ్మకాలు భారీగా పెరిగినా, ప్రభుత్వ ఆదాయానికి ప్రధానంగా ఐఎంఎల్ నుంచే డబ్బు సమకూరిందనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
పన్నుల విధానంపై భిన్నాభిప్రాయాలు..
ఈ గణాంకాల ఆధారంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ (CIABC) కొత్త పన్నుల విధానాన్ని ప్రశ్నిస్తోంది. అమ్మకాల పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా, ఇండియన్ మేడ్ లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగడానికి అధిక పన్నులే కారణమని ఆ సంస్థ వాదిస్తోంది.
ముఖ్యంగా సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం ధరలపై పన్నుల భారం పెరిగితే, రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అన్ని రకాల మద్యపానీయాలపై సమతుల్యంగా పన్నులు విధించాలని కోరుతోంది.
మద్యం వినియోగాన్ని బాధ్యతాయుతంగా నియంత్రించడమే పన్నుల విధానం ప్రధాన ఉద్దేశంగా ఉండాలని CIABC డైరెక్టర్ జనరల్ అనంత్ ఎస్. అయ్యర్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమలోని ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా పన్నుల విధానం ఉండకూడదని, ఒక రకమైన మద్యాన్ని మరో రకమైన మద్యంతో పోలిస్తే చౌకగా మార్చి వినియోగాన్ని ప్రోత్సహించకూడదని ఆయన పేర్కొన్నారు.
మొత్తం ఇథనాల్ వినియోగం, మద్యం తాగే తరచుదనం, కొనుగోలు శక్తి, మార్కెట్లో మద్యం అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే సమర్థవంతమైన పన్నుల విధానం రూపొందించగలమని ఆయన వివరించారు.
బీర్‌కు అనుకూలంగా పన్నుల విధానం ఉందా?
మరోవైపు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మాత్రం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు విధించడం వల్ల తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎంచుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుందని చెబుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు మద్యం వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన నష్టాలను కూడా తగ్గించవచ్చని వాదిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇలాంటి పన్నుల విధానాన్ని సిఫారసు చేసిందని బీఏఐ పేర్కొంది. ఆల్కహాల్ శాతం ఆధారిత పన్నుల విధానం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ నమూనాల్లో ఒకటని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు. అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు మద్యం హానికర వినియోగాన్ని తగ్గించాలంటే పన్నుల రేట్లు కూడా సరైన స్థాయిలో ఉండాలని, కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో సమతుల్యత పాటించినట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే బీర్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉందని చెప్పి, దాన్ని ఇతర మద్యపానీయాల కంటే సురక్షితమైనదిగా పరిగణించలేమని CIABC వాదిస్తోంది. ఐదు శాతం ఆల్కహాల్ ఉన్న 255 మిల్లీలీటర్ల బీర్లో ఉండే స్వచ్ఛమైన ఆల్కహాల్ పరిమాణం, 42.8 శాతం ఆల్కహాల్ ఉన్న 30 మిల్లీలీటర్ల స్పిరిట్స్‌లో ఉండే పరిమాణానికి దాదాపు సమానమని వివరిస్తోంది.
అందువల్ల ఏ రకమైన మద్యం తాగుతున్నారు అనే దానికంటే, ఎంత పరిమాణంలో తాగుతున్నారు, ఎంత తరచుగా తీసుకుంటున్నారు అనే అంశాలే ముఖ్యమని ఆ సంస్థ స్పష్టం చేస్తోంది.
ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త AIB పన్నుల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో మద్యం పన్నుల విధానాల్లో మార్పులు చేయాలనుకుంటున్న ప్రభుత్వాలకు కర్ణాటక ప్రయోగం ఒక నమూనాగా మారే అవకాశముంది.
అయితే బీర్ అమ్మకాలు పెరగడానికి కొత్త పన్నుల విధానమే కారణమని ఇప్పుడున్న గణాంకాల ఆధారంగా నిర్ధారించలేం. అలాగే మొత్తం మద్యం వినియోగం, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది కూడా ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులపై పన్నుల భారాన్ని నియంత్రించడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం.. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడం కర్ణాటక కొత్త మద్యం పన్నుల విధానానికి అసలైన పరీక్షగా మారనుంది.

