సవాళ్ల మధ్య సిద్ధరామయ్య 17వ బడ్జెట్‌కు సన్నాహాలు..
x

సవాళ్ల మధ్య సిద్ధరామయ్య 17వ బడ్జెట్‌కు సన్నాహాలు..

కృష్ణా ప్రాజెక్ట్ వ్యయం, గ్రామీణ ఉపాధి పథకంలో రాష్ట్ర వాటా పెంపు, జీఎస్టీ ఆదాయ లోటు కలిసి ప్రభుత్వంపై దాదాపు రూ.31 వేల కోట్ల అదనపు భారం పడనుంది.


Click the Play button to hear this message in audio format

2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌(Budget)ను మార్చి మొదటి వారంలో సమర్పించేందుకు కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సిద్ధమవుతున్నారు. రికార్డు స్థాయిలో ఆయన 17వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.31 వేల కోట్ల అదనపు ఆర్థిక భారం ఉంది.

గత ఏడాది అమలు చేసిన పథకాల పురోగతిని సమీక్షిస్తూ.. కొత్త ప్రతిపాదనలపై శాఖల వారీగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

ఉత్తర కర్ణాటకకు ముఖ్యమైన కృష్ణా అప్పర్ స్టేజ్–3 ప్రాజెక్ట్ వల్ల ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం పడుతోంది. భూసేకరణ, పునరావాసం కోసం దాదాపు రూ.75–78 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2026–27 బడ్జెట్‌లోనే సుమారు రూ.18 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకునే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.


ఉపాధి పథకంలో రాష్ట్ర వాటా పెంపు..

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి కొత్తగా అమలు చేయడంతో రాష్ట్రాలపై భారం పెరిగింది. గతంలో రాష్ట్రం 10 శాతం మాత్రమే భరించగా, ఇప్పుడు అది 40 శాతానికి పెరగనుంది. దీంతో కర్ణాటకకు ఏటా రూ.3వేల నుంచి రూ.4వేల కోట్ల అదనపు ఖర్చు పడే అవకాశముంది.


తగ్గిన జీఎస్టీ ఆదాయం ..

జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గుతోంది. జీఎస్టీ వృద్ధిరేటు 12 శాతం నుంచి 5 శాతానికి పడిపోవడంతో ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల లోటు ఏర్పడే అవకాశం ఉందని అంచనా. కేంద్ర నిధుల బదిలీల్లో జాప్యం కూడా ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి, గృహ జ్యోతి, అన్న భాగ్య, గృహ లక్ష్మి, యువ నిధి వంటి ఐదు హామీ పథకాలకే ఏటా సుమారు రూ.55 వేల కోట్లు ఖర్చవుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.


కష్టసాధ్యంగా బడ్జెట్ సమతుల్యత..

మొత్తంగా కృష్ణా ప్రాజెక్ట్, గ్రామీణ ఉపాధి పథకం, జీఎస్టీ నష్టాలను కలుపుకుని రాష్ట్రానికి దాదాపు రూ.31 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. ఆర్థిక బాధ్యత చట్టం ప్రకారం ప్రభుత్వం ఎక్కువగా అప్పులు తీసుకోకూడదు. ఖర్చు కూడా నియంత్రణలో ఉండాలి. ఈ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇతర రంగాలకు కేటాయింపులు తగ్గించవచ్చు. మరోవైపు పెట్రోల్, డీజిల్ లేదా మద్యం పన్నులు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్య సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు ఖర్చులను నియంత్రిస్తూ ఆర్థిక నియమాలను ఎలా పాటిస్తారన్నది వేచిచూడాలి.

Read More
Next Story