
బాస్మతీ బియ్యం ఎగుమతులకు భారీ దెబ్బ..
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్యాకేజి రంగంపై కూడా..
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. ఆ ప్రభావం బాస్మతి బియ్యం ఎగుమతులపై కూడా పడింది. సుమారు 4 లక్షల టన్నుల బియ్యం నిలిచిపోయిందని సమాచారం. ఇందులో సుమారు 2 లక్షల టన్నులు భారత పోర్టుల్లో ఉన్నాయి. మరో 2 లక్షల టన్నులు సముద్రం లేదా విదేశీ పోర్టుల్లో నిలిచిపోయాయి.
భారత బాస్మతి బియ్యానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షిప్పింగ్ కంపెనీలు ప్రతి కంటైనర్‌పై సుమారు 2000 డాలర్ల వరకు అదనపు “వార్ సర్‌చార్జ్” వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఒక కంటైనర్‌లో 24–25 టన్నుల బియ్యం ఉంటాయి. ఈ అదనపు ఖర్చు చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులకు భారంగా మారింది. ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న ఈ రంగానికి ఇది భారీ దెబ్బ అని ఎగుమతిదారులంటున్నారు. యుద్ధ కారణంగా సముద్ర మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జల సంధి కూడా మూసివేయడంతో ఈ మార్గం ద్వారా ఇరాక్, కువైట్, ఇరాన్ వంటి దేశాలకు సరుకులు, బాస్మతి బియ్యం రవాణా నిలిచిపోయింది.
ప్యాకేజి రంగంపై కూడా..
యుద్ధం ప్రభావం ప్యాకేజింగ్ రంగంపైన కూడా పడింది. బియ్యం ప్యాకింగ్‌కు ఉపయోగించే పాలిప్రొపిలీన్, గ్రాన్యూల్స్ ధర కిలోకు సుమారు రూ.50 పెరగడంతో ప్యాకేజింగ్ ఖర్చు టన్నుకు రూ.500–750 వరకు పెరిగింది. యుద్ధ పరిస్థితుల కారణంగా
మిసైల్ దాడుల భయంతో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నౌకలకు బీమా ఇవ్వడంలో వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో ఎగుమతిదారులు కొత్త ఆర్డర్లు స్వీకరించకుండా “వెయిట్ అండ్ వాచ్” విధానాన్ని అనుసరిస్తున్నారు. యుద్ధం త్వరగా ముగిస్తే నష్టాలను కొంతవరకు అధిగమించవచ్చని వ్యాపార వర్గాలు అంగీకరిస్తున్నాయి. బాస్మతి బియ్యం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత భూ భాగంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది.

