నాటి విమర్శే నేటి విధానం... రంగంలోకి ఇన్‌ఫ్లుయెన్సర్లు
x

నాటి విమర్శే నేటి విధానం... రంగంలోకి ఇన్‌ఫ్లుయెన్సర్లు

మంచి పాలనకు సాక్షులు కావాలి… కొనుగోలు వక్తలు కాదు


సెప్టెంబర్ 23న రాష్ట్ర కేబినెట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల విధానానికి ఆమోదం తెలిపింది. కనీసం పది వేల మంది అనుచరులు ఉన్న క్రియేటర్లను ఎంప్యానెల్ చేసి, పథకాలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలను డిజిటల్ వేదికలపై చేరవేయడం లక్ష్యం. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా స్లాబ్‌లు. కొన్ని నివేదికల ప్రకారం ఒక్కో కంటెంట్‌కు రూ.2,500 నుంచి రూ.15,000 వరకు. మరికొన్ని నివేదికల్లో నెలకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు చెల్లింపు ప్రస్తావన కూడా ఉంది. అధికారికంగా కంటెంట్ ప్రభుత్వ ఆమోదం తర్వాతే పోస్ట్ చేయాలని చెబుతున్నారు.

ఇది ‘ప్రజలకు సమాచారం చేరాలి’ అనే వాదనతో మొదలవుతుంది. వాదన పూర్తిగా తప్పు కాదు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రచార వేదిక. కానీ ప్రశ్న అక్కడ మొదలవుతుంది. సమాచారం చెప్పడమా, అభిప్రాయం కొనడమా?

గత ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ ప్రచారాన్ని చేసినప్పుడు టీడీపీ మాట మరచిపోలేదు. అప్పుడు అది ‘ప్రజాధనంతో ప్రచారం’, ‘నకిలీ మద్దతు’, ‘పాలన విఫలమైతే మాటలు కొనుగోలు’ అనేది. ఇప్పుడు అదే తీరు వేరే పేరుతో వస్తే, పాత విమర్శ ఏమైంది? పాలన మారిందా, పదజాలం మాత్రమే మారిందా?

పార్టీకి కేడర్ ఉందంటే ఆ కేడర్ స్వచ్ఛందంగా పథకాలను చెబుతుంది. గ్రామంలో పని జరిగితే ఆ గ్రామం మాట్లాడుతుంది. పాఠశాల పనిచేస్తే తల్లిదండ్రులు చెబుతారు. ఆసుపత్రిలో మందు దొరికితే రోగి చెబుతాడు. అది ప్రచారం కాదు. సాక్ష్యం. సాక్ష్యం బలంగా ఉంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అవసరం తగ్గుతుంది. సాక్ష్యం బలహీనంగా ఉంటేనే మాటకు ధర పెడతారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇప్పటికే సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉంది. ముద్రణ, టీవీ, అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకా బయటి క్రియేటర్లకు ప్రజాధనం ఎందుకు? ఒకవైపు నిరుద్యోగ భత్యం, ఉద్యోగుల బకాయిలు, రైతు ఇబ్బందులు చర్చలో ఉంటే, మరోవైపు ప్రచారానికి కొత్త ఖర్చు పెట్టడం ప్రజలకు సహజంగానే అనుమానం కలిగిస్తుంది. వైఎస్సార్‌సీపీ ఇప్పుడు అదే ప్రశ్న వేస్తోంది. గతంలో టీడీపీ వేసిన ప్రశ్నే.

ఇన్‌ఫ్లుయెన్సర్ విధానం యువతకు ఆదాయం అని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వ ప్రచారం ‘ఉద్యోగం’ అయిపోతే, విమర్శ ‘నేరం’లా కనిపించే ప్రమాదం ఉంది. ఫాలోవర్ల సంఖ్య నిజమా, కొనుగోలు చేసినదా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతుంది. ప్రభుత్వ ఆమోదం లేకుండా పోస్ట్ ఉండకూడదన్న నిబంధన ఉంటే, అది సమాచారమా లేక నియంత్రిత కథనమా అనే ప్రశ్న కూడా వస్తుంది.

మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి ఒక ప్రశ్న వేశారు. అది రాజకీయ నినాదం కాదు. సాధారణ తర్కం. టీడీపీ ఒకప్పుడు వైఎస్సార్‌సీపీని ఏమని విమర్శించిందో, ఇప్పుడు అదే పని చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బు చెల్లించడం. బలమైన కేడర్ ఉందంటే చెల్లింపు మాటలు ఎందుకు? పథకాలు నిజంగా ప్రజలకు మేలు చేస్తుంటే, వారి అనుభవమే చెప్పాలి కదా? మంచి పాలన తన స్వంత మద్దతుదారులను సృష్టించాలి. కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకూడదు.

ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బు చెల్లించడం ఎంతవరకు మంచిది అనేది సాంకేతిక ప్రశ్న కాదు. నైతిక ప్రశ్న. పథకం పనిచేస్తే హ్యాష్‌ట్యాగ్ అవసరం లేదు. పథకం పనిచేయకపోతే హ్యాష్‌ట్యాగ్‌కు ధర పెట్టినా నమ్మకం రాదు.

మంచి పాలనకు వక్తలు కావాలి కాదు. సాక్షులు కావాలి. సాక్షులు లేనప్పుడే స్టూడియోలు నిండుతాయి.

Read More
Next Story