
నిరుద్యోగ యువత ఆశలపై కత్తెర!
కారుణ్య నియామకాలు నిరుద్యోగులను కుంగదీస్తున్నాయి. హైకోర్టు స్పష్టమైన హెచ్చరిక
రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 20,801 కారుణ్య నియామకాలు జరిగాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఏటా సగటున దాదాపు 2,000 నియామకాలు, ఇది సాధారణ రిక్రూట్‌మెంట్‌ను మించిపోతోందని, కారుణ్యం పేరుతో ‘మినహాయింపు’ సర్వసాధారణమైపోయిందని జస్టిస్ న్యాపతి విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8న ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఒక పిటిషన్‌కు మాత్రమే కాదు, లక్షలాది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ క్షామం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూటిగా ఎత్తి చూపుతోంది.
కారుణ్యం ‘అరుదైన మినహాయింపు’ మాత్రమే
జస్టిస్ విజయ్ తీర్పు అత్యంత స్పష్టంగా, సమగ్రంగా ఉంది. “కారుణ్య నియామకాలు సమాన అవకాశాల సూత్రం (ఆర్టికల్ 16)కు మినహాయింపు మాత్రమే. ఇవి కేవలం ‘హ్యాండ్-టు-మౌత్’ (హామ్‌టు మౌత్) స్థితిలో ఉన్న, అత్యంత దారిద్ర్య కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి” అని సుప్రీం కోర్టు తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ఒకే కుటుంబం నుంచి మూడో తరం వరకు నియామకాలు జరగడం, మెరిట్ లేదా పనితీరు చూడకుండా కేవలం ‘అర్హత’ మాత్రమే పరిగణించడం, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు.
కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం
ఉద్యోగిపై ఆధారపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే (సోదరులు, అక్కచెల్లెళ్లు, మేనల్లుళ్లు విస్తరణ అనవసరం).
BPL కంటే కింది, హ్యాండ్-టు-మౌత్ స్థితి ఉంటేనే ఉద్యోగం. లేకపోతే ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుంది.
2017 జీవో 114లోని ఎక్స్‌గ్రేషియా మొత్తాలు సరిపోవు. చనిపోయిన ఉద్యోగి చివరి జీతం + మిగిలిన సర్వీసు కాలం ఆధారంగా కొత్త ఫార్ములా ఉండాలి.
ఉద్యోగం తప్పనిసరి అయితే శాశ్వతం కాదు. పొరుగు సేవలు / తాత్కాలిక / ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఇవ్వాలి. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే శాశ్వతం ఇవ్వాలి.
“విచక్షణాధికారం ప్రభుత్వానికే” అని చెప్పినా, దానిని దుర్వినియోగం చేయకుండా సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వ నిర్ణయాలు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌కు ప్రాధాన్యం
గత ఏడేళ్లలో గ్రూప్-1, 2, 3, 4 తప్ప ఇతర స్థాయి శాశ్వత నియామకాలు దాదాపు జరగలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. 2026 యువగళం జాబ్ క్యాలెండర్‌లో 10,060 పోస్టులు ప్రకటించినా, ఇప్పటికే లక్షలాది యువత ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిని ప్రోత్సహించడం వెనుక ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యం. శాశ్వత ఉద్యోగాల్లో పెన్షన్, డీఏ, సౌకర్యాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం గడుపుతోంది. కానీ ఇది కార్మిక దోపిడీకి దారితీస్తోందని గత తీర్పుల్లోనూ కోర్టు సూచించింది. కారుణ్య నియామకాలను కూడా ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌లోకి మార్చాలని హైకోర్టు సూచన ప్రభుత్వ విధానాలకు సరిపోయేలా ఉంది.
నిరుద్యోగుల బాధ
“ఎందరో విద్యావంతులైన యువత ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే... కారుణ్య నియామకాలతో వారి ఆశలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబం పట్ల అతికారుణ్యం చూపుతూ నిరుద్యోగ యువతిపై దయ చూపడం లేదు” అని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు. లక్షలాది కుటుంబాలు మరింత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వారికి ‘వేదిక లేదు’. కారుణ్యం కోరేవారికి సానుభూతి ఉంటే, నిరుద్యోగుల కష్టాలను చెప్పుకోవడానికి ఎవరూ లేరు.
ప్రభుత్వ కార్యాలయాల్లో వాచ్‌మెన్, డ్రైవర్లు కూడా ఔట్‌సోర్సింగ్‌కు మారడంతో శాశ్వత ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. అధికారులు కార్లు అద్దెకు తీసుకుని ట్రావెల్స్‌కు లక్షలు చెల్లించడానికి చూపుతున్న ఆసక్తి, ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వడంలో కనిపించడం లేదు. ఇది నిరుద్యోగ సమస్యను రాజకీయాలకు అతీతంగా చూపిస్తోంది.
ప్రభుత్వం ఏం చేయాలి?
హైకోర్టు తీర్పు ‘గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నంబర్’ సూత్రాన్ని గుర్తు చేస్తోంది. మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలు రూపొందించి, శాశ్వత నియామకాలను మెరిట్ ఆధారంగా పెంచాలి. ఔట్‌సోర్సింగ్ దోపిడీని అరికట్టాలి. లేకపోతే కోర్టు తీర్పులు మాత్రమే కాక, యువత ఆందోళనలు తప్పవు.
ఈ తీర్పు నిరుద్యోగ యువతకు కొంత ఆశ కలిగించింది. కానీ ప్రభుత్వం దీనిని అమలు చేసి, నిజమైన ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదే నిజమైన కారుణ్యం!
ఖాళీగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీలో లక్ష ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉన్నా భర్తీ చేయడం లేదు. 3లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని భావించడం లేదు అని ఎస్ఎఫ్ఐ ఏపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నూర్ మహమ్మద్ పేర్కొన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కింద తీసుకునే విధానాన్ని రద్దు చేయాలి. అర్హులైన నిరుద్యోగ యువతను తీసుకుని వారి ద్వారా పనులు చేయిస్తే క్వాలిటీ ఉంటుంది. ప్రస్తుతం 62 సంవత్సరాలకు ఉద్యోగులు రిటైర్డ్ అవుతుంటే మరో రెండేళ్లు అంటే 64 సంవత్సరాలకు రిటైర్డ్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులు కారుణ్య నియామకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కారుణ్య నియామకం అనేది కుటుంబంలో ఉన్న వ్యక్తి విధుల్లో ఉంటూ చనిపోతే ఇవ్వాలి. అలా కాకుండా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ల పిల్లలకు ఇస్తున్నారు, ఇది సరైంది కాదు. పైగా కుటుంబలోని ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబంలోని కొడుకు, కుమార్తెలకు కాకుండా వారి పిల్లలకు కూడా కారుణ్య నియామకాలు అనేది మంచిది కాదు. జగన్ హయాంలో ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా లక్ష ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం భర్తీ చేయకపోవడం నిరుద్యోగుల కుటుంబాలను బాధించడమేనన్నారు. ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించే పద్ధతి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారికి ఉంది. ఈ పద్ధతిని తీసి వేసి మళ్లీ ఏజెన్సీలకే ఆ భాధత్యలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది కూడా మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

