సీట్ల కోసం ‘ప్రత్యేక కమిటీ’… అనుమతి మీదే గెలుపు!
x

సీట్ల కోసం ‘ప్రత్యేక కమిటీ’… అనుమతి మీదే గెలుపు!

బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు ప్రత్యేక కమిటీ.


రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను “అత్యంత ప్రతిష్ఠాత్మకంగా” తీసుకుందట. ప్రతిష్ఠాత్మకం అంటే… స్వయంగా గెలవడం కాదు. కూటమి భాగస్వాములు ఇచ్చే సీట్లను ఎంత గౌరవంగా, ఎంత వినయంగా అందుకోవాలో అని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పది మంది సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి… వీరిలో ఉన్నారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా, రాయలసీమ. ప్రతి జోన్‌కు అనుభవజ్ఞులు. ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక… ఇలా ఎన్నో బాధ్యతలు.

ఈ కమిటీ నిజంగా ఏం చేయబోతోంది?

జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు… ఇవన్నీ బీజేపీ సొంత శక్తితో గెలుచుకునే స్థాయిలో ఉన్నాయా? లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే స్పష్టమైంది. స్వతహాగా గెలిచే సత్తా లేని పార్టీ. తెలుగుదేశం, జనసేన సమ్మతి ఉంటేనే సీట్లు. లేకపోతే… కమిటీ ఉన్నా, జోన్లు ఉన్నా, సీనియర్ నాయకులు ఉన్నా… ఫలితం జీరో.

ఈ ప్రత్యేక కమిటీ అసలు పని ఏమిటి?

పార్టీ శ్రేణులను బలోపేతం చేయడమా?

లేక తెలుగుదేశం, జనసేన వద్దకు వెళ్లి “మాకు ఎన్ని సీట్లు ఇస్తారు?” అని అడగడమా?

అభ్యర్థుల ఎంపికా? లేక “ఇచ్చిన సీట్లలో ఎవరిని పోటీకి దింపాలి?” అని నిర్ణయించడమా?

పది మంది సీనియర్ నాయకులు ఒకచోట కూర్చుని… “మనకు ఎన్ని జడ్పీలు వస్తాయి? ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి?” అని లెక్కలు వేస్తున్న దృశ్యం ఊహించుకోవచ్చు. ఒకరు “రాయలసీమలో మనకు బలం ఉంది” అంటే, మరొకరు “బలం ఉన్నా సీటు ఇవ్వాలంటే నాయుడు గారి అనుమతి కావాలి” అని గుర్తు చేస్తారు. మరొకరు “జనసేన కూడా ఉంది కదా… వాళ్లతోనూ మాట్లాడాలి” అంటారు.

ఇది ఎన్నికల సన్నాహమా? లేక సీట్ల కోసం దరఖాస్తు కమిటీనా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు కమిటీ “పార్టీని విజయతీరాలకు చేర్చే లక్ష్యంతో” పని చేస్తుందట. విజయతీరాలు అంటే… తెలుగుదేశం, జనసేన ఇచ్చిన సీట్లలో గెలవడం. అదే గొప్ప విజయం.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రయత్నాలు చూస్తే ఒక విషయం స్పష్టం. పార్టీకి స్వంత ఓటు బ్యాంకు ఉందని చెప్పుకోవడం ఒకటి. ఆ ఓటు బ్యాంకును సీటుగా మార్చుకోవడానికి కూటమి అనుమతి అవసరమని అర్థం చేసుకోవడం మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని దాచేందుకే ఈ ప్రత్యేక కమిటీ, జోన్లు, సీనియర్ నాయకుల జాబితా.

చివరగా ఒక ప్రశ్న. ఈ కమిటీ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తారా? లేక… “మాకు ఇచ్చిన సీట్లలో ఎవరు పోటీ చేయాలి” అని కూటమి నాయకులకు లిస్టు సమర్పిస్తారా? సమాధానం త్వరలోనే తెలుస్తుంది. అప్పటివరకు… ప్రతిష్ఠాత్మక సన్నాహాలు కొనసాగుతాయి.

Read More
Next Story