తల్లిదండ్రుల సహకారంతోనే ఉపాధ్యాయుడు విద్యా శిల్పి అవుతాడు!
x

తల్లిదండ్రుల సహకారంతోనే ఉపాధ్యాయుడు విద్యా శిల్పి అవుతాడు!

విద్యార్థి వికసించాలంటే అందరి సహకారం కావాలి. ఉపాధ్యాయుడు మాత్రమే సరిపోడు.


విద్యార్థి చదువులో వెనుకబడినా, ఫలితాలు తక్కువ వచ్చినా, ఉపాధ్యాయులను మాత్రమే తప్పుపట్టడం నేటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. “గురువు సరిగా బోధించలేదు”, “ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు” అని అధికారులు, తల్లిదండ్రులు, సమాజం చేతులు దులుపుకుంటున్నారు. కానీ విద్య అనేది ఏకపక్షం కాదు. అది ‘త్రిముఖ వ్యూహం’! ఉపాధ్యాయుడు (34 శాతం), విద్యార్థి (33శాతం), తల్లిదండ్రులు/సమాజం (33 శాతం) ఈ మూడు స్తంభాలు బలంగా ఉంటేనే విద్యా గోపురం నిలుస్తుంది. ఒక్కటి కూలితే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది.


స్కూలులో గురువు...

మహా భారత సారాంశం ఎంత మందికి తెలుసు...?

మహాభారతం ఇందుకు సాక్ష్యం. ఒకే గురువు ద్రోణాచార్యుడు, ఒకే సిలబస్ అస్త్రవిద్య, 105 మంది విద్యార్థులు (100 కౌరవులు + 5 పాండవులు). ఫలితం? కేవలం అర్జునుడు మాత్రమే మహా యోధుడయ్యాడు. మిగిలిన 104 మంది ఎందుకు వెనుకబడ్డారు? గురువులో లోపమా? సిలబస్‌లో లోపమా? కాదు... లోపం విద్యార్థి ‘గ్రహణశక్తి’, ‘శ్రద్ధ’లో ఉంది. ప్రపంచంలో ఏ గురువూ అందరినీ ఫస్ట్ ర్యాంకర్లుగా మార్చలేడు. ఇది ప్రకృతి ధర్మం.

బంగారు ఆభరణం...

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కంసాలి సిద్ధాంతం చూడండి. స్వచ్ఛమైన బంగారం ఇస్తే కంసాలి అద్భుత ఆభరణం తయారు చేస్తాడు. కానీ మట్టిని చేతిలో పెట్టి “దీన్ని బంగారు హారంగా మార్చు” అంటే? అది అసాధ్యం. నేటి తరగతి గదుల్లో ఇదే జరుగుతోంది. ఇంట్లో క్రమశిక్షణ లేని పిల్లలు, మొబైల్‌కు బానిసలైన పిల్లలు, చదువుపై ఆసక్తి లేని పిల్లలు. వీరందరినీ ఉపాధ్యాయుడి ముందు నిలబెట్టి “అద్భుతాలు చేయి” అనడం అన్యాయం.

ఉపాధ్యాయుడు మార్గ దర్శకుడు...

ఒక రోజులో విద్యార్థి 6 గంటలు బడిలో (ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో) ఉంటాడు. 18 గంటలు ఇంట్లో/సమాజంలో (తల్లిదండ్రుల పర్యవేక్షణలో) గడుపుతాడు. ఆ 18 గంటల్లో ఇంటి గొడవలు, సోషల్ మీడియా, నిర్లక్ష్యం, ఇవన్నీ చేసిన నష్టాన్ని 6 గంటల్లో ఉపాధ్యాయుడు ఎలా సరిచేయగలడు? అయినా నిజమైన ఉపాధ్యాయుడు “మాంత్రికుడు” కాదు. కానీ ‘మార్గదర్శకుడు’ అనుకుందామా? కాదు, అతడు ‘విద్యా శిల్పి’.


ఇంట్లో గురువు అమ్మ...

త్రిశూలం సినిమా గుర్తుందా?

ఇక్కడే త్రిశూలం సినిమా గుర్తుకు వస్తుంది. హీరో తన ప్రేయసిని రాయి లాంటి కఠినమైన, ముతకైనప్పటికీ ఎంతో ప్రేమ, సహనం, మార్గదర్శకత్వంతో మనిషిగా తీర్చిదిద్దాడు. ఆ పాటలో “రాయిని ఆడది చేసిన రాముడివా... గంగను తలపై మోసే శివుడివా’’ ఏమనుకోనూ... నిన్నేమనుకోనూ... అని అడిగినప్పుడు ‘తోడనుకో... నీవాడనుకో’ అంటూ మాటిస్తాడు హీరో. ఒక నిజమైన ఉపాధ్యాయుడు కూడా అలాంటి దేవుడే. ఇంట్లో నుంచి “మట్టి” లాంటి విద్యార్థి వచ్చినా, అతడి హృదయాన్ని తాకి, మనసును మెత్తగా చేసి, జ్ఞానంతో ఆకర్షించి, ఒక గొప్ప మానవునిగా తీర్చిదిద్దగలడు.

పూర్వపు గురువులు కాదు...

పూర్వం ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి పిల్లలను బడికి తీసుకెళ్లేవాడు. అప్పట్లో వారు కేవలం గురువు కాదు. తల్లి, తండ్రి, స్నేహితుడు, మార్గదర్శకుడు అన్నీ అయ్యేవారు. నేడు తల్లిదండ్రులు చదువు గురించి అవగాహన పెంచుకున్నారు, పిల్లలను బాగా చదివించాలని కోరుకుంటున్నారు. కానీ ఇంకా కొంతమంది “హోం వర్క్ చేశావా?” అని అడగడం కూడా మానేశారు. బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయుడి నెత్తిన పెట్టేస్తున్నారు.


టెక్నాలజీ పేరుతో విద్యార్థి స్థితి

ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం మానేద్దాం...

ఇకనైనా ఈ అశాస్త్రీయ నిందలు ఆపాలి. ఉపాధ్యాయులను మాత్రమే టార్గెట్ చేయడం మానాలి. తల్లిదండ్రులను బాధ్యుల్ని చేయండి. విద్యార్థుల్లో జిజ్ఞాస, శ్రద్ధ, క్రమశిక్షణ పెంపొందించండి. ఉపాధ్యాయుడు కత్తికి పదును పెట్టేవాడు. కానీ కత్తి పదును విద్యార్థి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది.

నిజమైన ఉపాధ్యాయుడు దేవుడు...

నిజమైన ఉపాధ్యాయుడు రాయిని మనిషిగా చేసే దేవుడు. అతనికి మనం గౌరవం ఇవ్వాలి, సహకరించాలి, ఆదరించాలి. తల్లిదండ్రులు, సమాజం, విద్యార్థులు, మనమంతా కలిసి ఆయన చేతుల్లో బంగారాన్ని అందించాలి. అప్పుడు అతడు అద్భుతాలు చేస్తాడు.

ఉపాధ్యాయుడు మాంత్రికుడు కాదు... కానీ అతడు దేవుడు కావడానికి మనమంతా సహకరించాలి! ఇది కేవలం ఒక ఆర్టికల్ కాదు. ఇది మన విద్యా వ్యవస్థకు, మన పిల్లల భవిష్యత్తుకు ఒక చిన్న వేదిక. చదువుకునే ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, దండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే... విద్యార్థి రాయి కాదు, అతడు భవిష్యత్ భారతం!
సెలవుల తరువాత నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అప్పటికి మట్టిలాంటి పిల్లల్ని మనుషులుగా మర్చి స్కూళ్లకు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది.

Read More
Next Story