
నిజ్జర్, ఖలీస్తాన్ ను కెనడా- భారత్ పక్కన పెట్టాయా?
రెండు దేశాల మధ్య ముమ్మరంగా సాగుతున్న ద్వైపాక్షిక చర్చలు
పరుల్ చంద్ర
“మనకు శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు. శాశ్వతంగా ఉండేవి మన ప్రయోజనాలు మాత్రమే. వాటిని సాధించుకోవడమే మన కర్తవ్యం.” 1848లో బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు లార్డ్ పామర్స్టన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో చెప్పిన ఈ మాటలు అంతర్జాతీయ దౌత్యానికి ఇప్పటికీ వర్తిస్తాయి. భారత్, కెనడా మధ్య తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న దౌత్యపరమైన విభేదాలను పక్కనపెట్టి, రెండు దేశాలు తమ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన న్యూఢిల్లీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు కార్నీని ముఖ్య అతిథిగా ఆహ్వానించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రెండు దేశాలు సంబంధాలను కొత్త దిశలో తీసుకెళ్లాలని భావిస్తున్నాయనే సంకేతాలిస్తున్నాయి.
ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిద్దూ భారత్‌లో పర్యటించారు. వీరి పర్యటనలు దౌత్యపరమైన సంబంధాలతో పాటు ఆర్థిక సహకారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉమ్మడి ప్రయత్నాలను ప్రతిబింబించాయి.
సిద్దూ పర్యటన సమయంలో ప్రధాని మోదీ, కార్నీ ఫోన్లో మాట్లాడుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత విస్తరించేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చర్చలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు.
భద్రతా ఆందోళనల నుంచి సంబంధాల పునరుద్ధరణ వరకు
జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2018 నుంచే కెనడాలో ఖలిస్తాన్ అనుకూల శక్తుల పట్ల ట్రూడో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. కెనడియన్ సిక్కులు ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఉండటం కూడా ఈ పరిణామాల్లో ప్రస్తావనకు వచ్చింది.
2023లో కెనడాలో ఖలిస్తాన్ అనుకూల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని ఒట్టావా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ఆరోపణలను కేంద్రంగా చేసుకుని దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.
అయితే, మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారత్ భద్రతాపరమైన సున్నితత్వాలను, ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలపై న్యూఢిల్లీ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను చర్చించేందుకు ఒట్టావా మరింత సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరిగాయి. వీటిలో చివరి సమావేశం అక్టోబర్ ప్రారంభంలో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇరు దేశాల మధ్య మొత్తం సంబంధాలను దెబ్బతీయకుండా, పరస్పర భద్రతా ఆందోళనలను చర్చించేందుకు ఈ సమావేశాలు వేదికగా నిలిచాయి.
మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అయితే, కెనడా గడ్డపై నుంచి ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న భారత్ ఆందోళనలను ఒట్టావా ఎంతవరకు పరిష్కరిస్తుందనే అంశం ఈ సంబంధాల భవిష్యత్తులో కీలకంగా మారనుంది.
అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు కెనడా చూపు
అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా భారత్, కెనడా మధ్య సంబంధాల పునరుద్ధరణకు కారణమవుతున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించుకోవడం ద్వారా మధ్యేవాద శక్తులతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కార్నీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భారత్‌కు కీలక స్థానం ఉంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కెనడాకు సవాళ్లు విసురుతున్నాయి. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా అభివర్ణిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో అమెరికాపై వాణిజ్యపరమైన ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కెనడాకు ఏర్పడింది. యూరప్ సహా ఇతర ప్రాంతాలతో ఆర్థిక భాగస్వామ్యాలను విస్తరించుకోవడంపై ఆ దేశం దృష్టి పెట్టింది.
ప్రస్తుతం మెక్సికో తర్వాత అమెరికాకు కెనడా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తున్న కెనడాకు భారత్ కీలక అవకాశాలను అందిస్తోంది. భారత మార్కెట్లో విస్తృతమైన ఎగుమతి అవకాశాలతో పాటు పెట్టుబడులకు కూడా కెనడా ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ లక్ష్యంతో కెనడా వాణిజ్య మంత్రి మణిందర్ సిద్దూ నేతృత్వంలో సుమారు 300 మంది సభ్యులతో కూడిన వాణిజ్య ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించింది. గత మూడు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద కెనడియన్ వాణిజ్య మిషన్‌గా నిలిచింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను విస్తరించాలనే ఆసక్తికి ఈ పర్యటన అద్దం పడుతోంది.
ఆర్థిక ఒప్పందంలో దేశీయ పరిశ్రమల ప్రయోజనాలే కీలకం
భారత్, కెనడా మధ్య దీర్ఘకాలిక సంబంధాలు బలోపేతం కావాలంటే వాణిజ్యం, పెట్టుబడుల్లో సహకారం పెరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి చర్చలు ముమ్మరం కావడంతో డిసెంబర్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందంపై చర్చలు దశాబ్దానికి పైగా కొనసాగుతున్నాయి.
అయితే, ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలపై నెలకొన్న వివాదం ఈ చర్చలకు గతంలో తీవ్ర ఆటంకం కలిగించింది. ట్రూడో ప్రభుత్వం ఈ కార్యకలాపాలను పట్టించుకోవడం లేదని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా చేసిన ఆరోపణలతో పరిస్థితి మరింత దిగజారింది.
ఇప్పుడు చర్చలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో భారత్‌కు ఒకవైపు కెనడాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా పోటీని తట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే రంగాలపై ఒప్పందం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దేశీయ పరిశ్రమలకు నష్టం కలగకుండా సమతుల్యత సాధించడం భారత్‌కు కీలకం కానుంది.
యురేనియం నుంచి చమురు వరకు.. ఇంధన సహకారం
భారత్ తన ఇంధన వనరులను విస్తరించుకోవడంలో కూడా కెనడా కీలక భాగస్వామిగా మారే అవకాశముంది. పశ్చిమాసియాలోని పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన దిగుమతుల్లో వైవిధ్యం పెంచుకోవడం భారత్‌కు ముఖ్యంగా మారింది.
ఈ నేపథ్యంలో సంప్రదాయ ఇంధనం, పౌర అణుశక్తి, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా భారత అణు విద్యుత్ అవసరాలకు యురేనియం సరఫరా విషయంలో కెనడా ప్రాధాన్యం సంతరించుకుంది.
కార్నీ మార్చిలో భారత్‌ను సందర్శించిన సమయంలో ఇరు దేశాలు దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకాలు చేశాయి. సుమారు 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం పదేళ్ల పాటు భారత అణు రియాక్టర్లకు కెనడా యురేనియం సరఫరా చేయనుంది. దీంతో పాటు కెనడా నుంచి ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ), ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్పీజీ), ముడి చమురు దిగుమతులను కూడా పెంచుకోవాలని భారత్ భావిస్తోంది.
మొత్తంగా చూస్తే, భారత్, కెనడా మధ్య సంబంధాల పునరుద్ధరణ వెనుక దౌత్యపరమైన అవసరాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత వంటి కీలక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, భద్రతాపరమైన విభేదాలను పరిష్కరించుకుంటూ, దేశీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగడం రెండు దేశాలకూ సవాలే. ఈ అంశాల్లో సమతుల్యత సాధించగలిగితేనే ప్రస్తుత చొరవను దీర్ఘకాలిక, స్థిరమైన భాగస్వామ్యంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

