తొంబై శాతం రిజర్వ్ అడవిలో గూగుల్-అదానీ డేటా సెంటర్‌
x
రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ

తొంబై శాతం రిజర్వ్ అడవిలో గూగుల్-అదానీ డేటా సెంటర్‌

పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన.. పూర్వ కేంద్ర కార్యదర్శి ఇ.ఏ.ఎస్. శర్మ తీవ్ర ఆరోపణలు


విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ (రైడెన్ ద్వారా) అదానీ సంయుక్తంగా నిర్మిస్తున్న డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ పరిశీలన అధికార సంస్థ (APSEIAA) జారీ చేసిన పర్యావరణ అనుమతిని పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఇఏఎస్ శర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర పర్యావరణ, అడవులు & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MEFCC) కార్యదర్శి తన్మయ్ కుమార్‌కు ఆయన రాసిన లేఖలో “ప్రభుత్వ ఒత్తిడికి లోనై APSEIAA అనుచితంగా అనుమతి ఇచ్చింది” అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు భూమిలో 90 శాతం ‘పెద్ద చుక్క కొండ’ రిజర్వ్ అడవి పరిధిలో ఉన్నప్పటికీ, కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యానికి కేవలం 1.53 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 18, 2026న APSEIAA జారీ చేసిన అనుమతి లేఖ (AP INFRA2 EC VSP 04 2026 2517)ను ప్రస్తావిస్తూ శర్మ “సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్‌లో అడవి చూపించలేదని” చెప్పి నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్‌ను విస్మరించడం అనుచితమని వ్యాఖ్యానించారు. స్థానిక అటవీ అధికారులు కూడా ఒత్తిడికి లొంగి అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

2006 EIA నోటిఫికేషన్ ఉల్లంఘన

MEFCC 2006 EIA నోటిఫికేషన్‌లోని ‘జనరల్ కండిషన్’ ప్రకారం, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటిఫై చేసిన సంరక్షిత ప్రాంతాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాలు (ESZ) 10 కి.మీ. పరిధిలో ఉంటే ఆ ప్రాజెక్టును ‘కేటగిరీ A’గా పరిగణించాలి. కంబాలకొండ అభయారణ్యం చుట్టూ MEFCC సో. 1366(E), ఏప్రిల్ 28, 2017 ద్వారా ESZ నోటిఫై చేసిన విషయం శర్మ లేఖలో గుర్తు చేశారు. అయినప్పటికీ APSEIAA ‘B’ కేటగిరీగా పరిశీలించి అనుమతి ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులను గుర్తు చేశారు

టి.ఎన్. గోదవర్మన్ తిరుమల్‌పాడ్ కేసులో (2024-2025) సుప్రీంకోర్టు అడవి భూములపై ఏ అటవీయేతర కార్యకలాపానికైనా ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసిన విషయాన్ని శర్మ లేఖలో ఉదహరించారు. ప్రస్తుత అనుమతి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అగౌరవపరుస్తోందని వ్యాఖ్యానించారు.

నీటి కొరత, పర్యావరణ ఆందోళనలు

ఒక గిగావాట్ (1000 మెగావాట్) సామర్థ్యం గల డేటా సెంటర్ అత్యధిక నీటిని వినియోగిస్తుందని, నీటి కొరత ఉన్న విశాఖపట్నంలో ఇది మరిన్ని పర్యావరణ సమస్యలను సృష్టిస్తుందని శర్మ హెచ్చరించారు. అందువల్ల ఈ ప్రాజెక్టును తప్పనిసరిగా ‘A’ కేటగిరీగా MEFCC ఎన్విరాన్‌మెంటల్ అసెస్‌మెంట్ కమిటీ (EAC), అటవీ సలహా కమిటీ (FAC)ల ద్వారా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేగం

అనుమతి లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తోందని, ఇది చట్టబద్ధమైన విధానాలను ఉల్లంఘించడమని ఆయన అభిప్రాయపడ్డారు.

శర్మ డిమాండ్లు

APSEIAA ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ‘A’ కేటగిరీ ప్రాజెక్టుగా MEFCCకు సమర్పించమని ఆదేశించాలి.

సక్రమమైన అనుమతులు లభించే వరకు ప్రాజెక్టుపై ఎలాంటి పనులు చేపట్టకూడదు.

ఈ లేఖ నకలును MEFCC డైరెక్టర్ జనరల్ (అటవీ శాఖ), ఏపీ ముఖ్య కార్యదర్శి, APPCBలకు కూడా పంపినట్లు శర్మ తెలిపారు.

పర్యావరణ సమస్యపై పలు ప్రశ్నలు లేవనెత్తిన లేఖ

ఈ లేఖ రాష్ట్ర SEIAAల పర్యావరణ అనుమతుల ప్రక్రియపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధికి కీలకమైనప్పటికీ, అడవులు, వన్యప్రాణి సంరక్షణ, నీటి వనరులు వంటి పర్యావరణ అంశాలను పక్కనబెట్టి అనుమతులు ఇవ్వడం సరైనదా అన్న చర్చను రేపుతోంది. MEFCC ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇకపై ఆసక్తికరం.

Read More
Next Story