చేసింది చెప్పుకునే కళ ఇలాగే ఉంటుందా?
x

చేసింది చెప్పుకునే కళ ఇలాగే ఉంటుందా?

పట్టాభిషేక వేదికపై సీఎం ప్రసంగం..


పేదలకు పట్టా ఇచ్చే వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనంతా చదివేశారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి నిరంతరం జరుగుతోందని, ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధిపై ఖర్చయ్యాయని చెప్పారు. పట్టిసీమ నుంచి 490 టీఎంసీలు, గోదావరిలో 1400 టీఎంసీలు సముద్రంలోకి, రోజుకు 75 టీఎంసీలు, పోలవరం వచ్చే ఏడాది, 36 ప్రాజెక్టులు రూ.35 వేల కోట్లు, 2028 కృష్ణా పుష్కరాలు, పెన్షన్ ఒకటో తేదీనే, స్త్రీశక్తి, అన్నా క్యాంటీన్, పీ4, 5.5 లక్షల ఇళ్లు, మరో 5.5 లక్షలు, ఒక్క ప్రసంగంలో ప్రభుత్వ బడ్జెట్ స్పీచ్, ఎన్నికల మ్యానిఫెస్టో, వ్యతిరేక పార్టీపై దాడి అన్నీ వచ్చేశాయి.

చేసింది చెప్పుకోవడం రాజకీయం. కానీ ఒక పట్టా కార్యక్రమాన్ని రాష్ట్ర అభివృద్ధి సభగా మార్చడం వేరు.

పట్టిసీమను వైఎస్సార్సీపీ రాక్షసుల్లా అడ్డుపడిందని, గొడ్డలి పార్టీ ఇప్పటికీ అడ్డుపడుతోందని సీఎం అన్నారు. పురాణంలో రాజులు యజ్ఞం చేస్తే రాక్షసులు అడ్డుపడేవారని పోలిక తెచ్చారు. అమరావతిని అడ్డుకున్నారని, ప్రపంచ బ్యాంకు లేఖలు, చెరుకు తోటలు తగులబెట్టడం గుర్తు చేశారు. వేదిక పేదల పట్టాలది. ప్రసంగం మాత్రం ప్రతిపక్ష నిర్మూలనది. చేసింది చెప్పుకునే కళకు శత్రువు కావాలి. లేకపోతే కథ నడవదు.


నీటి అంకెలు పెద్దవి. ఎల్‌నినో వల్ల కృష్ణలో నీరు రాలేదని, పట్టిసీమతో డెల్టాకు, విజయవాడకు నీరు ఇచ్చామని చెప్పారు. గోదావరి నీరు సముద్రంలోకి వెళ్తోందని, 100 టీఎంసీలు తెస్తే సస్యశ్యామలమని అన్నారు. పోలవరం వచ్చే ఏడాదికి పూర్తి అని, కృష్ణ-గోదావరి అనుసంధానం, కావేరి వరకు కలుపుతామని చెప్పారు. ఇవి లక్ష్యాలు. లక్ష్యాన్ని సాధనగా చెప్పడమే చెప్పుకునే కళ. పోలవరం ఇంకా పూర్తి కాలేదు. గోదావరి-కావేరి ఇంకా పటం లోనే ఉంది. 2028 పుష్కరాల నాటికి నీళ్లు పుష్కలం అనేది హామీ. ఈరోజు ఇచ్చిన పట్టాకు దీని సంబంధం లేదు.

సంక్షేమం మొదటి ప్రాధాన్యమని, పెన్షన్ ఠంచనుగా ఇస్తున్నామని, విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, గత ప్రభుత్వం రూ.32 వేల కోట్ల భారం వేసిందని అన్నారు. అన్న క్యాంటీన్, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, వడ్డెర్లు, గీత కార్మికులు, పీ4, స్వయం బ్రాండ్ జాబితా పొడవు. కుప్పంలో ఒక మహిళ ఇటుకల బట్టీ పెట్టి 20 మందికి ఉపాధి ఇస్తోందని ఉదాహరణ చెప్పారు. ఒక విజయగాథను రాష్ట్ర విధానంగా చూపడం కూడా అదే కళ.

మహిళా శ్రామిక శక్తిలో విశాఖలో 42 శాతం, విజయవాడలో 37 శాతం, పారిశ్రామిక వేత్తల్లో 30 శాతం మహిళలని కేంద్ర గణాంకాలు చెప్పారు. గణాంకం ఒకటి. దాన్ని ప్రభుత్వ పుణ్యంగా చదవడం మరొకటి. డ్వాక్రా ఉత్పత్తులు స్వయం బ్రాండ్‌తో అమ్ముతున్నామని చెప్పారు. మంచి పని. కానీ పట్టా వేదికపై దాన్ని చదవాల్సిన అవసరం ఏమిటి?


5.5 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మరో 5.5 లక్షలు ఇస్తామని, పేదలందరికీ ఇంటిజాగా, ఇల్లు, కుళాయి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇది భవిష్యత్ హామీ. ఈరోజు విజయవాడలో జరిగింది కొత్త ఇల్లు కాదు. ఉన్న ఇంటికి పట్టా. అయినా ప్రసంగంలో రెండూ ఒక్కటైపోయాయి. చేసింది, చేస్తాం, చేయబోతున్నాం, మూడూ ఒకే వాక్యంలో కలిసిపోతే ప్రజలు వేరు చేయలేరు. అదే కళ.

అభివృద్ధి, సంక్షేమం కూటమికి రెండు కళ్లని అన్నారు. కన్ను రెండు ఉండవచ్చు. వేదిక ఒకటే ఉండాలి. పట్టా ఇచ్చి నీరు, కరెంటు, పెన్షన్, పోలవరం, అమరావతి, గొడ్డలి పార్టీ వరకు వెళ్తే అది పాలనా రిపోర్టు కాదు. ఆత్మకథ.

చేసిన పని ఉంటే చెప్పుకోవచ్చు. పట్టిసీమ నీరు వస్తే చెప్పుకోవచ్చు. పెన్షన్ ఒకటి నాడు జమైతే చెప్పుకోవచ్చు. కానీ ఉన్న ఇంటికి పట్టా ఇచ్చి రూ.లక్షల కోట్ల అభివృద్ధి చేశామని, రాక్షసులను ఓడించామని, యజ్ఞం పూర్తయిందని చెప్పడం అతిశయోక్తే.

Read More
Next Story