x

ప్రధాని మోదీని పొగడడంలో బాబు, పవన్ డీసెన్సీ తప్పారా?

అల్లూరి పేరు వెనక్కి.. మోదీ భజన ముందుకు! ఆంధ్రా రాజకీయంలో కొత్త ట్రెండ్?


Click the Play button to hear this message in audio format

ఉత్తరాంధ్ర గుండె చప్పుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వ్యక్తి ఆరాధనా వేదికగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నాయకులకు తగునా? నాయకులు మారినా, 'భజన రాజకీయం' మాత్రం మారకపోవడం తెలుగు రాజకీయాల దిగజారుడుతనానికి అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సిన ఈ ఈవెంట్, రాజకీయ నాయకుల పొగడ్తలకు, ఆడంబరాల ప్రదర్శనకు వేదికగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

"స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టి, వేదికపై మాత్రం ఆయన త్యాగాన్ని పక్కనబెట్టి ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం ఆ మహానాయకుడిని అవమానించడమే! మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సాధించే అభివృద్ధి ఏపాటిదనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.
"రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండటం వేరు, దైవిక పోలికలతో ముఖస్తుతి చేయడం వేరు. 'హనుమంతుడిలా సేవ చేస్తాం', 'శ్రీరాముడు' అంటూ పౌరాణిక పోలికలతో రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తికే ముప్పు. నాయకులు తమ హోదాను తగ్గించుకోవడం వల్ల అంతిమంగా దెబ్బతినేది తెలుగువారి గౌరవమే!"ఈ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ ఘాటుగా స్పందించారు.
"తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని" రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు.
"సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పోలిస్తే,, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ మాటలే మేలు అనిపించాయి" అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రధానిపై కీర్తనల ఆలాపనలు..

గతంలో వైఎస్ జగన్‌ను కొందరు 'అభినవ అంబేడ్కర్', 'సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి' అని ఆకాశానికెత్తితే... ఇప్పుడు మోదీని 'శ్రీరాముడు' అని అభివర్ణిస్తూ, కీర్తించారు. వ్యక్తులు మారారు కానీ, అధికార పీఠం కోసం పాలకుల దాస్య మనస్తత్వం మారలేదు. అధికారిక వేదికలను రాజకీయ ప్రచారానికి కాక, ప్రజా సంక్షేమానికి వేదికగా మార్చినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం.
పార్టీ ఏదైనా, నాయకులు మారినా ఆంధ్రా రాజకీయంలో అతిశయోక్తులు, వ్యక్తిగత ఆరాధన మాత్రం మారలేదనే చర్చ మొదలైంది. కాదు.. కాదు. బోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రుల నుంచి సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వరకు మోదీని కీర్తించడంలో ఎవరికీ ఎవరూ సాటి లేరు అనే విధంగా పొగడ్తలు ఆకాశం హద్దులు దాటాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు మాత్రం అప్పుడప్పుడూ వినిపించింది.
ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం. ప్రధాని మోదీపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ... మోదీ పాలనను పౌరాణిక కోణంలో వర్ణించారు.
"దేశాన్ని నడిపించడం శ్రీరాముని దైవిక కార్యం లాంటిదని, దానికి మనం 'హనుమంతుడిలా' సేవ చేయాలి' అని వ్యాఖ్యానించారు.
భారత్‌లో మోదీకి మించిన నాయకుడు లేరని, ఆయన కోరుకున్నంత కాలం ప్రధానిగా కొనసాగాలి" అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఇక మేమేమీ తీసిపోమన్నట్లు అంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు వింటున్న వారే అవాక్కయ్యారు. స్థాయిని కూడా మరిచి, ఇంతలా వ్యక్తిని ఆరాధిస్తారా? అనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రధానిని 'ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన నాయకుడు'గా కొనియాడారు. ప్రపంచం ఐటీ నుంచి ఏఐ వైపు వెళ్తోందని, ఇలాంటి సమయంలో మోదీ వంటి నిరూపితమైన నాయకత్వం దేశానికి ఒక వరమని పేర్కొన్నారు.
ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ...
వైసీపీ చీఫ్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ "ఎర్ర బస్సు కూడా రాదన్న చోటికి ఈరోజు ఎయిర్‌బస్ వచ్చింది" అని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు." ప్రభుత్వ నిధులు, ప్రజాధనం ఉపయోగించి 13,000 మందితో ధింసా నృత్యం, భారీ పూల అలంకరణలు ఏర్పాటు చేసినప్పటికీ... విమానాశ్రయానికి పేరు పెట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ప్రాధాన్యత కంటే నాయకుల పొగడ్తలే అక్కడ ఎక్కువగా వినిపించాయనేది విమర్శకుల వాదన.
అధికారుల వేదికలను ఇలా ముఖస్తుతి (Flattery) కోసం ఉపయోగించడం రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని, సమాఖ్య స్ఫూర్తిని తగ్గిస్తుందా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నట్లు సమర్థించుకోవచ్చు. కానీ, ఉన్నత స్థాయిలోని నేతలు ఇలా హద్దులు మీరి పొగడ్తల వర్షం సాగించడం వల్ల వారి వ్యక్తిత్వం కాదు. తెలుగువారి గౌరవం ప్రపంచ వినువీధుల్లో మరింత పలుచనా కాదా? అనే ధర్మ సందేహాలు వ్యక్తం చేస్తున్నా వారు కూడా లేకపోలేదు.
Read More
Next Story