
ఆర్టీసీని బలిపెట్టి ప్రైవేటు బస్ ఆపరేటర్లకు వరాలా?
ఏపీలో ప్రైవేట్ బస్సుల రాయితీలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన ప్రైవేట్ బస్సులకు భారీ పన్ను రాయితి ప్రకటించింది. ఒక్కో సీటుపై త్రైమాసిక పన్నును రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో జరిగిన చర్చా కార్యక్రమం ఇది. ఈ చర్చలో సీపీఎం నాయకుడు ఎంఎ గఫూర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, సీనియర్ జర్నలిస్టు జీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరుగుతుండగా, మరిన్ని రాయితీలు ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం కంటే ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడం, రూట్లను విస్తరించడం, సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి.
ఇటీవల చోటుచేసుకున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను ప్రస్తావించిన వక్తలు, పన్ను రాయితీల కంటే ముందు బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల అర్హతలు, అగ్నిమాపక భద్రత, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు వంటి అంశాలపై కఠిన తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన బస్సులు రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతున్నాయనే అంశంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానంపైనా కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీని వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ క్రమంగా ప్రైవేటీకరణ దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ప్రజలకు సురక్షితమైన, అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకోసం ఏపీఎస్‌ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రజా రవాణా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా, ప్రజాహితాన్ని కాపాడే విధంగా ఉండాలని వారు సూచించారు.
Next Story

