డిజిటల్ టెక్నాలజీపై రైతులకు శిక్షణ ఏదీ?
x

డిజిటల్ టెక్నాలజీపై రైతులకు శిక్షణ ఏదీ?

మొబైల్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో రైతులకు శిక్షణలు ఇస్తే తప్ప లేకుంటే ప్రచారానికే పరిమితం అవుతుంది.


రాబోయే వ్యవసాయ సీజన్‌లో రైతులకు డిజిటల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ శాఖ ఎక్స్‌-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ సూచించినట్లు, ‘ఏపీఏఐఎంఎస్ 2.0’ (APAIMS 2.0) ఫార్మర్ యాప్ ద్వారా మీ పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి. ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల ఆరోగ్యం, రియల్ టైమ్ వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, డ్రోన్లు-యంత్రాల బుకింగ్, ప్రభుత్వ పథకాల స్టేటస్ వంటి అన్ని వివరాలు మీ మొబైల్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం 8.5 లక్షల మందికి పైగా రైతులు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నా, కేవలం 3.7 లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా లాగిన్ అవుతున్నారు. ఇది 30 శాతం కంటే తక్కువ. కాబట్టి రాబోయే సీజన్‌లో ప్రతి రైతు రోజూ యాప్‌ను ఓపెన్ చేసి, సమాచారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే పంట నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

ఎరువుల విషయంలో కూడా ఇక అక్రమాలకు తావు లేదు. జాతీయ స్థాయి ‘ఐఎఫ్ఎంఎస్’ (IFMS) పోర్టల్‌తో అనుసంధానమైన కొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా మీకు కావాల్సిన యూరియా తదితర ఎరువుల కోసం ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఆధార్, భూమి ఖాతా సర్వే నంబరు, పంట వివరాలు ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతాయి. ప్రతి రైతుకు గరిష్టంగా 50 బస్తాలు మాత్రమే కేటాయించేలా సిస్టమ్ పర్యవేక్షిస్తుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక దగ్గరలోని వ్యాలిడ్ లైసెన్స్ ఉన్న డీలర్‌ను ఎంచుకోండి. 48 గంటల వ్యవధిలో పనిచేసే క్యూఆర్ కోడ్ లేదా టోకెన్ మీకు వస్తుంది. డీలర్ వద్ద POS మిషన్ ద్వారా బయోమెట్రిక్ లేదా టోకెన్ ఇచ్చి ఎరువులు తీసుకోండి. అమ్మకం వివరాలు నేరుగా సెంట్రల్ డేటాబేస్‌కు చేరిపోతాయి.

వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు లేని రైతులు, కౌలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కేసులను అధికారులు మాన్యువల్‌గా రివ్యూ చేసి ఎరువులు అందించేలా రాష్ట్ర స్థాయి వర్క్‌ఫ్లో సిద్ధం చేశారు.

RSK కేంద్రాల సహాయకుల కోసం ‘ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్స్ మొబైల్ యాప్’ కూడా అందుబాటులో ఉంది. గత 30 రోజుల్లో విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి తదితర జిల్లాల్లో 96 శాతం సిబ్బంది లాగిన్‌లతో అద్భుతంగా పని చేశారు. రైతులు తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థ ఉంది. ఏ వాతావరణంలో ఏ పంట వేయాలి, తెగుళ్లను ఎలా అరికట్టాలి వంటి వ్యక్తిగత సలహాలు (క్రాప్ అడ్వైజరీ) కూడా యాప్ ద్వారా అందుతాయి. ఐడి, ఉద్యానవన పంటల నమూనాలను అభివృద్ధి చేసుకుని, పీఎండీఎస్ (PMDS) వంటి లాభసాటి సాగు పద్ధతులను అనుసరించండి.

రాష్ట్ర-జిల్లా స్థాయిలో నిరంతర సమీక్షలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి రాబోయే సీజన్‌లో ‘ఫార్మర్ అగ్రి-టెక్’ పది సూత్రాలను ప్రతి రైతు కూడా అనుసరించి, అన్నదాతలు డిజిటల్ విప్లవంలో భాగమవ్వాలి.

రాజశేఖర్ అభిప్రాయం

“డిజిటల్ టెక్నాలజీ ద్వారా రైతులకు సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించాలనేది మా లక్ష్యం. ఫార్మర్ అగ్రి-టెక్ పది సూత్రాలను ప్రతి జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేస్తే మాత్రమే అన్నదాతలకు నిజమైన లాభం చేకూరుతుంది.”

Read More
Next Story