తుంగభద్ర నీటి కోసం కర్నూలు రైతుల పోరుబాట
ఆంక్షలు ఏపీకేనా? కర్ణాటకలో వరి సాగు, సీమలో కరువు కేకలు పట్టవా అంటున్న రైతు సంఘ నేతతో ఇంటర్వ్యూ..
అసలే కరువు ప్రాంతం. సూపర్ ఎల్ నినో పంజా విసిరింది. రుతుపవనాల ఆగమనం మందగించడం వల్ల వర్షాలు ముఖం చాటేశాయి. ఈ పరిస్థితుల్లో రాయలసీమలో తాగు నీటికి ఇబ్బంది ఏర్పడింది. వ్యవసాయం గాడి తప్పింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
రాయలసీమకు వరప్రసాదినిగా ఉన్న కర్నాటక రాష్ట్రం తుంగభద్ర Tungabhadra Low-Level Canal ( LLC ), Tungabhadra High Level Canal (HLC) కాలువలకు సరిపడ నీరు వదలడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని కర్నూలు ప్రాంత రైతాంగం హెచ్చరిస్తోంది.
"తుంగభద్ర లో లెవల్ కెనాల్ కు నీరివ్వకుంటే పంటలు ఎండిపోతాయి. నారు మళ్లు కూడా అలాగే ఉన్నాయి" అని రైతు సంఘం నేత ఆదినారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమబాట పట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. ఎల్ఎల్ సీ పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు పైగానే సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు.
సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రాజెక్టుల్లోని నీటితో చెరువులు నింపే కార్యక్రమానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. తాగు నీటికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వరి పంట సాగు చేయవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రైతులకు సూచన చేశారు.
తుంగభద్ర ప్రాజెక్టు పరిథిలో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు ఎల్ ఎల్సీ, అనంతపురం, కడప- కర్నూలు కాలువ (కేసీ కెనాల్)కు హెచ్ ఎల్సీ నుంచి నీరు రావాలి.
బళ్లారి రైతుల ఆందోళన
ఈ కాలువ పరిధిలో 1,200 క్యూసెక్కుల స్థానంలో 650 క్యూసెక్కులు మాత్రమే విడదల చేయడానికి తుంగభద్ర బోర్డు అథారిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ ఎల్సీకి విడుదల చేసే నీరు ఆంధ్రలోకి రావాలంటే బళ్లారి నుంచి అనంతపురం వరకు 189 కిలోమీటర్లు పారాలి. ఇందులో 105 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలోనే కాలువ పరీవాహక ప్రాంతం ఉంది.
"హెచ్ ఎల్సీలో విడుదల చేస్తున్న 16 టీఎంసీల నీటి వల్ల కాలువలో 3.5 అడుగుల లోతు ఉంది, దీనిని 4.5 అడుగుల లోతు పారే విధంగా నీటి విడుదల పెంచాలి" అని బళ్లారి ప్రాంత రైతులు కూడా ఆందోళనలు సాగిస్తున్నారు.
"పైభాగంలోనే నీరంతా తోడేయడం, వాడేయడం వల్ల దిగువన ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలో ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీనివల్ల రైతులే కాదు. పశుసంపదకు కూడా ప్రమాదం ఏర్పడింది" అని రైతు సంఘ నేత ఆదినారాయణరెడ్డి వివరించారు.
కర్ణాటకలో యథేచ్ఛగా వరి సాగు...
తుంగభద్ర ప్రాజెక్టు అనేది కర్ణాటక, ఆంధ్ర, ఆ తరువాత తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
"ఈ నేపథ్యంలో ఏపీలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడం వరకు బాగానే ఉంది. తుంగభద్ర నీటితో కర్ణాటక ప్రాంత రైతులు ఏమాత్రం సంకోచం లేకుండా ప్రభుత్వం చెప్పినా సరే. వరి పంట సాగు చేస్తున్నారు" అని ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు.
కర్ణాటక 65 శాతం నీటిని, ఏపీ 35 శాతం వినియోగించుకోవాలి. అయితే, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. అదనపు నీరు దేవుడెరుగు, కేటాయింపుల్లో నీటి వాటా కూడా సక్రమంగా రాని పరిస్థితి ఏర్పడిందని రాయలసీమ ప్రధానంగా కర్నూలు, అనంతపురం ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమస్యలపై మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు.
Next Story

