రైతుల ఆశలు కాలువల్లో ఆవిరి..!
x
కృష్ణా డెల్టాలో తూటాకుతో నిండిపోయిన కాలువ

రైతుల ఆశలు కాలువల్లో ఆవిరి..!

సాగునీటి రంగంలో నిర్లక్ష్యం, ప్రస్తుత చర్యలు, వాస్తవం.


రాష్ట్రంలో సాగునీటి కాలువల నిర్వహణ, మరమ్మతు, పూడికతీత పనులకు రూ.397 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రకటన వెనుక రాష్ట్ర సాగునీటి వ్యవస్థ ఎంత దారుణంగా నాశనమైందనే వాస్తవం దాక్కుంది.

గత ఐదేళ్ల జగన్‌మోహన్ రెడ్డి పాలనలో కాలువల నిర్వహణ, పూడికతీత వంటి అత్యవసర పనులకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిన వైనం మంత్రి ఎండగట్టారు. “కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులకు రూ.1,100 కోట్లు కేటాయించి అన్నదాతల బాధ్యత నెరవేర్చింది” అని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు, నీటి అడ్డంకులు తొలగింపు, పూడికతీత పనులకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ప్రకటించారు.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు మంత్రి. సీజన్ మొదలయ్యేలోపు కాలువల పూడికతీత, తవ్వకం, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి అత్యవసర పనులు పూర్తి చేయాలని సూచించారు. రూ.10 లక్షల లోపు పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో నామినేషన్ పద్ధతిలో చేపట్టవచ్చని, రూ.10 లక్షలు దాటినవాటికి షార్ట్ టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను అసిస్టెంట్ ఇంజనీర్ స్వయంగా పరిశీలించి, సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయని ధృవీకరణ పత్రం చీఫ్ ఇంజనీర్‌కు సమర్పించాలని కూడా తెలిపారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో మే నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.


మురుగు కాలువగా మారిన పంట కాలువ

సమస్య మూలాల్లో ఉంది!

రాయలసీమలోని ప్రధాన కాలువలు, మేజర్ కాలువలు నిత్యం మరమ్మతులకు గురవుతూనే ఉన్నాయి. పంట కాలువల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రాజెక్టులు ఉన్నా పొలాల్లోకి సాగునీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాలువలు తూటాకులతో, పూడికతో నిండిపోయి నీరు ముందుకు సాగడం లేదు. వేసవిలోనే పూడికలు తీయించాల్సిన అవసరం ఉంది కానీ, గత ప్రభుత్వం లస్కర్ల వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. కాలువలపై లస్కర్లు ఉంటేనే సాగునీరు రైతుల వరకు చేరుతుంది, సమస్యలను ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్తారు. ఆ వ్యవస్థను ధ్వంసం చేయడంతో ఇంజనీర్లు-రైతుల మధ్య మధ్యవర్తిత్వం కూడా కనుమరుగైంది. ఫలితంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, లస్కర్ల వ్యవస్థ పునరుద్ధరణ, కాలువల సమగ్ర మరమ్మత్తు, దీర్ఘకాలిక పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోతే ఈ చర్యలు కేవలం తాత్కాలిక మందులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. రైతు ఆదాయం, రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకతపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాగునీటి కాలువలు కేవలం కాలువలు కాదు, జీవనాధారాలు. వాటిని గాడిలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఆర్థిక-సామాజిక బాధ్యత.

ప్రభుత్వం ప్రకటించిన నిధులు, ఆదేశాలు అమలులోకి వచ్చి, రైతుల పొలాల్లోకి నీరు చేరినప్పుడే నిజమైన విజయం. లేనివేళ ఈ ప్రకటనలు కూడా గత పాలనలా కేవలం “కాగితపు హామీలు”గా మిగిలిపోయే అవకాశం ఉంది. రైతులు ఎదురుచూస్తున్నది ప్రకటనలు కాదు, పంటలు పండే నీరు!

కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి)

“ఆత్మకూరు చెరువు ఆయకట్టు కాలువలు (సర్వే నం. 904, 913, 920, 928) రియల్ ఎస్టేట్ ఆక్రమణలతో, మట్టి కట్టలతో పూర్తిగా మూసుకుపోయాయి. నీరు ప్రవహించడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. గతంలో కలెక్టర్ ఆదేశాలు ఉన్నా చర్యలు లేవు. వెంటనే ఆక్రమణలు తొలగించి కాలువలను శుభ్రపరచి మరమ్మతు చేయాలి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.”

కె. వెంకటేశులు (రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆదోని/కర్నూలు)

“పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీర్చాలి. వేదావతి ప్రాజెక్టు, ఆర్‌డీఎస్ కుడి కాలువ, మేలి గనూరు వరద కాలువల మరమ్మతు-నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి. కాలువల్లో పూడిక, లీకేజీలు ఉంటే రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.”

డి. చిన్నప్పయ్య యాదవ్ (ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అనంతపురం జిల్లా అధ్యక్షుడు)

“ట్యాంకుల కింది కాలువలు 10 ఏళ్లుగా మరమ్మతు లేకుండా ఉన్నాయి. పూడిక, కలుపు మొక్కల వల్ల కాలువ చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. రైతులు సొంత ఖర్చుతో క్లీన్ చేస్తున్నా సరిపోవడం లేదు. ఖరీఫ్ ముందు యుద్ధప్రాతిపదికపై డీసిల్టింగ్, రిపేర్లు చేయాలి.”

అక్కినేని భావని ప్రసాద్ (కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షుడు)

“కృష్ణ-గోదావరి కాలువల మరమ్మతు ఆలస్యం వల్ల టైలెండ్ రైతులు భారీగా నష్టపోతున్నారు. అప్‌స్ట్రీమ్ స్టేట్స్ ప్రాజెక్టులు, స్థానికంగా పూడిక-లీకేజీలు కలిసి నీరు తగ్గుతోంది. ప్రభుత్వం ఇప్పుడు ఫండ్స్ విడుదల చేస్తున్నా, గోదావరి జిల్లాల్లో డీసిల్టింగ్-షట్టర్ రిపేర్లు వేగంగా పూర్తి చేయాలి. లేకపోతే ఖరీఫ్ సీజన్‌లో ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి.”

Read More
Next Story